అలయ్ బలయ్ లో అందరినీ ఏకంచేసిన దత్తన్న

దత్తత్రేయ పుణ్యమాని కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలంతా ఈరోజు ఏకమయ్యారు.

Update: 2024-10-13 09:42 GMT
Alai Balai program

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో అలయ్ బలయ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆదివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో మొదలైన ఈ కార్యక్రమం మధ్యాహ్నం సుమారు 3 గంటలకు ముగిసింది. బీజేపీ సీనియర్ నేత, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ 18 ఏళ్ళుగా దసరా పండుగ సందర్భంగా అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దత్తత్రేయ పుణ్యమాని కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలంతా ఈరోజు ఏకమయ్యారు. అయితే 19వ సారి అలయ్ బలయ్ కార్యక్రమాన్ని దత్తాత్రేయ కూతురు బండారు విజయలక్ష్మి నిర్వహించటం విశేషం. అలయ్ బలయ్ నిర్వహణ కమిటి తరపున ప్రముఖలందరి దగ్గరికీ విజయలక్ష్మే స్వయంగా వెళ్ళి ఆహ్వానించారు. దత్తాత్రేయ పక్కకు జరిగి కూతురు విజయలక్ష్మిని నగరంలోని ప్రముఖులందరికీ పరిచయం చేస్తున్నట్లుంది.



ఈ కార్యక్రమానికి తెలంగాణా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మేఘాలమ గవర్నర్ విజయ్ శంకర్, రాజస్ధాన్ గవర్నర్ హరిబాబు బగాడే, ఉత్తరాఖండ్ గవర్నర్ గుర్ మీత్ సింగ్, తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు తదితర ప్రముఖులు హాజరయ్యారు. అలాగే బీఆర్ఎస్ నుండి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు, మదుసూధనాచారి, తలసాని శ్రీనివాసయాదవ్, మంత్రులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, పొన్నంప్రభాకర్, ఏపీ మంత్రి సత్యకుమార్, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్, కాంగ్రెస్ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, మాజీ ఎంపీలు వీహెచ్, కేకే, వినోద్ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు వివిధ కుల సంఘాల నేతలు కూడా హాజరయ్యారు. సినీఫీల్డు నుండి కోటాశ్రీనివాసరావు, వందేమాతరం శ్రీనివాస్ లాంటి అతికొద్దిమాత్రమే హాజరయ్యారు.

ఏకంచేయటమే అసలు ఉద్దేశ్యం



ప్రతి ఏడాది దత్తాత్రేయ అలయ్ బలయ్ ఎందుకు నిర్వహిస్తున్నారంటే పార్టీలకు అతీతంగా నేతలంతా ఏకతాటిపైన ఉండాలని. అందుకనే ప్రతి ఏడాది అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తు వివిధ పార్టీలకు చెందిన నేతలందరినీ పేరుపేరునా పిలిచి వీలైనంతమందిని కార్యక్రమానికి హాజరయ్యేట్లుగా చూసేవారు. దత్తన్న మీద అభిమానంతో వివిధ పార్టీల నేతలు కూడా క్రమంతప్పకుండా ఈ కార్యక్రమానికి హాజరయ్యేవారు. ఇంతమంది ప్రముఖులు హాజరయ్యే కార్యక్రమం కాబట్టి తెలంగాణా సంస్కృతిని ప్రతిబింబిచేట్లుగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతాయి. కార్యక్రమాలను చూస్తు అందరు కలిసికట్టుగా మనసువిప్పి మాట్లాడుకుని కలిసి భోజనాలు చేస్తారు.



 ఈరోజు కార్యక్రమంలో కూడా 150 రకాల వంటకాలు చేయించి అతిధులందరికీ నిర్వాహకులు దగ్గరుండి కొసరికొసరి మరీ తినిపించారు. రేవంత్ తో పాటు కార్యక్రమంలో మాట్లాడిన గవర్నర్లు, కేంద్రమంత్రి, రాష్ట్రాల మంత్రులు అలయ్ బలయ్ కార్యక్రమం ఉద్దేశ్యాన్ని అభినందించారు. ఏపీలో కూడా ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటుచేసే విషయాన్ని పరిశీలిస్తానని ఏపీ మంత్రి సత్యకుమార్ ప్రకటించారు. వ్యక్తులు, పార్టీల నేతల మధ్య ఉన్న వైరుధ్యాలను పక్కనపెట్టి అందరు స్నేహభావంతో ఉండాలని చాటిచెప్పేదే అలయ్ బలయ్ కార్యక్రమంగా వక్తలంతా గుర్తుచేసుకున్నారు.

Tags:    

Similar News