కేంద్రం మీద కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అక్కసు..

"నేను ఇతర భాషలను నేర్చుకోవద్దని చెప్పను. కానీ కన్నడలో మాట్లాడటం మర్చిపోవద్దు" - కర్ణాటక సీఎం సిద్ధరామయ్య.

Update: 2024-11-01 10:48 GMT

కేంద్రం మీద అక్కసును మరోసారి బయటపెట్టారు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య. ప్రధాని మోదీ వైఖరిని తప్పుబట్టారు. ఆవు పాలను పూర్తిగా పితికిస్తే దూడకు పౌష్టికాహార లోపం తలెత్తుతుందని వ్యాఖ్యనించారు. కేంద్రానికి ఏటా రూ. 4 లక్షల కోట్ల ఆదాయాన్ని సమకూరుస్తున్నా.. తమకు మాత్రం రూ. 55 వేల కోట్ల నుంచి రూ.60 వేల కోట్లు మాత్రమే ఇస్తుండడంపై మండిపడ్డారు. 69వ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బెంగళూరులో ప్రజలనుద్దేశించి సిద్ధరామయ్య ప్రసంగించారు. కేంద్రానికి అత్యధిక ఆదాయాన్ని సమకూరుస్తున్న మహారాష్ట్ర తర్వాత రెండో స్థానంలో ఉన్నా.. రాష్ట్ర వాటా విషయంలో కేంద్రం అన్యాయంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

"ఆవు ఇస్తుంది కదా పాలన్నీ లాగేసుకోకూడదు. దూడకు కూడా కొంచెం వదలాలి. లేదంటే పౌష్టికాహార సమస్య తలెత్తుతుంది. ఇది ఎవరూ మర్చిపోకూడదు." అని కేంద్రానుద్దేశించి అన్నారు.

కన్నడలోనే మాట్లాడుకుందాం..

కన్నడ భాషను గౌరవించాలని, వీలైనంత వరకు రోజువారీ జీవితంలో కన్నడలోనే మాట్లాడాలని సిద్ధరామయ్య ప్రజలను కోరారు. కర్ణాటకలోని ప్రజలు ఏ భాష మాట్లాడినా, ఏ మతం లేదా కులానికి చెందిన వారైనా, రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ కన్నడిగులేనని అన్నారు. కన్నడకు 7వేల ఏళ్ల చరిత్ర ఉన్నందువల్లే కేంద్రం సాంప్రదాయ భాషగా గుర్తించిందని తెలిపారు. భాష పట్ల విపరీత అభిమానం ఉండకూడదని, అయితే మన భాషపై ఉన్న అహంకారాన్ని మాత్రం ఎప్పటికీ వదులుకోకూడదని, మనందరం కన్నడ భాష ప్రేమికులుగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

"నేను ఇతర భాషలను నేర్చుకోవద్దని చెప్పను. కానీ కన్నడలో మాట్లాడటం మర్చిపోవద్దు" అని చెప్పారు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య. 

Tags:    

Similar News