హోరాహోరీ పోరుకు సిద్ధమైన రాజకీయ పార్టీలు
తెలంగాణలో సోమవారం జరగనున్న నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నికలో రాజకీయ పార్టీలు హోరాహోరీ పోరుకు సిద్ధమవుతున్నాయి.
తెలంగాణలో సోమవారం జరగనున్న నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నికలో రాజకీయ పార్టీలు హోరాహోరీ పోరుకు సిద్ధమవుతున్నాయి. కీలకమైన ఈ ఎన్నికల ఫలితాలు జూన్ 5న వెల్లడి కానున్నాయి. మొత్తం 52 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా, ప్రధాన పోటీ మాత్రం అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్యే ఉంది.
రాష్ట్ర అసెంబ్లీకి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి బీఆర్‌ఎస్ నుంచి ఎన్నికైన నేపథ్యంలో ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ ఉపఎన్నికలో ముఖ్య అభ్యర్థులు BRS నుండి ఏనుగుల రాకేష్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఉన్నారు. ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రం 4 గంటలకు ముగియగా, సోమవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
గెలుపు కోసం మూడు పార్టీల యత్నాలు...
సీటును నిలబెట్టుకోవాలనే పట్టుదలతో ఉన్న బీఆర్‌ఎస్ ఈ ఉపఎన్నికను సవాల్‌గా తీసుకుంది. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు తదితరులతో కలిసి క్షేత్రస్థాయిలో ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు.
కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ఇటీవలి ఎన్నికల విజయాన్ని ఉపయోగించుకుని, గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలోనూ విజయాన్ని సొంతం చేసుకోవాలని ఆసక్తిగా ఉంది. మూడు ఉమ్మడి జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు చురుగ్గా ప్రచారంలో పాల్గొంటూ, అనేక సమావేశాలు నిర్వహిస్తూ, పట్టభద్రుల మద్దతును కూడగట్టుకునేందుకు ప్రయత్నం చేశారు.
కిషన్ రెడ్డి నేతృత్వంలోని బీజేపీ కూడా తమ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి అనుకూలంగా ప్రచారం నిర్వహించింది. కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్, కే లక్ష్మణ్, డీకే అరుణ వంటి సీనియర్ నేతలందరూ గ్రాడ్యుయేట్లతో సమావేశాలు, మార్నింగ్ వాక్ వంటి కార్యక్రమాలతో ముమ్మర ప్రచారం చేశారు.
పోలింగ్ ఏర్పాట్లు పూర్తి...
ఎమ్మెల్సీ ఎన్నికలకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. గతంలో వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో ఏర్పాటు చేసిన 605 పోలింగ్ కేంద్రాల్లోనే ఈసారి కూడా పోలింగ్ జరగనుంది. ఆదివారం ఎన్నికల సామగ్రి పంపిణీ, సిబ్బందిని ఎన్నికల కేంద్రాలకు పంపించటం వంటి కార్యక్రమాలు పూర్తి చేశారు.
గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గంలో 12 కొత్త జిల్లాల్లో 34 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అధికారుల తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ పరిధిలో 4,61,806 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు. వీరిలో 2,87,007 మంది పురుషులు, 1,74,794 మంది మహిళలు, ఐదుగురు థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు.