పాముకాటు ఘటనలు 50 శాతానికి తగ్గించేందుకు కార్యాచరణప్రణాళిక

తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలో 2030 నాటికి పాముకాటు ఘటనలు 50 శాతానికి తగ్గించేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది.;

Update: 2025-03-22 01:15 GMT
పాముకాటు ఘటనలు 50 శాతానికి తగ్గించేందుకు కార్యాచరణప్రణాళిక
నీటిలో పాము సంచారం

దేశంలోనే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో పాముకాటు ఘటనలు అధికంగా జరుగుతున్నాయని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ నివేదిక వెల్లడించింది.ఏపీ, తెలంగాణలలో నాగుపాములు ఎక్కువగా సంచరిస్తున్నాయి.పాములు కరిచిన తర్వాత చికిత్సలో జాప్యం వల్ల మరణాలు సంభవిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు.2024వ సంవత్సరంలో తెలంగాణలో 2,479 పాము కాటు కేసులు (Snake bite) నమోదయ్యాయని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ నివేదిక వెల్లడించింది.కారణాలు ఏవైనా పాము కాటు వల్ల ఏటా ప్రపంచవ్యాప్తంగా 66వేల మంది పాముకాటు వల్ల మరణిస్తున్నారని తాజాగా వెల్లడైంది.సెంట్రల్ బ్యూరో ఆఫ్ హెల్త్ ఇన్వెస్టిగేషన్ నివేదికల ప్రకారం 2016-2020 సంవత్సరాల్లో భారతదేశంలో సగటున వార్షిక పాముకాటు కేసులు 3 లక్షలు. ఏటా పాముకాటు కారణంగా దాదాపు రెండు వేలమంది మరణాలు సంభవిస్తున్నాయి.




 9 రాష్ట్రాల్లో 70 శాతం పాముకాటు మరణాలు

తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ లతో పాటు బీహార్,జార్ఖండ్,మధ్యప్రదేశ్,ఒడిశా,ఉత్తరప్రదేశ్,రాజస్థాన్, గుజరాత్‌ రాష్ట్రాల్లో 70 శాతం పాము కాటు మరణాలు సంభవించాయని ఆరోగ్య ,కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది.2022వ సంవత్సరంలో 2,562 కేసులు, 23లో2,559 పాము కాటు మరణాల కేసులు నమోదయ్యాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో జనసాంద్రత తక్కువగా ఉన్న వ్యవసాయ ప్రాంతాల ప్రజల 70 శాతం మరణాలకు పాము కాటే కారణం.ముఖ్యంగా వర్షాకాలంలో పాములు ఎక్కువగా కరుస్తున్నాయని అధ్యయనంలో తేలింది.



 పాముకాటు మరణాలను తగ్గించేందుకు కార్యాచరణ

కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, హెల్త్ మినిస్ట్రీ సహకారంతో దేశంలో 2030 నాటికి పాముకాటు మరణాలను 50 శాతానికి తగ్గించడానికి (Reduce Snakebite)‘నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ ప్రీవెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ స్నేక్ బైట్ ఎన్వనోమింగ్ ’ పేరిట ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను (Action plan)రూపొందించారు. పాముకాటు ఘటనలు, మరణాలను తగ్గించేందుకు సంస్థ 2030 ప్లాన్ ను రూపొందించింది.ఇందులో భాగంగా ప్రజలను పాముల బారి నుంచి పరిరక్షించి వాటిని సురక్షితంగా అడవుల్లోకి వదిలిపెట్టేందుకు ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ తెలంగాణ అటవీశాఖతో కలిసి పనిచేస్తుంది.దీనిలో భాగంగా పాముల సంచారంపై ప్రజల్లో అవగాహన కల్పించడంతోపాటు ప్రజల ఫిర్యాదులపై సత్వరం స్పందించి పాములను పట్టుకొని అడవుల్లోకి తరలిస్తున్నామని ఫ్రండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ (Friends of Snakes Society) విశ్వనాథన్ అవినాష్ వివరించారు.



 పదేళ్లలో 75వేల పాములను పట్టుకున్నారు...

హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణ (TELANGANA) రాష్ట్రంలో పనిచేస్తున్న ఫ్రండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ గడచిన పదేళ్లలో 75వేల పాములను జనవాసాల్లో పట్టుకొని అడవుల్లో వదిలి రికార్డు సృష్టించింది. 2015వ సంవత్సరంలో 3,389 పాములను పట్టుకొని, వాటిని సురక్షితంగా దట్టమైన అడవుల్లో వదిలామని ఫ్రండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ ప్రధాన కార్యదర్శి విశ్వనాథన్ అవినాష్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. 2016వ సంవత్సరంలో 3097 పాములు, 2017లో 4,504, 2018లొ 5,644,2019లో 6,689, 2020లో 8,895,2021లో10,525, 2022లో 9,101, 2023లొ 10,282 పాములను తమ వాలంటీర్లు పట్టుకొని అడవుల్లో వదిలామని ఆయన తెలిపారు. 2024వ సంవత్సరంలో 13,028 పాములను కాపాడామని ఆయన వివరించారు.



