ఇర్కోడ్ గ్రామీణ మహిళ విజయగాథ
ఒక్కసారి తింటే వదలరు..! సిద్ధి పచ్చళ్లకు దేశ విదేశాల్లో భారీ డిమాండ్;
ఇర్కోడ్ నాన్ వెజ్ పికిల్స్. ఇర్కోడ్ అనే ఊరు పేరు, నిన్న మొన్నటి దాకా చాలా మందికి తెలియదు. హైదరాబాద్ కు 110 కి.మీ దూరాన ఉన్న చిన్నగ్రామం. 5 వేల జనాభాతో, సిద్దపేట జిల్లా కేంద్రానికి 8 కిమీ దూరానా ఉంది. అయితే, ఇపుడు ఈ ఊరు పేరు రాష్ట్ర దేశ సరిహద్దులు దాటుతూ ఉంది. కారణం వూర్లో ఉండే 650 మహిళలు దారిద్రం నుంచి బయటపడేందుకు వీళ్లంతా చేతులు కలిపారు. చిన్న వ్యాపారం మొదలుపెట్టారు. అది ఇపుడు పెద్దవుతూ ఉంది. వాళ్ల వ్యాపారానికి తెలంగాణ ఫుడ్ కల్చర్ కి సంబంధం ఉంది.మీకు తెలుసుకదా, తెలంగాణలో మాంసాహారులు ఎక్కువ. దేశంలోనే ఇది నెంబర్ వన్.
మాంసాహార ఫుడ్ కల్చర్ ఆధారంగా ఒక చిరు వ్యాపారం చేయాలనుకున్నారు. అంతే. వాళ్ల వ్యాపారం మొగ్గ తొడిగింది. సిధ్దిపేట్ నాన్ వెజ్ పికిల్స్ బ్రాండ్ అవతరించింది. ఇపుడు వాళ్ల పికిల్స్ సిద్ధి పేట జిల్లాలోనే కాదు, అనేక ఇతర జిల్లాలకు, రాష్ట్రాలకు, విదేశాలకు వెళుతున్నాయి. ఇదెలా జరిగిందో చూద్దాం.
పేదరికం నుంచి స్వయం కృషితో విముక్తి చెందాలనుకుంటున్న వీళ్లందరిని దగ్గరికు చేర్చి సెల్ఫ్ హెల్ప్ గ్రూపులాగా ఏర్పాటుచేయడంలో సెర్ప్ అంటే సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ అనే ప్రభుత్వం సంస్థ చేయూత నిచ్చింది. వీళ్లంతా ఇలా ఎస్ హెచ్ జి గా ఏర్పాటు కావడంతో భవిషత్తుకు బాట ఏర్పడింది. ఏమిచేయాలి, ఏలాచేయాలి అనే ప్రశ్నలు , వాటికి సమాధానాలు వెదకడం ప్రారంభమయింది. అపుడు సిద్దపేట ఎమ్మెల్యే, మంత్రి హరీష్ రావు సహకారం కూడా లభించింది. ఈ సహకారం వల్ల ఈ మహిళా సంఘాలకు ICAR-నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ మీట్ తో సంబంధం ఏర్పడింది. ఈ సంస్థ వీళ్లకి చక్కగా, ఆరోగ్యవంతంగా, శుభ్రంగా వంటలు ఎలా చేయాలో నేర్పించింది. `మహిళల్ని స్వంత కాళ్ళపై నిలబడేలా మా ఎమ్మెల్యే హరీష్‌రావు ప్రయోగాత్మకంగా చేపట్టిన కార్యక్రమంతో సిద్ది బ్రాండ్ ఏర్పడిదంటున్నారు ఇర్కోడ్ గ్రామ సర్పంచ్ వినీత భర్త మారెడ్డి రవీందర్ రెడ్డి`.
