పదేళ్ల తెలంగాణ : తాగి, తూలి తలకిందులైన రాష్ట్రం

మద్యపానాన్ని ప్రోత్సహించడం వల్ల రాష్ట్రానికి కలిగే నష్టం గురించి కేరళ, బీహార్ ప్రభుత్వాలకు తెలిసినంత కెసిఆర్‌కు తెలియకపోవడం వల్ల రాష్ట్రం నష్టపోయిందటున్నారు తెలంగాణ మేధావి బిఎస్ రాములు.

Update: 2024-05-28 05:54 GMT

మద్యపానం అనేది దేశ వ్యాప్తంగా అభివృద్ధిలో చిల్లికుండగా మారుతున్నది. చిల్లికుండలో నీరు కొద్దికొద్దిగా కారిపోయి చివరకు ఏమీ మిగలకుండా ఖాళీ అవుతుంది. గత పదేళ్లలో తెలంగాణలో కనిపించింది ఇదే

తెలంగాణలో ప్రజల బతుకులు మద్యపానంతో చిల్లికుండలా ఖాళీ అవుతున్నాయి. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ ఆవలివైపు ఉన్న దూల్పేటలో సారా కాసి కాసి , తాగి తాగి చాలామంది చనిపోయారు. భర్తలు చనిపోయిన మహిళలకు పేపర్లతో విస్తర్లు తయారు చేసే స్కీము పెడితే అది మార్కెట్ వ్యవస్థ ఏర్పాటు చేయకపోవడంవల్ల మూలన పడింది. మహారాష్ట్రలో , తెలంగాణలో మద్యపానం వల్ల అర్ధాంతరంగా భర్తలు చనిపోవడం వల్ల లక్షలాది మహిళలు వితంతువులుగా మారారు. ఇద్దరు ఉన్నప్పుడు చాలని సంపాదన ఒంటరి మహిళ పిల్లలను ఎలా పెంచి పోషిస్తుంది?


అమెరికాతో సహా అనేక దేశాలు ఒంటరి మహిళలు ఆసరా పథకాలు ప్రవేశపెట్టాయి. మద్యపానం వల్ల నేరాలు పెరుగుతున్నాయి. ఆరోగ్యాలు చెడిపోతున్నాయి. రోగాల బారినపడి ఉన్నదంతా వైద్యానికే ఖర్చు చేస్తున్నారు. జీవితాలు ముగిస్తున్నారు. తాగి తాగి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వేశ్యా వృత్తి పెరుగుతున్నది. అప్పులు పెరుగుతున్నాయి. తెలంగాణలోని కోటి కుటుంబాల్లో 40 లక్షల కుటుంబాలు మద్యపానం వల్ల కునారిల్లిపోతున్నాయి. ఎన్ని పథకాలు పెట్టినా వారి జీవన ప్రమాణాలు పెరగకపోవడానికి ప్రధాన కారణం మద్యపానమే.


కేరళలో పెద్ద పెద్ద స్టార్ హెూ టళ్లోలో తప్ప మద్యం సాధారణ ప్రజలకు అందకుండా పాక్షిక మద్యపాన నిషేదం విదించడం వల్ల ప్రజల జీవన ప్రమాణాలు దేశంలో అత్యున్నతంగా పెరిగాయి. తెలంగాణలోనూ, దేశవ్యాప్తంగానూ ఈ పాక్షిక నిషేధం విధిస్తే దొంగ సారా, కల్తీ మద్యం వంటివి కూడా చాలామేరకు తగ్గిపోతాయి. దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులు, సామాజిక శాస్త్రవేత్తలు , మేధావులు, జర్నలిస్టులు ఈ విషయం చాలా ప్రధానమైనదిగా గుర్తించడం అవసరం.


భారత రాజ్యాంగంలో బాల కార్మిక వ్యవస్థ, అంటరానితనం , మద్యపాన నిషేధం, గోవధ నిషేధం, ఎస్సీ, బీసీ, ఎస్టీ సామాజిక వర్గాల విద్య , ఉద్యోగాలు, ఉపాధి కల్పన ప్రముఖంగా చేర్చబడ్డాయి. మద్యపానం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి యేటా రూ.20 వేల కోట్ల నుండి రూ.30 వేల కోట్లు ఆదాయం వస్తున్నది. గత పదేళ్ళలో ప్రభుత్వం మద్యం విక్రయం ద్వారా 3 లక్షల కోట్ల ఆదాయం పొందింది. మద్యం వ్యాపారులు , బారులు, హోటల్ , తినుబండారాల ఖర్చు మొదలైనవి కలిపి మరో రూ.60 వేల కోట్లు ఏటా మద్యం సందర్భంగా ప్రజలు ఖర్చు చేశారు. ఇలా ఏటా రూ.90 వేల కోట్ల రూపాయల సంపద డ్రైనేజిలో పోసినట్టయింది.


ఇలా గత పదేళ్ళలో రూ.9 లక్షల కోట్ల రూపాయల సంపద ప్రజల జీవన ప్రమాణాల అభివృద్ధికి కాకుండా వృధా అయిపోయింది. మద్యపానం నిషేదిస్తే ఈ రూ.9 లక్షల కోట్లు ద్వారా ప్రజల కొనుగోలు శక్తి కూరగాయలకు, బట్టలకు, బడి చదువులకు , తిండికి , గృహ నిర్మాణానికి , పౌష్టిక ఆహారానికి ఖర్చు చేసి ఉండేవారు. అందులో నాలుగో వంతు పొదుపు చేసినా రూ.2 లక్షల కోట్లు బ్యాంకుల్లో , పోస్టాఫీసుల్లో పొదుపు ఖాతాల్లో అదనంగా జమ అయి ఉండేవి.


