తెలంగాణలో ‘రాబందు’లకు సంరక్షణ కేంద్రం

ఆసిఫాబాద్ అడవిలో అన్ని ఏర్పాట్లు;

Update: 2025-07-12 00:41 GMT
పాలరాపుగుట్టపై రాబందులు...

 రాబందులు పర్యావరణ సంరక్షణలో కీలకపాత్ర పోషిస్తాయి. పశువుల కళేబరాలను పీక్కుతిని మనిషి చుట్టూ ఉన్న పరిసరాలను శుభ్రపరించి ఆరోగ్యకరమయిన వాతావరణం కల్పించేందుకు దోహదపడతాయి. మృతకళేబరాలను తినేస్తాయి కాబటి కుళ్లిన  పదార్థాలనుంచి వచ్చే జబ్బులు రాకుండా అడ్డుకుంటాయి. భూమి పోషకవిలువలను కాపాడతాయి. మనిషికి హానీ చేసే ఇతర పదార్థాలను కూడా అవి నిర్మూలిస్తాయి. వీటినుంచి మేలే తప్పకీడు లేదు. అయితే, మనిషికి మిత్రడుయిన రాబందులు ఈ మధ్య అంతర్థానపు అంచుల్లోపడిపోయాయి. మాయమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇది ప్రమాదకరం.

ఈ నేపథ్యంలో వీటి సంరక్షణకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ప్రాణహిత పెద్ద వాగుల తీరాన కాగజ్ నగర్ అడవుల్లో ఉన్న పాలరాపుగుట్ట (Palarapugutta) రాబందులకు నిలయంగా గుర్తించింది. రాబందుల జీవనానికి అనుకూలంగా ఉన్న గుట్టని కాపాడితే, అక్కడ వాటి సంతతి పెరిగేందుకు చర్యలు తీసుకుంటే ఈ జాతి మనుగడ సాధ్యమయవుతుందని అధికారులు భావించారు. దీనితో ఈపాలరాపు గుట్ట మీద  జటాయు సంరక్షణ కేంద్రాన్ని( Vultures Conservation Center) ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని అటవీ ప్రాంతాన్ని ఫారెస్ట్ రిజర్వుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో రాబందుల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటుకు అడ్డంకులు తొలగిపోయాయి.


రాబందుల అభయారణ్యం
అంతరించిపోతున్న రాబందులను పరిరక్షించేందుకు కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ అడవుల్లో (Komurambheem Asifabad Forest) పాలరావు గుట్టను రాబందుల సంరక్షణ కేంద్రంగా అభివృద్ధి చేయాలని తెలంగాణ అటవీ శాఖ నిర్ణయించింది.రాబందు శాస్త్రీయ నామం జిప్స్ బెంగలెన్సిస్. వీటి ఆవాసాలకు వీలుగా గుట్టపై రాళ్లకు చిన్న చిన్న రంధ్రాలు ఉండటంతో వీటి లోపల ఇవి ఆవాసాలను ఏర్పాటు చేసుకున్నాయి.ఈ కేంద్రం ఉన్నప్రాంతాన్ని ఫారెస్ట్ రిజర్వుగా ప్రకటించిన నేపథ్యంలో పాలరాపు గుట్టల వద్ద మనుషుల అలికిడి లేకుండా చేయాలని నిర్ణయించారు. వీటికి ఆహారం అందుబాటులో ఉంచి, అడవిలో నిప్పు రాజేయకుండా, నీరు కలుషితం కాకుండా చూడాలి. ఏకోటూరిజం అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు.



 రెండు నదుల తీరాన వెలసిన గుట్ట

గలగల పారుతున్న ప్రాణహిత, పెద్ద వాగు సంగమం వద్ద 300 మీటర్ల ఎత్తులో ఉన్న పాలరావుగుట్టపై రాబందుల గూళ్లు ఉన్నాయి.పదేళ్ల క్రితం ఈ గుట్టపై రాబందుల జాడను గుర్తించిన అధికారులు పాలరాపు గుట్టను జటాయు సంరక్షణ కేంద్రంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు.మహారాష్ట్రలోని కమలాపూర్ అడవి నుంచి ఇవి పాలరాపు గుట్టకు వచ్చి ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నాయి.ఇప్పటికే ఈ గుట్టపై 30 కిపైగా గూళ్లలో రాబందులున్నాయి. రాబందుల సంతతి పెంచి అవి అంతరించిపోకుండా పరిరక్షించేందుకు అటవీశాఖ నడుంకట్టింది.

రూ.2.5కోట్లతో ప్రతిపాదనలు
కాగజ్ నగర్ ఫారెస్ట్ రిజర్వుగా తాజాగా ప్రకటించడంతో రూ.2.5కోట్లతో పెంచికల్ పేట అటవీ రేంజ్ పరిధిలో రాబందుల అభయారణ్యాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. పాలరావుగుట్టపై రెండు రోజులకు ఒక సారి ఓ పశువు కళేబరాన్ని రాబందులకు ఆహారంగా అందించాలని నిర్ణయించారు.



 హైదరాబాద్ జూపార్కులో రాబందుల సంతానోత్పత్తి కేంద్రం

మహారాష్ట్ర నుంచి రాబందులను హైదరాబాద్ లోని నెహ్రూ జూపార్కుకు తీసుకువచ్చి సంతానోత్పత్తి చేస్తున్నారు. సెంట్రల్ జూ అథారిటీ రాబందుల సంతతి పెంచేందుకు నిధులు మంజూరు చేస్తుంది.రాబందు సంవత్సరానికి ఒక గుడ్డు మాత్రమే పెడుతుంది. ఈ గుడ్డును జాగ్రత్తగా పొదిగి పిల్ల జన్మించే వరకు పశువైద్యాధికారులు సంరక్షణ చర్యలు తీసుకోనున్నారు.

