మరోసారి కర్నాటకలో రిసార్ట్ రాజకీయాలు, కాంగ్రెస్ అప్రమత్తం

రాజ్యసభ ఎన్నికల వేళ కర్నాటక లో రాజకీయం వేడెక్కింది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తన ఎమ్మెల్యేలను రిసార్ట్ కు తరలించింది.

Update: 2024-02-24 06:16 GMT

రాజ్యసభ ఎన్నికల వేళ కర్నాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మరోసారి రిసార్ట్/హోటల్ రాజకీయాలను ప్రారంభించింది. కర్నాటక నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగుతున్న వేళ బీజేపీ- జేడీఎస్ కూటమి నుంచి ఒకరికి బదులు, అదనంగా మరో వ్యక్తి నామినేషన్ వేయడంతో ఎన్నికలు అనివార్యం అయ్యాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది. తన పార్టీకి చెందిన 135 మంది ఎమ్మెల్యేలను శాసనసభ సమావేశాల అనంతరం బెంగళూర్ లోని ఓ రిసార్ట్ కు తరలించినట్లు కర్నాటక పీసీసీ చీఫ్, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చెప్పారు.

" ఫిబ్రవరి 27న రాజ్యసభకు ఎన్నికలు ఉన్నాయి. అదే రోజు ఎమ్మెల్యేలంతా కలిసి విధాన సౌధకు వస్తారు. అక్కడే ఓటు వేస్తారు. మేమంతా జాగ్రత్తగా ఉండాలి. మాతో కూడా కొంతమంది టచ్ లో ఉన్నారు. కానీ వారి పేర్లను మేము బహిర్గతం చేయదల్చుకోలేదు. మా భద్రతకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తాం" అని ఆయన విలేకరులతో చెప్పారు. ఎన్నికల కోసం మాక్ డ్రిల్ తో పాటు, ఇద్దరు మంత్రులు, మరో ఎనిమిది మంది సమన్వయ కర్తలను నియమించినట్లు తెలిపారు.
మరోవైపు ముఖ్యమంత్రి సిద్దరామయ్య కూడా కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశానికి పిలుపునిచ్చారు. సోమవారం మధ్యాహ్నం 3.30 నిమిషాలకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణ్ దీప్ సింగ్ సూర్జేవాలా , పార్టీ కోశాధికారి అజయ్ మాకెన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు.
కర్నాటక అసెంబ్లీ 224 మంది శాసన సభ్యులు ఉన్నారు. వారిలో 135 మంది ఎమ్మెల్యేల బలం కాంగ్రెస్ పార్టీ సొంతం. కాగా ప్రతిపక్ష బీజేపీకి 66 మంది ఎమ్మెల్యేలు, జేడీఎస్ కు 19 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక్కో రాజ్యసభ స్థానం గెలుపొందడానికి 45 మంది ఎమ్మెల్యేలు అవసరం. కానీ ఎక్కువ మంది అభ్యర్థులు పోటీకి దిగడంతో ప్రాధాన్యత ఓట్లు కీలక పాత్ర వహిస్తాయి.
గురువారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో జేడీఎస్ నేత హెచ్ డీ కుమారస్వామి భేటీ అయ్యారు. దీనిపై డీకే శివకుమార్ ను విలేకరులు ప్రశ్నించగా.." ఎవరు ఆందోళన చెందాల్సిన పనిలేదు. మా ఏర్పాటు మాకు ఉన్నాయి. మాతో కూడా చాలా మంది టచ్ లో ఉన్నారు. మా ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యులు, స్నేహితులకు ఫోన్ లు వస్తున్నాయి.
వారు ఢిల్లీలో ఏం చర్చలు జరిపారో కూడా మాకు తెలుసు, అన్ని పార్టీలకు చెందిన ప్రతి ఒక్కరిపై నిఘా ఉంది" అని సమాధానమిచ్చారు. కళ్యాణ రాజ్యప్రగతికి పార్టీకి చెందిన ఎమ్మెల్యే జనార్ధన్ రెడ్డి సహ మరో ముగ్గురు ఎమ్మెల్యేల మద్దతు మాకే ఉంది. దీంతో కాంగ్రెస్ పార్టీ బలం 138 పెరిగిందని కేపీసీసీ చీఫ్ డీకే చెబుతున్నారు.
రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున అజయ్ మాకెన్, సయ్యద్ నసీర్ హుస్సేన్, జీసీ చంద్రశేఖర్, బీజేపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ నారాయణ్ సా బండేజ్ లను బరిలోకి దింపింది. అయితే జేడీ(ఎస్) నుంచి మాజీ రాజ్యసభ సభ్యుడు డి కుపేంద్ర రెడ్డి కూడా నామినేషన్ వేయడంతో పోటీ అనివార్యమైంది.


Tags:    

Similar News