ఆ తర్వాత ఈ ప్రాంతానికి ఏమి, అవసరమో ప్రజలు ఏమి తినాలని కొరుకుంటున్నారో సర్వే జరిగింది. ఈ మహిళలు సర్వే పాల్గొన్ని చుట్టుపక్కల ఊర్లలో ఉన్న ఆహారపుటలవాట్లను గ్రహించారు. తెలంగాణకు ఉన్న మాంసాహార గుర్తింపు తగ్గట్టు ఈ ప్రాంతంలో కూడా ప్రజలు మాంసాహారాన్నే కోరుకుంటున్నారు. అలా బిజినెస్ ఐడియా పట్టేశారు. మాంసాహార ఉరగాయలు చేయడం మొదలుపెట్టారు. ``ఎన్నో ఆశలతో నాన్ వెజ్ పికిల్స్ వ్యాపారం చేపట్టాం. తినే వారికి రుచి, మా జీవితాల్లో వెలుగు నింపింది సిద్ధి బ్రాండ్ అంటారు ఇర్కోడ్ మహిళా సమాఖ్యకు చెందిన మందాడి చందన``.
ఇర్కోడ్ మహిళా సమాఖ్య వివిధ కూరగాయలు, చికెన్, మటన్ పచ్చళ్ల ను, సిద్దిపేట బ్రాండ్ ఇమేజ్ 'సిద్ధి' పేరుతో తీసుకొచ్చింది. సిద్దిపేట పచ్చళ్ళు దేశవిదేశాలకు ఎగుమతి అవుతూ, ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాయి. కారంగా, ఘాటుగా, ఘుమఘుమలాడే సువాసనతో లభించే సిద్దిపేట పచ్చళ్లకు ప్రత్యేక గుర్తింపు పొందాయి. ఈ సువాసనను తన గడ్డమీద నిలబెట్టుకుంటూ.. పచ్చళ్ల తయారీకి అగ్రగామిగా ఎదుగుతోంది ఇర్కోడ. మొదట్లో రెండు లక్షలతో ప్రారంభించి, ఇప్పడు పెట్టుబడిని 20 లక్షలకు పెంచారు. సిద్దిపేటతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు నాన్-వెజ్ ఊరగాయలు, స్నాక్స్ తీసుకెళ్లడానికి మీట్ ఆన్ వీల్స్ పేరుతో డోర్ డెలివరి ఇస్తున్నారు. గత ఏడాది 20 లక్షల రూపాయలకు పైగానే ఆదాయం వచ్చిందని చందన ది ఫెడరల్‌తో చెప్పారు. చందన, లత ఆర్థికంగా బాగా స్థిరపడ్డారు. మీట్ ఆన్ వీల్స్‌తో వ్యాపారం బాగా పెరిగిందంటారు మందాడి చందన``.
ఇర్కోడ్ మహిళా సమాఖ్య ఫుడ్స్ పచ్చళ్ల స్పెషల్ ఏంటంటే? వీరు ఉపయోగించే నూనె. వెజ్, నాన్ వెజ్ ఊరగాయలను గానుగ నూనెతో తయారుచేస్తున్నారు. ఎద్దుతో నడిచే గానుక ద్వారా తీసిన నూనెను పచ్చళ్ల తయారీలో వాడుతున్నారు. విశేషం ఏమిటంటే ఇక్కడ గానుగ పట్టేది కూడా మహిళలే.
సాధారణంగా ఆవకాయ, దోసకాయ, గోంగూర వంటి పచ్చళ్ళే ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్నా, ఇప్పుడు నాన్ వెజ్ పచ్చళ్లకు విపరీతమైన క్రేజ్ పెరిగింది. మాంసాహార ప్రియులకు స్పెషల్‌గా కోడి పచ్చడి, మటన్ పచ్చడి, చేపల పచ్చడి, రొయ్యల పచ్చడి లాంటి వాటిని తయారు చేసి విక్రయిస్తున్నారు. కిలో వెజ్ పచ్చడి 400/-, చికెన్ 1,200/-, మటన్ 1,600/-, ఫిష్ 2,000/-, రొయ్యలు 2,500/- అమ్ముతున్నారు. ``చికెన్ పికిల్స్‌కు బాగా డిమాండ్ వుందంటారు మందాడి చందన``.
