‘రేవంత్ తీరు మార్చుకో’
ప్రతిపక్షాలపై ఆరోపణలు మాని, పాలనపై దృష్టి సారించాలన్న రాజగోపాల్ రెడ్డి.;
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీరుపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ తాను మాట్లాడే తీరు మార్చుకోవాలని సూచించారు. అధికారంలో ఉన్న వ్యక్తి బాధ్యతతో మెలగాలని సూచించారు. అంతేకాకుండా ఎక్కడికి వెళ్లినా ప్రతిపక్షాలను తిట్టడం మానుకుని ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలని అన్నారు. ఢిల్లీలో జరుగుతున్న బీసీ ధర్నా సందర్భంగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాజగోపాల్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రేవంత్ తీరును ఆయన తప్పుబట్టారు. “సీఎం రేవంత్ తన భాష మార్చుకోవాలి. ప్రతిపక్షాలపై విమర్శలు మానేయాలి. ప్రభుత్వం ఏం చేస్తోంది? ఏమి చేయబోతుంది? ప్రజలకు చెప్పాలి. మంత్రి పదవి విషయంలో కాంగ్రెస్ అధిష్టానం నాతో హామీ ఇచ్చింది. ఇది వెంకట్ రెడ్డికి తెలియకపోవచ్చు. మాకు పదవి కావాలంటే అప్పుడే కేసీఆర్ ఇచ్చేవారు. కానీ మేం కలిసి ఉండటంతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది’’ అని అన్నారు.
“తెలంగాణను ఇప్పుడు సీమాంధ్ర కాంట్రాక్టర్లు దోచుకుంటున్నారు. రేవంత్ రెడ్డి కమిషన్ల పేరిట కాలయాపన చేస్తున్నారు. కాళేశ్వరం అవినీతిపై నిజమైన చర్యలు తీసుకోవాలి. ఇంకా మూడున్నరేళ్లపాటు రేవంత్ సీఎం అవుతారు గానీ, వాగ్దానాలకు వ్యతిరేకంగా పాలిస్తే ప్రజలు సమాధానం చెబుతారు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఫ్రస్టేషన్‌లో ఉంది. ప్రతిపక్షంగా వాళ్లు బలహీనంగా మారారు. ప్రతిపక్ష నేత పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలి” అంటూ రాజగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు.
అయితే కొంతకాలంగా రేవంత్ రెడ్డిని దాదాపు అన్ని విషయాల్లో రాజగోపాల్ రెడ్డి వ్యతిరేకిస్తున్నారు. రేవంత్ రెడ్డి ఎడ్డెమంటే.. అది ఏ అంశమైన రాజగోపాల్ రెడ్డి సమాధానం తెడ్డెం అన్నట్లే ఉంటుంది. పదేళ్లు నేనే సీఎం అన్న రేవంత్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు రాజగోపాల్. ఆ తర్వాత జర్నలిస్టుల విషయంలో కూడా రేవంత్‌కు వ్యతిరేకంగా విలేకరులకే రాజగోపాల్ మద్దతుపలికారు. ఇటీవల మంత్రి పదవిపై కూడా రాజగోపాల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్ రోజురోజుకు హాట్ టాపిక్‌గా మారుతోంది.