వంగరను మళ్ళీ వార్తల్లోకి ఎక్కించిన యంగ్ మహిళా ఎస్సై
'ఫ్రెండ్లీ పోలీసింగ్' తో ప్రజలకు చేరువ అవుతున్న పోలిసాఫీసర్;
By : Chepyala Praveen
Update: 2025-06-12 07:30 GMT
వంగర మరోసారి వార్తల్లోకెక్కింది. వంగర అంటే తెలుగునాట ఠక్కున గుర్తుకు వచ్చేది మాజీ ప్రధాని పీవీ నరసింహరావు. ఆయన స్వగ్రామమే వంగర. చాలా సంవత్సరాల తరువాత ఈ గ్రామం పేరు మరోసారి పతాకశీర్షికలకెక్కింది.
దీనికి కారణం ఓ చిన్న ఆఫీసర్ చేసిన అసాధారణ పని. తెలంగాణలో మొట్టమొదటిసారి సైకిల్ పెట్రోలింగ్ ప్రారంభించి, ప్రజల చేతే కాదు ఏకంగా సీఎం ఏ. రేవంత్ రెడ్డి చేత శభాష్ అనిపించుకున్నారు. ‘ది ఫెడరల్ ’ ఎస్సైతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఓ సన్నివేశం కనిపించింది.
బోనాల పండగ సందర్భంగా పట్టణం నుంచి వంగరకు వచ్చిన కుటుంబానికి ఇంటి పక్కనున్న వారితో గొడవ జరిగింది. దీనితో వారు వంగర పోలీస్ స్టేషన్ కు వచ్చారు.
మాటల సందర్భంలో తమ ఇంట్లో టాయిలేట్ లేదని బాధిత మహిళా, ఆ ఎస్సై ముందు చెప్పారు. దీనితో సదరు ఎస్సై మహిళా భర్తకు కౌన్సిలింగ్ ఇచ్చారు. టాయిలెట్ లేకపోతే మహిళలు ఎంత ఇబ్బంది పడతారో సవివరంగా చెప్పారు.
వర్షాకాలంలో విష జంతువుల సంచారం ఎక్కువగా ఉంటుందని తప్పనిసరిగా టాయిలెట్లు నిర్మించుకోవాలని అర్థమయ్యేలా వివరించారు. అలాగే ఇరుగుపొరుగు వారితో మర్యాదగా ఉండాలని హితబోధ చేశారు.
కేసు విషయం చిన్నదే కావడంతో వారిని సముదాయించారు. ఇలా ప్రజలకు అర్థమయ్యే రీతిలో వివరించిన ఆ ఎస్సై వయస్సు ముప్పై లోపే ఉంది. మహిళా ఎస్సై పేరు గొల్లపెల్లి దివ్య. ఆమె ఈ రోజు ‘ది ఫెడరల్’ తో మాట్లాడారు. ఆమె మాటల్లోనే..
చిన్న కుటుంబమే కానీ చింతలున్నాయి..
మాది చిన్న కుటుంబమే కానీ చింతలున్న కుటుంబం. ఎక్కువగా ఆస్తిపాస్తులు లేవు. ఇద్దరం ఆడపిల్లలమే.. నేను, చెల్లి. ‘‘మా బంధువులు ఎవరైన మీకు ఎంతమంది పిల్లలని అడిగితే ఇద్దరు ఆడపిల్లలని చెప్పగానే ఏదో పాపం చేసినట్లు చూసేవారు’’. మాకు అది నచ్చలేదు.
మా అమ్మ మాత్రం మాకు బాగా సపోర్టు చేసింది. ‘‘నాకు కొడుకులైనా.. కూతుళ్లైనా వీళ్లే’’ అని ధైర్యం చెప్పేది. మా అమ్మకు చిన్న వయస్సులోనే పెళ్లి కావడంతో ఏడో తరగతి వరకూ మాత్రమే చదువుకుంది. ఇంకా బాగా చదుకోవాలని అనుకున్న అమ్మకు వీలుకాలేదు.
నేను అమ్మ ఒకేసారి పదోతరగతి..
మా అమ్మకు చదువంటే చాలా ఇష్టం. అందుకే నేను పదో తరగతి చదివే సమయంలో బోర్డు పరీక్షకు హజరయి పాసైంది. అప్పట్లో మా అమ్మతో చదువుకున్న వారికి అంగన్ వాడీలో జాబ్ ఇచ్చారు.
మా అమ్మకు కూడా ఆ ఉద్యోగం కోసం చాలా ప్రయత్నం చేసింది. అప్పుడే మాకు కూడా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని కోరిక పుట్టింది. ఎస్ఎస్సీ వరకూ ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నాను.
అప్పట్లో పదో తరగతి మార్కుల ఆధారంగా బాసర ట్రిపుల్ ఐటీలో సీటు వచ్చింది. మాది మొదటి బ్యాచ్ ‘‘ నా లైఫ్ లో బాసర ట్రిపుల్ ఐటీలో చదవడం ఓ మలుపు లాంటిది’’ అని పాత సంగతులను నెమరువేసుకున్నారు.