ఇర్కోడ్ గ్రామంతో పాటు, సిద్దిపేటలో పచ్చడి తయారీ, ఒక పెద్ద వ్యాపారంగా మారిపోయింది. మార్కెట్‌లో పచ్చళ్ల వ్యాపారం విస్తరిస్తూ, దేశవ్యాప్తంగా డిమాండ్‌ను సృష్టిస్తోంది. అంతేకాకుండా, విదేశాలకూ సిద్దిపేట పచ్చళ్ళు ఎగుమతి అవుతున్నాయి. సాధారణ వెజ్ పచ్చళ్లతో పాటు, నాన్ వెజ్ పచ్చళ్లకు కూడా డిమాండ్ ఉంది. సిద్దిపేట పచ్చళ్లను ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. అంతే కాకుండా, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, యూకే, గల్ఫ్ దేశాలకు కూడా ఈ పచ్చళ్లను పంపుతున్నారు. ప్రత్యేకంగా తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అమెరికాలో న్యూజెర్సీ, టెక్సాస్, కెనడాలో టొరంటో, ఆస్ట్రేలియాలో సిడ్నీ లాంటి ప్రదేశాల్లో సిద్దిపేట పచ్చళ్లకు డిమాండ్ పెరిగింది. ``మా పచ్చళ్ళు ఆర్గానిక్‌గా వుంటాయి. అందుకే అంత రుచిగా వుంటాయంటారు ఇర్రోడ్ మహిళా సమాఖ్య సభ్యురాలు మందాడి చందన``.
మహిళలు పురోగతి సాధించాలంటే ఒంటరి ప్రయత్నం కాకుండా, సమిష్టిగా కృషి చేయాలంటున్నారు సిద్దిపేట అర్బన్ డవలప్‌మెంట్ అథార్టీ ఛైర్మన్ మారెడ్డి రవీందర్‌రెడ్డి. "మేరా గావ్ మేరా గౌరవ్" కార్యక్రమం కింద 25 మంది మహిళలకు ICAR-నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ మీట్ శాస్త్రవేత్తలచే ప్రత్యేక శిక్షణ ఇప్పించి స్థానిక స్లాటర్ హౌస్ లో పచ్చళ్లు తయారు చేసుకోవడానికి ప్రభుత్వం తరఫున అవకాశం కల్పించారు. శిక్షణ పొందిన ఈ మహిళలు ఇప్పుడు "మీట్ ఆన్ వీల్స్" అనే మొబైల్ వాహనం ద్వారా తమ ఉత్పత్తులను విక్రయిస్తూ బాగా లాభాలు ఆర్జిస్తున్నారు. మహిళాదినోత్సవం నాడు హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్‌లో ఇర్కోడ్ మహిళల స్టాల్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సందర్శించి రాగి లడ్డూ తిని మహిళల్ని అభినందించారు. ``మహిళల్ని వ్యాపారవేత్తలు చేయాలనుకున్నాం. మా గ్రామ మహిళలకు ప్రపంచంలోనే గుర్తుంపు వచ్చిందంటారు సిద్దిపేట అర్బన్ డవలప్‌మెంట్ ఛైర్మన్ మా రెడ్డి రవీందర్‌రెడ్డి``.
పచ్చడి అంటే కేవలం భోజనం లోని ఓ భాగం మాత్రమే కాదు. అది మన సంస్కృతి, మన ఊరికి ప్రత్యేకత. సిద్దిపేట ఇప్పుడు తెలంగాణా పచ్చళ్ల రాజధానిగా మారిపోయింది. పచ్చళ్లను చిన్న చిన్న ప్యాకెట్లుగా సిద్ధి బ్రాండింగ్‌తో విక్రయిస్తున్నారు. కొరియర్ సర్వీసులో ఒప్పందం చేసుకొని విదేశాలకు పచ్చళ్లను పంపింస్తున్నారు. మామూలు పచ్చళ్లతో పాటు, నాన్ వెజ్ పచ్చళ్లకు కూడా ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తూ, దేశవిదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. గ్రామీణ మహిళలు భారీ ఆదాయం పొందుతున్నారు.