రాబందుల మృత్యువాతకు కారణాలెన్నో...
విద్యుదాఘాతాలు, గాలిపటాల దారాలు, విండ్ టర్బయిన్స్ వల్ల కూడా రాబందులు మృత్యువాత పడుతున్నాయి. వేగంగా అంతరించి పోతున్న వీటిని పరిరక్షించడానికి ప్రభుత్వం, అటవీశాఖ ముందుకు వచ్చింది. దీనికి పార్శీల సంఘాలు కూడా వీటి సంరక్షణకు చర్యలు చేపట్టాయి.ఏదైనా జంతువు మరణిస్తే ఆ కళేబరాన్ని ఊరి బయట పారేసేవారు. జంతువు కళేబరం రాబందులకు ఆహారంగా మారేది.చనిపోయిన జంతువుల కళేబరాలను రాబందులు ఆహారంగా తీసుకొని పరిసరాలను శుభ్రం చేయడంలో ప్రధానపాత్ర పోషిస్తాయి.కాని నేడు జంతువుల కళేబరాలను దహనం చేయడం, లేదా ఖననం చేయడం వల్ల రాబందులకు ఆహారం లభించడం లేదు.


 


పార్శీల ఆచారాలకు భంగం
రాబందుల సంఖ్య తగ్గడం వల్ల పార్శీల ఆచారాలకు భంగం వాటిల్లుతోంది. పార్శీలు వారి సంప్రదాయం ప్రకారం మృతదేహాన్ని పంచభూతాలకు దూరంగా ఉంచుతారు. కొద్దిగా ఎత్తుగా ఏర్పాటు చేసిన ప్రత్యేక శ్మశానవాటికల్లో పార్శీలు వారి భౌతిక కాయాలను రాబందుల ఆహారంగా ఉంచుతారు. రతన్ టాటా పార్థివ దేహాన్ని కూడా ముంబయిలో రాబందులకు ఆహారంగా ఉంచారు.



 అంతరించిపోతున్న రాబందులు

భారతదేశంలో ఒకప్పుడు పెద్ద సంఖ్యలో ఉన్న రాబందుల సంఖ్య ప్రస్తుతం 99శాతం తగ్గిపోయింది. అంతరించిపోతున్న అడవులు, పెరిగిన ఉష్ణోగ్రతలు, పారిశ్రామిక కాలుష్యం, రసాయనాల వాడకం వల్ల రాబందుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది.1990వ సంవత్సరంలో దేశంలో పదికోట్లకు పైగా రాబందులుండేవి. వీటి వల్ల పర్యావరణం పరిశుభ్రంగా ఉండేది. 1992 నుంచి 2007 వరకు దేశంలో రాబందుల సంఖ్య గణనీయంగా తగ్గింది.

కుక్కల బెడదతో రేబిస్ వ్యాప్తి
రాబందుల సంఖ్య తగ్గడంతో జంతు కళేబరాల వల్ల కుక్కల సంఖ్య పెరుగుతోంది. దీంతో రేబిస్ వ్యాధి కేసుల సంఖ్య కూడా పెరుగుతుంది. పశువైద్యం కోసం ఉపయోగిస్తున్న డిక్లోఫెనాక్ మందు వల్ల భారతదేశంలో 99 శాతం రాబందులు మృత్యువాత పడ్డాయని షికాగో విశ్వవిద్యాలయం పరిశోధనలో వెల్లడైంది. డిక్లోఫెనిక్ మందు వల్ల రాబందుల కిడ్నీలు చెడిపోయి మరణిస్తున్నాయి.జంతువుల మృతకళేబరాలు వెదజల్లే కాలుష్యం వల్ల పలువురు మృత్యువాతపడుతున్నారు.

పర్యావరణాన్ని పరిరక్షించే...
పశువుల కళేబరాలను ఆహారంగా తీసుకునే రాబందులు పర్యావరణ సమతౌల్యాన్ని పరిరక్షిస్తున్నాయి. కళేబరాలను భక్షించడం వల్ల ప్రమాదకరమైన సూక్ష్మజీవులు, మనుషులు, జంతువుల బారిన పడకుండా కాపాడుతున్నాయి. కళేబరాల నుంచి విడుదలయ్యే విష పదార్థాలు, విష వాయువులను రాబందులు తగ్గించి పర్యావరణానికి మేలు చేస్తున్నాయని అటవీశాఖ అధికారి శంకరన్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

రాబందుల సంరక్షణ కోసం వల్చర్ బ్రిగేడ్ వాలంటీర్లు
తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో సుబ్బయ్య భారతి దాసన్ రాబందుల సంరక్షణ కోసం కొంత మంది మిత్రులతో కలిసి అరులగం పేరిట స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు. రాబందుల సంరక్షణ కోసం వల్చర్ బ్రిగేడ్ పేరిట 36వేల మంది వాలంటీర్లను నియమించారు.రాబందుల పరిరక్షణ అవసరంపై ప్రజలకు అవగాహన కల్పించడానికి కళా ప్రదర్శనలు ఇప్పిస్తున్నారు.రాబందుల సంరక్షణ కోసం విశేష కృషి చేస్తున్న సుబ్బయ్య భారతీదాసన్ కు ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అవార్డు లభించింది.


Tags:    

Similar News