జీవితంలో ఏదో సాధించాలనే కోరిక అక్కడే పుట్టిందని, చదవడం కొనసాగిన కొద్ది ఆ తపన ఇంకా ఎక్కువయిందని చెప్పుకొచ్చారు.
అమ్మ, నాన్న వాళ్ల తరఫున అవసరానికి ఆదుకునే వాళ్లు ఎవరూ లేరు. చదువులో గైడ్ చేయడానికి కూడా. దాంతో మా అమ్మ మా చదువు విషయంలో ప్రతిసారి ఎన్నో సంగతులు చెప్పేది.
‘‘ చిన్నప్పుడు అన్నీ వింటుంటే చికాకుగా అనిపించేది. కానీ టెన్త్ అయ్యాక మాత్రం వేరే ప్రపంచం లేకుండా చదువు మీదనే పూర్తి ఏకాగ్రత పెట్టడానికి ఆ మాటలే కారణం’’. అమ్మ స్కూల్ విద్యా కమిటీలో పని చేయడం కూడా నా పై ఎక్కువగా ప్రభావం చూపింది.
గ్రాడ్యూయేషన్ పూర్తి.. ఆక్సిడెంట్.. వీఆర్ఓ ..
బీటేక్ పూర్తి అయి ఇంటికి వచ్చిన సందర్భంలో ఆక్సిడెంట్ అయింది. చాలాకాలం పాటు ఇంటికే పరిమితం అయ్యాను. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే తపన ఉంది కానీ ఇంజనీరింగ్ కాకుండా వేరే సిలబస్ ఉన్న పరీక్షలకు హాజరు కావాలంటే చదవడం ఇబ్బంది అనిపించింది. నాకు తెలిసిన మ్యాథ్స్ (గణితం) తో బ్యాంకు ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యాను.
చాలా సంవత్సరాల పాటు చదవిన ఉద్యోగానికి ఎంపిక కాలేదు. కొన్నిసార్లు ఇంటర్వ్యూ దాకా వచ్చిన చివరకు అనుకున్న కొలువు సాధించలేకపోయాను. ‘‘ఓ సందర్భంలో చాలా ఏడ్చాను. కళ్లు మొత్తం ఎర్రగా మారి, పెద్దగా ఉబ్బిపోయాయి’’.
అదే సందర్భంలో వీఆర్ఓ నోటిఫికేషన్ వచ్చింది. పట్టినపట్టు వదలకుండా చదువు కొనసాగించాను. వీఆర్ఓ జాబ్ సాధించాను. మొదటి పోస్టింగ్ రాజన్న సిరిసిల్లా జిల్లాలోని ఓ మండలంలో వచ్చింది. అయితే అది పూర్తిగా గ్రామీణ ప్రాంతం కావడంతో ఆ జాబ్ చేయడం కష్టంగా మారింది.
ఆడుతూ.. పాడుతూ చదివేశా..
వీఆర్ఓ జాబ్ వచ్చిన సమయంలో పోలీస్ నియామకాల నోటిఫికేషన్ వచ్చింది. ఈ ఉద్యోగానికి కూడా ప్రయత్నించాలని అనుకున్నాను. కానీ నాకు ఫిజికల్ ఫిట్ నెస్ అస్సలు లేదు. ‘‘ నేను చాలా బద్దకస్తురాలిని. మన భాషలో చెప్పాలంటే ఓ బాయిలర్ కోడిని. తెల్లవారి లేవడం అంటే నా వల్ల అయ్యేది కాదు.’’ అని ఓ సరదా సంగతిని చెప్పుకొచ్చారు.
‘‘ పోలీస్ ఉద్యోగానికి ఎంపిక కావడానికి రన్నింగ్ రావడం చాలా ముఖ్యం. తొలి రోజు ప్రాక్టీస్ చేస్తుంటే కాలులో కండరం పట్టేసింది. చాలా ఇబ్బంది పడ్డాను. నిర్ణీత టైమ్ లో రన్నింగ్ పూర్తి చేయాలనే నిబంధనలు ఉన్నాయి. కానీ నా సమయం చూస్తే దాని దరిదాపుల్లో కూడా లేను’’ అని నవ్వుతూ పాత సంగతి గుర్తు చేసుకున్నారు.
చివరకు ఎలాగో అలా ఇన్ టైమ్ లో రన్నింగ్ పూర్తి చేసుకునే స్థాయికి ఫిజికల్ గా చేరుకున్నాను. దాని కోసం తెల్లవారు జామునే లేచి హనుమకొండ పబ్లిక్ గార్డెన్ లో ప్రాక్టీస్ చేసేదానిని. అప్పటికే వీఆర్ఓ జాబ్ ఉండటంతో ప్రత్యేకమైన టైమింగ్ తో కాకుండా నాకు ఇష్టమున్న సమయంలో ప్రిపరేషన్ కొనసాగించా. చివరకు ఎస్ఐ గా ఉద్యోగం సాధించాను. ఇది లైఫ్ లో మరో అచీవ్ మెంట్.