ఇలా రాష్ట్రంలో మద్యపానం నిషేధం ద్వారా వ్యాపారం, పరిశ్రమలు అనేక ఉత్పత్తులు మార్కెటింగ్ రూ.తొమ్మిది లక్షల మేరకు అదనంగా పెరిగి ఉండేవి. తద్వారా రూ.4 లక్షల కోట్లు జిఎస్టీ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం అంది ఉండేది. అనగా మద్యపానం ద్వారా వచ్చే ఆదాయం కన్నా లక్ష కోట్ల ఆదాయం ప్రభుత్వానికి ఎక్కువ సమకూరుతుంది.


మద్యపానం నిషేధిస్తే... 


ఈ విషయాన్ని కేరళ , బిహార్ సీఎంలు లెక్కలతో సహా నిరూపించారు. అందువల్ల మద్యపాన నిషేధం వల్ల ప్రభుత్వ ఆదాయం తగ్గుతుందనడం మూర్ఖత్వం తప్ప మరొకటి లేదు. ప్రజలు ఖర్చు చేసే ప్రతి వంద రూపాయల్లో 50 రూపాయలు ఏదో రూపంలో ప్రభుత్వ ఖజానాకు చేరుతుంది. ఈ విషయాన్ని మరోసారి వివరిస్తాను.


మద్యపానం నిషేధిస్తే పెరిగిన పొదుపు వల్ల రూ.2 లక్షల కోట్లు పెట్టుబడిగా ప్రభుత్వానికి డిపాజిట్ల రూపంలో, ఇన్సూరెన్స్‌ల రూపంలో పారిశ్రామిక అభివృద్ధికి పెట్టుబడిగా ఉపయోగపడేది. 6 లక్షల కోట్లు అప్పులు చేయాల్సిన దుస్థితి, దానికి 9 శాతం వడ్డీ కట్టాల్సిన దుస్థితి ఉండేది కాదు. ఈ 9 శాతం వడ్డీ ప్రజలకే అందితే ప్రజలు ముఖ్యంగా మహిళలు, ఉద్యోగులు , కార్మికులు మరింత పొదుపు చేసి ఉండేవారు. అలా పొదుపు ద్వారా రాష్ట్రానికి 3 లక్షల కోట్లు పెట్టుబడిగా వివిధ రంగాలలో ఉపయోగించుకోవడానికి అందుబాటులోకి వచ్చేవి.


కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయంలో సీరియస్‌గా ఆలోచిస్తే ప్రభుత్వం పెట్టాల్సిన ఖర్చేమి లేకుండా అదనంగా ఏటా రూ.30 వేల కోట్లు పెట్టుబడులకు ప్రజల నుండి లభిస్తాయి. అలా వాటి ద్వారా కన్స్ట్రక్షన్ కార్పొరేషన్, హౌసింగ్ బోర్డు, మార్కెఫెడ్, టిసిఎంఎస్, సరుకుల ప్రజా పంపిణీ వ్యవస్థ, నీటి ప్రాజెక్టులు, విద్యుత్ ప్రాజెక్టులు, రోడ్ల అభివృద్ధి ద్వారా సంపద మరింత పెరుగుతుంది. తక్కువ పెట్టుబడితో ప్రజలకు మద్య తరగతికి చక్కని గృహ వసతి, ఉన్నత విద్య, ఉపాధి కల్పన పెరుగుతుంది.


గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం వీటిని అమలు జరిపినవే అని మరిచిపోరాదు. వాటిని మరింత ఆధునిక పద్ధతిలో అమలు జరపడం అవసరం. ఈ పని టిఆర్ఎస్ ప్రభుత్వం చేయక రాష్ట్రాన్ని రూ.లక్షల కోట్ల అప్పుల పాలు చేసింది. అన్నింటిని కుదువబెట్టింది. ఆసరా పథకం ద్వారా పంపిణీ చేసే సంక్షేమ పథకాల ద్వారా కూడా 40 శాతం తిరిగి ప్రభుత్వ ఖజానాకు చేరుతున్నది. ఈ విషయం కేసీఆర్‌కు తెలుసు.


ఈ రహస్యం తెలియక ఉచిత పథకాలు , సబ్సిడీలు వద్దని మాట్లాడడం అర్థశాస్త్రంలో ఎబిసీడీలు తెలియని ' మహా మేధావులు ' విమర్శిస్తుంటారు. కరోనా కాలంలో బుద్ధి లేక అమెరికా, యూరపు దేశాలు, ఆస్ట్రేలియా కొన్ని నెలల పాటు నగదును ఉచితంగా బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. తద్వారా మొత్తం మార్కెట్ వ్యవస్థను ప్రజల జీవితాలను రెగ్యులరైజ్ చేసింది. దీని వెనుకగల అర్థశాస్త్రం అర్థం చేసుకుంటే ఉచిత పథకాలు , సబ్సిడీలు అంటూ ఎవరూ వ్యతిరేకించరు. అలాంటి విశ్లేషణలను కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి విస్తృతంగా తీసుకురావడం అవసరం.


భారత రాజ్యాంగంలోని మద్యపాన నిషేధాన్ని అమలు జరపడం ద్వారా ఇలా ప్రభుత్వాలకు , ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. నేరాలు తగ్గుతాయి. వితంతువుల సంఖ్య తగ్గుతుంది. జీవన ప్రమాణాలు పెరుగుతాయి. ప్రభుత్వం ప్రజలకు ఎంతో మేలు చేసినట్లవుతుంది. మద్యపానం నిషేధించేదాక ప్రజల కోసం ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా అవి అంతిమంగా చిల్లికుండ వలె నీరు కారిపోతూనే ఉంటాయి అని మరిచి పోకూడదు.

Tags:    

Similar News