 పాముల సంచారం ఎక్కడంటే...

వ్యవసాయ భూముల్లోని చెట్లను కొట్టేసి ఇళ్ల నిర్మాణం చేపడుతుండటంతో పాములు ఇళ్లలోకి వస్తున్నాయి. పాములు సహజంగా పుట్టలు, ఎలుకల రంధ్రాలు, రాళ్లు, రప్పల కింద నివాసముంటాయి. పాములున్న ప్రాంతాలను తవ్వి ఇళ్ల నిర్మాణం చేపడతుండటంతో అవి ఇళ్లలోకి వస్తున్నాయని, అందులోనూ వర్షాకాలంలో పాములు ఎక్కువగా వస్తున్నాయని స్నేక్ సొసైటీ వాలంటీర్ ఆదిత్య ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో, పొలాల్లో కంటే నగరాలు, పట్టణాల్లోనే పాము కాటు ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆయన పేర్కొన్నారు.



 ఫ్రండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ వాలంటీర్లు

ఫ్రండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీలో 150 మందికి పైగా వాలంటీర్లు నిత్యం పాములను పట్టుకొని ప్రజలను రక్షించడమే కాకుండా పాములను కూడా సంరక్షించి వాటిని అడవుల్లో వదిలివేస్తున్నారు. పాములు సంచరిస్తున్న ప్రాంతాల్లో రాత్రివేళ చీకటిలో నడవకూడదని వాలంటీర్లు సూచించారు. నేలపై పడుకోరాదని, మంచంపై లేదా దోమ తెరను చుట్టూ కట్టుకొని పాములు దరి చేరకుండా నిద్రించాలని వాలంటీర్లు కోరారు. పాము కాటు బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు ఒకవేళ పాము కరిస్తే గంటలోగా ఆసుపత్రికి వెళ్లి యాంటీవీనం ఇంజక్షన్ చేయించుకొని చికిత్స తీసుకోవాలని అవినాష్ సలహా ఇచ్చారు.

పాముల్లో విషపూరితమైనవి ఏవంటే...
తెలంగాణలో ఉన్న పాముల్లో 42 రకాలున్నాయని, వీటిలో కేవలం 8 రకాల పాములే విషపూరితమైనవని ఫ్రండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ ప్రధాన కార్యదర్శి విశ్వనాథన్ అవినాష్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. రాష్ట్రంలో తమ వాలంటీర్లు పట్టుకున్న పాముల్లో ఎక్కువగా నాగుపాములేనని ఆయన తెలిపారు. తాచుపాము, రక్తపింజర, కట్ల పాము, చిన్న పింజర, బంగారు గాజుల పాము,గిరినాగు,స్కెండర్, బాంబు పిట్ వైపర్ రకాల పాములు అత్యంత విషపూరితమైనవని చెప్పారు.

పట్టుకున్న పాములను ఏం చేస్తారంటే...

హైదరాబాద్ నగరంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తమ ఫ్రండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీకి రోజుకు 300కు పైగా పాములు తమ ఇళ్లలోకి వచ్చాయని ఫిర్యాదులు వస్తుంటాయని, ఫిర్యాదు రాగానే తమ వాలంటీర్లు పదిహేను నిమిషాల్లోగా అక్కడకు వెళ్లి పాములను పట్టుకొని, వాటిని అటవీశాఖ ఆధీనంలోని బౌరంపేట పాముల ఎన్ క్లోజరుకు తరలిస్తారు. పట్టుకున్న పాములను ఎన్ క్లోజర్ల నుంచి దట్టమైన అడవులకు చెక్క ఎన్ క్లోజర్లలో తీసుకువెళ్లి సురక్షితంగా వదిలి వేస్తామని విశ్వనాథన్ అవినాష్ చెప్పారు.వాలంటీర్లకు పాములను పట్టుకోవడంలో నైపుణ్య శిక్షణ ఇవ్వడంతోపాటు భద్రతకు పరికరాలను వినియోగించడం వల్ల ఒక్క వాలంటీర్ కూడా పాము కాటుకు గురి కాలేదు.





Tags:    

Similar News