ప్రముఖ కొరియోగ్రాఫర్ కృష్ణపై పోక్సో కేసు
మైనర్ బాలికతో అసభ్య ప్రవర్తన కేసులో అరెస్ట్;
మరో కొరియో గ్రాఫర్ పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఓ మైనర్ బాలిక పట్ల అనుచితంగా ప్రవర్తించిన కేసులో ‘‘ఢీ’’ కొరియోగ్రాఫర్ కృష్ణ మాస్టర్‌ను గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేశారు.ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఉదంతం మరిచిపోకముందే కృష్ణ మాస్టర్ అరెస్ట్ కావడం సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది.
గత నెలలో గచ్చిబౌలి పోలీసులు కృష్ణ మాస్టర్ పై పోక్సో కేసు నమోదు చేశారు. అయితే అప్పట్నుంచి అతను తప్పించుకు తిరుగుతున్నాడు. బెంగుళూరులో తన అన్న నివాసంలో కృష్ణ తలదాచుకున్నట్లు సమాచారం అందుకున్నగచ్చిబౌలి పోలీసులు కృష్ణను అదుపులోకి తీసుకుని హైదరాబాద్ కు తరలించారు. కోర్టులో హాజరుపర్చిన అనంతరం కంది జైలుకు తరలించారు.
కృష్ణ రియాల్టీ షో ఢీ కు కొరియోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కృష్ణ మాస్టర్‌పై గతనెల బాలిక కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పీఎస్‌లో కేసు నమోదు చేశారు. పోక్సో కేసు నమోదు అనంతరం కృష్ణ మాస్టర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు.ఇటీవలే కృష్ణకు వివాహం అయ్యిందని.. భార్యకు సంబంధించిన 9 లక్షల నగదు తీసుకుని వెళ్లిపోయాడని ప్రచారంలో ఉంది. గతంలో ఇన్ స్టా ద్వారా పలువురు అమ్మాయిలను, మహిళలను మోసం చేసినట్లు కృష్ణ పై అభియోగాలు ఉన్నాయి.
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల వ్యవహారం గత సంవత్సరం ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. తనను లైంగికంగా వేధించాడని ఓ అమ్మాయి ఫిర్యాదు చేయగా జానీ మాస్టర్‌పై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరిపారు. ఈ నేపథ్యంలో తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి ఆధ్వర్యంలో ఏర్పాటైన లైంగిక వేధింపుల పరిష్కార కమిటీ కూడా ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించింది.
" సినీ పరిశ్రమలో అవకాశాలు పోతాయని చాలా మంది అమ్మాయిలు తమకు జరుగుతున్న అన్యాయాలపై కంప్లైట్ చేయడం లేదు’’ అని లైంగిక వేధింపుల పరిష్కార కమిటీ చైర్ పర్సన్ ఝాన్సీ అన్నారు.
"సినీ పరిశ్రమలో మహిళలపై లైంగిక వేధింపుల కేసులు గతంలో నమోదయ్యాయి. కొన్ని మా దృష్టికి రావడం లేదు. మా కమిటీ దృష్టికి వచ్చిన ప్రతీ సమస్యను పరిష్కరిస్తున్నాం’’ అని లైంగిక వేధింపుల పరిష్కార కమిటీ సభ్యుడు తమ్మారెడ్డి భరద్వాజ తెలిపారు.