‘వీఆర్ఓ, వీఆర్ఏ‌లకు త్వరలో పరీక్ష’

Update: 2025-07-05 13:29 GMT

వీఆర్ఓ, వీఆర్ఏలకు మంత్రి పొంగులేటి గుడ్ న్యూస్ చెప్పారు. గ్రామ పాలనాధికారి పోస్ట్ భర్తీ ప్రక్రియలో వారికి మరోసారి అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఈ పరీక్షకు సంబంధించిన షెడ్యూల్ అతి త్వరలోనే ఇస్తామని చెప్పారు. ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక గ్రామ పాలనాధికారి ఉంటారని ఆయన చెప్పారు. రెవెన్యూ ఉద్యోగ సంఘాలతో శనివారం ఆయన సమావేశమయ్యారు. ఈ క్రమంలోనే రెవెన్యూ వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, అందులో భాగంగానే గ్రామ పరిపాలనాధికారి నియామకాన్ని చేపట్టిందని అన్నారు. వీఆర్ఓ, వీఆర్‌ఏలుగా పనిచేసేవారికి ఈ నియామకాల్లో అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. ఇందుకోసం వారు అర్హత పరీక్ష రాయాల్సి ఉంటుందని చెప్పారు. ఇప్పటికే ఒకసారి నిర్వహించిన ఈ ప్రత్యేక పరీక్ష ద్వారా 3,454 మంది అర్హత సాధించారని కూడా ఆయన వెల్లడించారు. రెవెన్యూ ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు వీఆర్ఓ, వీఆర్ఏలకు మరో అవకాశం ఇవ్వాలని నిర్ణయించామని, ఈ పరీక్ష అతిత్వరలో నిర్వహిస్తామని ఆయన చెప్పారు.

అసలెవరీ వీఏఓ?

గ్రామ స్థాయిలో ప్రాథమిక రెవెన్యూ, పరిపాలనా విధులను నిర్వర్తించే అధికారే వీఏఓ (విలేజ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్). వీళ్లు గ్రామ రెవెన్యూ రికార్డులను నిర్వహించడంతో పాటు భూమి పన్నులు వసూలు చేయడం, గ్రామస్తులకు అవసరమైన రెవెన్యూ సేవలు అందించడం వీరి విధులు. దాంతో పాటుగానే గ్రామ స్థాయిలో శాంతి భద్రతలను కాపాడటంలో పోలీసులకు పూర్తి సహకారం అందించాలి. ప్రభుత్వ పథకాల అమలును పర్యవేక్షించాలి. అన్ని పథకాలు ప్రతి అర్హుడికి అందేలా చూడాలి. గ్రామ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగమవ్వాలి. తెలంగాణ ప్రభుత్వం.. 2020లో గ్రామ పాలనాధికారుల వ్యవస్థను ప్రవేశపెట్టింది.

ఈ గ్రామ పాలనాధికారులను అర్హత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. ఈ పరీక్షను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ నిర్వహిస్తుంది. ఎంపికైన వారిని గ్రామాల్లోని రెవెన్యూ కార్యాలయాల్లో నియమిస్తారు.

Tags:    

Similar News