‘‘పెద్ద నగరంలో అలాంటివి సాధారణం’’ మహిళను వెంబడించడంపై మంత్రి స్పందన

బెంగళూర్ లో మహిళను వేధించిన వైరల్ వీడియో పై హోంమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు;

Update: 2025-04-07 09:43 GMT
కర్ణాటక హోంమంత్రి జీ. పరమేశ్వర

కర్ణాటక హోంమంత్రి జీ పరమేశ్వర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బెంగళూర్ వీధిలో మహిళను ఓ దుండగుడు వెంటాడుతున్న వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్ గా మారింది. ఈ విషయం ఆయనను ప్రశ్నించగా.. ‘‘ బెంగళూర్ పెద్ద నగరం, ఇలాంటివి సంఘటనలు జరగవచ్చు’’ అని బాధ్యతారహితంగా మాట్లాడారు.

‘‘ఇలాంటి పెద్ద నగరంలో ఇలాంటి సంఘటనలు అక్కడక్కడ జరుగుతూనే ఉంటాయి. చట్టపరంగా ఎలాంటి చర్య తీసుకోవాలో అదే జరిగి తీరుతుంది’’ అన్నారు. మంత్రి మాటలపై ఆగ్రహం వ్యక్తం అవుతోంది. మహిళల భద్రతపై ప్రభుత్వ ప్రతిస్పందనపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

పెట్రోలింగ్ మెరుగుపరచాలి..
పెట్రోలింగ్ ను మెరుగుపరచాల్సిన అవసరాన్ని తాను ఎల్లప్పుడూ సమర్థించానని మంత్రి చెప్పారు. ‘‘నేను పోలీస్ కమిషనర్ తో మాట్లాడి జాగ్రత్తగా ఉండాలని చెప్పాను. పెట్రోలింగ్ ద్వారా అన్ని ప్రాంతాలను పర్యవేక్షించాలని రోజూ చెబుతూనే ఉన్నాను.
ఇది నేను దాదాపు ప్రతిరోజు చెప్పే విషయమే? కొన్ని సంఘటనలు ఇక్కడ, అక్కడ జరిగినప్పుడూ ప్రజల దృష్టి వారి వైపు మళ్లుతుంది. పోలీసులు 24x7 పనిచేస్తున్నారు. ఇంత పెద్ద నగరంలో ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. మేము చట్టప్రకారం చర్యలు తీసుకుంటాము’’ అని ఆయన అన్నారు.
మహిళను వెంబడిస్తున్న సంఘటన ఏప్రిల్ 3న నగరంలోని బీటీఎం లేఅవుట్ లో జరిగింది. ఇది సీసీటీవీలో రికార్డు అయింది. ఆ ఫుటేజ్ లో ఒక వ్యక్తి మహిళను వెంబడిస్తున్నట్లు, ఇదే సమయంలో మరో మహిళ వచ్చి బాధిత యువతితో పాటు పారిపోతున్నట్లు కనిపించింది.
సదరు వీడియోలో మహిళలు భయపడినట్లు స్పష్టంగా కనిపించింది. ఈ ఫుటేజీ ప్రకారం.. పోలీసులు దాడి, లైంగిక దాడి వేధింపులు, వెంటాడటం వంటి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే ఆ మహిళ ఫిర్యాదు చేయడానికి రాకపోవడంతో ఎవరో ఇంకా తెలియరాలేదు.
బీజేపీ విమర్శలు..
ఈ సంఘటనపై ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వం పై విమర్శలు గుప్పించింది. వైరల్ వీడియో నగర శాంతి భద్రతల వాస్తవాన్ని బయటపెట్టిందని, బెంగళూర్ మహిళలకు ‘‘అసురక్షితంగా’’ మారుతుందని ఆరోపించింది.
బీజేపీ అధికార ప్రతినిధి ప్రశాంత్ జీ మాట్లాడుతూ.. ‘‘ఇది చాలా అనుచితమైన వ్యాఖ్యలు. లైంగిక వేధింపులు, మహిళలపై నేరాలకు ఆయన సాధారణ సమస్యగా చూస్తున్నారు. అలాగే చిత్రీకరిస్తున్నారు. ఇది బాధ్యతల నుంచి తప్పించుకోవడమే.. జవాబుదారితనంగా ఉండటానికి ఇష్టపడటం లేదు’’ అని విమర్శించారు.
హోంమంత్రి వ్యాఖ్య ఆయన నిస్సహాయతను ప్రతిబింబిస్తుందని బీజేపీ ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి అశ్వత్ నారాయణ్ అన్నారు. ‘‘ఈ సంఘటన ఖండించదగినది. హోంమంత్రి స్పందన అసహ్యంగా, నిరుత్సాహపరిచే విధంగా ఉంది. ఈ సంఘటనలు, ప్రకటనల కారణంగా ప్రజలు విశ్వాసం కోల్పోతున్నారు. హోంమంత్రిగా ఆయన ఎంత నిస్సహాయంగా ఉన్నారో ఆయన ప్రకటన చూపిస్తుంది. ఆయన బాధ్యతాయుతమైన ప్రకటన చేయాలి’’ అని అన్నారు.
Tags:    

Similar News