మడికొండలో విధులు నిర్వర్తించిన సమయంలో ప్రజలతో ఎలా మెలగాలో అర్థం చేసుకున్నా. ప్రజలకు నాకు చేతనయినంత సాయం చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నాను. ‘‘కాకపోతే నేనో పెద్ద వాగుడు కాయను’’ అని తన మీద తనే జోకులు వేసుకున్నారు. అన్నట్లు దివ్యకు ఇష్టమైన డిష్ ‘‘చేపల పులుసు’’
వంగర పోలీస్ స్టేషన్ పరిధి చాలా చిన్నది అయితే..
వంగర పోలీస్ స్టేషన్ లో కేవలం ఆరు గ్రామాలు మాత్రమే ఉన్నాయి. పోలీస్ పెట్రోలింగ్ కోసం టూ వీలర్, ఫోర్ వీలర్ వెహికల్స్ వాడుతున్నాము. అన్నీ గ్రామాలను చేరుకోవాలంటే రఫ్ గా ఓ గంట సమయం పడుతుంది.
నాకు మొదట ఇక్కడ పోస్టింగ్ ఇచ్చినప్పుడు చిన్న స్టేషన్ గా చూడొద్దని అధికారులు చెప్పారు. అందుకే నాకు సాధ్యమైనంత వరకూ ప్రజలతో నేరుగా కనెక్ట్ కావడానికే ప్రయత్నించాను. నేరాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. చాలా ప్రశాంతమైన ఊరు.
సైకిల్ పై పెట్రోలింగ్ ఉన్నతాధికారుల ఐడియానే..
అందరి ప్రశంసలు పొందిన సైకిలింగ్ పై పెట్రోలింగ్ అనేది నా ఐడియా కాదు. కమ్యూనిటీ పోలీసింగ్ అనేది ఎప్పటి నుంచో ఉన్నది. కాకపోతే దాన్ని మేము ఇంకాస్త ముందుకు తీసుకెళ్లాము. సైకిళ్లను కొనుగోలు చేసి వంగర, రత్నగిరి లో పెట్రోలింగ్ చేస్తుంటే చాలా విషయాలు మా దృష్టికి వచ్చాయి.
చాలా మంది గ్రామస్తులు నిలబడి చూసి మాట్లాడుతున్నారు. ‘‘అధికారులకు ప్రజలతో నేరుగా సంబంధం ఉండటం ఎంతో సమాజానికి మేలు చేస్తుంది.’’
‘‘నేరం జరిగిన తరువాత కంటే నేరాన్ని ముందస్తుగా నివారించడానికి ఈ విధానం తోడ్పడుతుంది’’ అదే మా లక్ష్యం. కొన్ని రోజుల క్రితం ఇక్కడ డ్రగ్స్ కేసు నమోదు అయింది.
విషయం మా దృష్టికి రాగానే అనేక జాగ్రత్తలు తీసుకున్నాము. చదువుకున్న యువతే లక్ష్యంగా ఇలాంటి మత్తుమందు ముఠాలు చెలరేగుతున్నాయి. గ్రామాలకు కూడా చాలా ఈజీగా గంజాయి చేరుతోంది. తెలంగాణ ను మరో పంజాబ్ లా కాకుండా చూడటమే మా ముందున్న లక్ష్యం.
మేము సాధారణంగానే పెట్రోలింగ్ చేశాము. అది మా విధి నిర్వహణలో అది ఓ భాగం. కానీ ఇంతపెద్ద సక్సెస్ అయి, ఉన్నతాధికారుల మన్ననలతో పాటు సీఎం కూడా మన స్టేషన్ గురించి పోలీస్ శాఖను అభినందించడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది.
ఇలాంటివి వృత్తిని మరింత బాధ్యతతో నిర్వహించేలా చేస్తున్నాయి. నేను మాత్రం కచ్చితంగా చేసింది విధి నిర్వహణే అని వినయంగా చెప్పుకొచ్చారు.
యూనిఫాం వేసుకున్నాక..
యూనిఫాం వేసుకున్నాక కొన్నింటిని త్యాగం చేయాల్సి వచ్చింది. ముఖ్యంగా ఫ్రెండ్స్ తో బయటకు వెళ్లడం కుదరడం లేదు. అలాగే ఫ్యామిలి ఫంక్షన్స్ కు వెళ్లడం కూడా కష్టంగా మారింది. కానీ ఒకసారి యూనిఫాం వేసుకుని వచ్చాక అన్ని మర్చిపోతాను.. అంటూ ముగించారు. యంగ్ ఎస్సై గొల్లెపల్లి దివ్య.