జాయింట్ కలెక్టర్ అరెస్టు

రు. 8 లక్షలను బాధితుడు సీనియర్ అసిస్టెంట్ కు ఇస్తున్నపుడు ఏసీబీ అధికారులు దాడిచేసి సాక్ష్యాలతో సహా అరెస్టుచేశారు.

Update: 2024-08-13 05:13 GMT
ఎసిబికి చిక్కిన జాయింట్ కలెక్టర్, ఆయన అసిస్టెంట్

రంగారెడ్డి జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్టుచేశారు. ధరణి పోర్టల్ నుండి నిషేధించిన 14 గుంటల భూమిని తొలగించేందుకు రైతు జక్కిడి ముత్యంరెడ్డి నుండి భూపాల్ పెద్ద ఎత్తున డబ్బులు డిమాండ్ చేశాడు. బాధితుడు అడిగిన పనిచేసేందుకు భూపాల్ సహాయకుడిగా పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ రెడ్డి రు. 8 లక్షలు డిమాండ్ చేశారు. ఈ మొత్తం ఇవ్వలేనని చెప్పినందుకు బాధితుడిని జాయింట్ కలెక్టర్ ఆఫీసు చుట్టూ తిప్పించుకుంటున్నాడు. దాంతో మండిపోయిన బాధితుడు ఇదే విషయాన్ని ఏసీబీకి ఫిర్యాదు చేశాడు.

రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు వ్యూహం ప్రకారం బాధితుడితో సీనియర్ అసిస్టెంట్ డిమాండ్ చేసిన డబ్బును ఇచ్చేట్లుగా ఒప్పందం చేయించారు. అడిగిన రు. 8 లక్షలను బాధితుడు సీనియర్ అసిస్టెంట్ కు ఇస్తున్నపుడు ఏసీబీ అధికారులు దాడిచేసి సాక్ష్యాలతో సహా అరెస్టుచేశారు. వెంటనే జాయింట్ కలెక్టర్ చెబితేనే బాధితుడి నుండి తాను 8 లక్షల రూపాయలు డిమాండ్ చేసినట్లు మదన్ అంగీకరించారు. దాంతో అక్కడి నుండే మదన్ తో ఏసీబీ అధికారులు జాయింట్ కలెక్టర్ కు ఫోన్ చేయించారు. బాధితుడి నుండి డబ్బు ముట్టిందని చెప్పగానే పెద్ద అంబర్ పేట ఔటర్ రింగ్ రోడ్డు దగ్గరకు డబ్బు మొత్తాన్ని తీసుకురావాలని జాయింట్ కలెక్టర్ చెప్పారు. జాయింట్ కలెక్టర్ చెప్పినట్లుగానే మదన్ డబ్బులు తీసుకుని ఔటర్ రింగ్ రోడ్డుకు చేరుకున్నాడు. డబ్బును సీనియర్ అసిస్టెంట్ నుండి జాయింట్ కలెక్టర్ తీసుకుంటున్నపుడు ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

జాయింట్ కలెక్టర్ ను అరెస్టుచేసిన ఏసీబీ అధికారులు ఆయన ఇంట్లో సోదాలు చేస్తున్నారు. సోదాల్లో జాయింట్ కలెక్టర్ ఇంట్లో రు. 16 లక్షల డబ్బుతో పాటు పెద్దఎత్తున ఆస్తిపత్రాలు కూడా దొరికాయి. అలాగే మదన్ మోహన్ ఇంట్లో కూడా సోదాలు జరుగుతున్నాయి. సోదాలు పూర్తయితే కాని ఇంకెంత డబ్బు, ఆస్తుల పత్రాలు బయటపడతాయో తెలీదు. జాయింట్ కలెక్టర్ స్ధాయి అధికారి అవినీతిపై అరెస్టవ్వటం ఈమధ్యలో బహుశా ఇదే మొదటిసారేమో.

Tags:    

Similar News