సృష్టి ఫర్టిలిటీ సెంటర్ కేసులో కీలక పరిణామం
మరో ముగ్గురు అరెస్ట్;
సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ కేసులో మరో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. ఒకవైపు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నవారికి కోర్టు నుంచి పోలీసు కస్టడీ పొందారు. ఈ కేసులో ఏ3గా ఉన్న విశాఖ సృష్టి కేంద్రం మేనేజర్ కల్యాణి, ఏ6 గా ఉన్న అస్సాంకు చెందిన ధన శ్రీ సంతోషినికి కోర్టు పోలీసు కస్టడీ విధించింది. అనంతరం వారిని ఉత్తర మండల డీసీపీ కార్యాలయానికి తరలించారు. ఇద్దరినీ 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు చేసిన అభ్యర్థనకు సికింద్రాబాద్ సివిల్ కోర్టు ఆమోదం తెలిపింది. ఆ మేరకు ఆదేశాలు జారీచేసింది.
సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌లో పిల్లలు లేని వారికి సరోగసీ పేరుతో పలువురు దంపతులను వీళ్లు మోసం చేస్తున్నారు అని పోలీసులు తెలిపారు. దళారుల సాయంతో అస్సాంకు చెందిన ఓ మహిళ నుంచి బిడ్డను కొనుగోలు చేసిన ప్రధాన నిందితురాలైన డాక్టర్ నమ్రత రాజస్థాన్ దంపతులకు అప్పగించారు. మరోవైపు నిబంధనలకు విరుద్ధంగా వీర్యం, అండాలు సేకరించి ఇతర రాష్ట్రాల్లో విక్రయించిన ఆరోపణలు ఆమెపై ఉన్నాయి.
మరో ముగ్గురు అరెస్ట్
సరోగసీ పేరుతో రాజస్థాన్ దంపతులను మోసం చేసిన కేసులో తాజాగా శనివారం మరో ముగ్గురు అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయిన వారిలో మహిళలు ఉన్నారు. దీంతో ఇప్పటివరకు అరెస్టైన నిందితుల సంఖ్య 11కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో డాక్టర్ నమ్రతకు మహిళలే దళారులుగా ఉన్నారని హైదరాబాద్ పోలీసులు చెప్పారు. శిశువుల కొనుగోలు, అమ్మకాల్లో డాక్టర్ నమ్రతకు ఈ దళారులే సహకరించారని పోలీసులు చెప్పారు. దళారులకు డాక్టర్ నమ్రత భారీగా బహుమానాలు ఇచ్చారని పోలీసులు వెల్లడించారు. సృష్టి కేసుకు సంబంధించిన కీలక విషయాలను హైదరాబాద్ పోలీసులు వెల్లడించారు.
భారీ నెట్ వర్క్
తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే గాక దేశ వ్యాప్తంగా డాక్టర్ నమ్రతకు భారీ నెట్‌వర్క్ ఉందని పోలీసులు వెల్లడించారు. సంతానం లేని వారికి సంతానం కోసం ఫ్రీ క్యాంపులు నిర్వహించారని పోలీసులు తెలిపారు. తన దగ్గరికి వచ్చే పిల్లలు లేని దంపతులకు పండంటి బిడ్డ పుడతారని నమ్మబలికి, మోసం చేసిందని పోలీసులు తెలిపారు. ట్రీట్‌మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత ఐవీఎఫ్ వర్కవుట్ కాదని నిర్ధారించేవారు. సరోగసీకి వెళ్లమని చెప్పేవారు. సరోగసీ కోసం దంపతుల నుంచి రూ. ౩౦ లక్షల నుంచి రూ. 50 లక్షలు వసూలు చేసేవారని పోలీసులు వెల్లడించారు. పిల్లలను వద్దనుకున్న యువతులకు డబ్బు ఆశ చూపి బిడ్డలను కొనుగోలు చేసే వారు డాక్టర్ నమ్రత. ఆ బిడ్డలను సరోగసీ ద్వారా పుట్టారంటూ పిల్లలు లేని దంపతులకు డాక్టర్ నమ్రత విక్రయించేవారని పోలీసులు తెలిపారు.