తేరుకున్న ఎంజీబిఎస్

మూసీ కి ఔట్ ప్లో తగ్గడంతో నిర్ణయం

Update: 2025-09-28 11:15 GMT

మూసీ వరదతాకిడికి గురైన ఎంజీబిఎస్ ఆదివారం తేరుకుంది. మూసీ ఉగ్రరూపం దాల్చడంతో బాటు భారీ వర్షాల కారణంగా ఆసియాలోనే అతి పెద్ద బస్టాండ్ గా నిలిచిన మహాత్మాగాంధీ బస్టాండ్ లో శనివారం బస్సుల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. బస్టాండ్ వరద ప్రవాహంలో చిక్కుకుపోవడంతో ఆర్టీసీ పికప్ పాయింట్లను ఏర్పాటు చేసింది. జూబ్లి బస్టాండ్, ఆరాంఘర్ చౌరస్తా, ఉప్పల్ బస్టాండ్, ఎల్ బినగర్ లలో పికప్ పాయింట్లను ఆర్టీసీ ఏర్పాటు చేసింది.

జంట జలాశయాలకు ఇన్ ప్లో తగ్గడంతో ఆదివారం ఔట్ ప్లో కూడా బాగా తగ్గింది దీంతో మూసీ శాంతించింది. శుక్రవారం నాడు జంటజలాశయాలకు ఇన్ ప్లో పెరగడంతో 36 వేల క్యూసెక్కుల నీటిని మూసీలోకి విడుదల చేశారు. ఒక్కసారిగా మూసీ వరద ప్రవాహం పెరగడంతో ఎంజీబిఎస్ బస్టాండ్ ను మూసి వేస్తున్నట్టు శనివారం ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆదివారం వరద తగ్గుముఖం పట్టడంతో ఎంజీబిఎస్ తేరుకుంది. బస్సుల రాకపోకలు యదావిధిగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం వరద తగ్గడంతో మూసీలోకి జంటజలాశయాలైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి 4,847 క్యూసెక్కుల నీటిని మూసీలోకి విడుదల చేస్తున్నారు. ఎంజీబిఎస్ బస్టాండ్ లో బురద పేరుకుపోవడంతో సిబ్బంది వాటిని శుభ్రం చేస్తున్నారు. ఉదయం తక్కువగా నడిచిన బస్సులు మధ్యాహ్నం నుంచి పెరిగాయి. ఉస్మాన్ సాగర్ కు 1100 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చి చేరుతోంది. ఇక్కడి నుంచి 844 క్యూసెక్కుల నీరు దిగువన ఉన్న మూసీలోకి విడుదల చేస్తున్నారు. హిమాయత్ సాగర్ కు 4వేల క్యూసెక్కులు చేరితే 3, 963 క్యూసెక్కుల నీరు మూసీలోకి విడుదల చేస్తున్నారు.

Tags:    

Similar News