ఢిల్లీలో కాంగ్రెస్ చేస్తోంది ఉత్తుత్తి ధర్నానా..?

బీసీల కోసం కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలూ చిత్తశుద్ధితో పనిచేయట్లేదన్న కవిత.;

Update: 2025-08-06 06:55 GMT

బీసీ రిజర్వేన్ల కోసం తెలంగాణ కాంగ్రెస్.. ఢిల్లీలో జంతర్‌మంతర్‌లో మహాధర్నా చేపట్టింది. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్‌ బీసీ నేతలు, మంత్రులు ఢిల్లీకి చేరుకున్నారు. ఈ సమయంలో కాంగ్రెస్ ధర్నాపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో కాంగ్రెస్ చేస్తున్న ధర్నాను దొంగ దీక్షగా ఆమె అభివర్ణించారు. కాంగ్రెస్.. ఢిల్లీలో దొంగ దీక్షలు చేయడం కాదని, నిజమైన దీక్షలు చేయాలని సూచించారు. బీహార్ ఎన్నికల కోసమే కాంగ్రెస్ ఈ ధర్నా చేపట్టిందని, కానీ తెలంగాణ బీసీలకు కంటితుడుపు చర్యగా బీసీ రిజర్వేషన్ల కోసమే కేంద్రాన్ని ఢీ కొడుతున్నామని కల్లబొల్లి కబుర్లు చెబుతోందని విమర్శలు గుప్పించారు. సామాజిక తెలంగాణ అంటే ఢిల్లీకి వెళ్లి ఉత్తుత్తి ధర్నాలు చేయడం కాదని అన్నారు. బీసీల కోసం తాను 72 గంటల నిరాహార దీక్షకు పూనుకున్నానని గుర్తు చేశారు. కానీ కోర్టు నుంచి అనుమతి లభించకపోవడంతో విరమించుకోవాల్సి వచ్చింతని వివరించారు. అయినా బీసీల కోసం తెలంగాణ జాగృతి పోరాటం ఆగదని తెలిపారు. బీసీలకు న్యాయం జరిగే వరకు తాము పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు.

‘‘తెలంగాణ ఏర్పడిన తర్వాత అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరగాలని ప్రొఫెసర్ జయశంకర్ చెప్పేవారు. జై తెలంగాణ అనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. సామాజిక తెలంగాణ అంటే ఢిల్లీకి పోయి ఉత్తుత్తి ధర్నాలు చేయడం కాదు. కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో దొంగ దీక్షలు చేస్తున్నారు. అలాకాదు నిజమైన దీక్షలు చేయాలి. జాగృతిలో చేరడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు. మాకు అన్ని వర్గాల నుంచి మద్దతు ఉంది. బీసీల కోసం కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలూ చిత్తశుద్ధితో పనిచేయట్లేదు. ఈ అంశంలో తెలంగాణ జాగృతి తన కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఒక్కసారి కార్యాచరణ సిద్ధమైతే.. మా పోరాటాన్ని ఎవరూ అడ్డుకోలేరు. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలి. అన్ని పార్టీ నాయకులకు లేఖ రాయాలి. రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ తీసుకుని, అఖిలపక్ష నాయకులను ఢిల్లీకి తీసుకెళ్లాలని మేము డిమాండ్ చేశాం’’ అని కవిత అన్నారు.

Tags:    

Similar News