బెట్టింగ్ యాప్ లకు బానిసై రివాల్వర్ అమ్ముకున్న ఎస్ ఐ
రికవరీ చేసిన బంగారాన్ని తాకట్టు పెట్టినట్లు వెల్లడి
బెట్టింగ్ యాప్ లకు బానిసై చేసిన అప్పులు తీర్చేందుకు అంబర్ పేట ఎస్ ఐ భాను ప్రకాశ్ చివరకు ప్రభుత్వం కేటాయించిన 9 ఎంఎం రివాల్వర్ ను అమ్ముకున్నాడని పోలీసుల విచారణలో తేలింది. ఇదే రివాల్వర్ తో నిందితులను బెదిరించి బంగారు నగలను స్వాధీనం చేసుకున్న సబ్ ఇన్స్ పెక్టర్ భాగోతం ఒక్కోటి వెలుగులోకి వస్తున్నాయి. సదరు బంగారాన్ని ఓ ప్రయివేటు ఫైనాన్స్ సంస్థలో ఎస్ ఐ తాకట్టుపెట్టాడని పోలీసులు తెలిపారు. నిందితుడిని బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
బెట్టింగ్ యాప్ లపై ఉక్కుపాదం మోపే పోలీసుశాఖ ఇంటి దొంగలను పట్టుకునే పనిలో నిమగ్నమైంది. అంబర్ పేట ఎస్ ఐ పై సీరియస్ గా రియాక్ట్ అయ్యింది. ప్రభుత్వం కేటాయించిన రివాల్వర్ కనిపించకపోవడంతో తీగ లాగితే డొంక కదులుతోంది. సర్వీస్ రివాల్వర్ ఏమయ్యింది అని ఉన్నతాధికారులు ప్రశ్నించినప్పుడు భాను ప్రకాశ్ పొంతన లేని సమాధానాలు ఇచ్చాడు. ఒకసారి ఇంట్లోనే పోయిందని సమాధానం చెప్పడంతో అనుమానం వచ్చిన పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తే అసలు విషయం బయటపడింది. బెట్టింగ్ వ్యసనంలో భాను ప్రకాశ్ రూ.70 లక్షలు పోగొట్టుకున్నాడని పోలీసులు తెలిపారు. అప్పులు తీర్చడానికే తాను ఈ నేరాలకు పాల్పడినట్లు పోలీసుల ముందు నిందితుడు అంగీకరించాడు. ప్రస్తుతం భానుప్రకాష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని అంబర్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ ఎస్సైగా పని చేస్తున్న భానుప్రకాష్ వ్యవహారం ప్రస్తుతం పోలీసు శాఖలో సంచలనమైంది. ఎస్సై చేసిన అక్రమాలు పోలీసు శాఖ ప్రతిష్టను మరింత దిగజార్చినట్టు పరిశీలకులు చెబుతున్నారు. క్రైమ్ కేసులను ఛేదించాల్సిన ఈ ఎస్సై మాత్రం తాను దర్యాప్తు చేసిన కేసుల్లో స్వాధీనం చేసుకున్న సొత్తును దిగమింగడమేకాకుండా అమ్మేసుకున్నాడనే ప్రచారం పోలీసు వర్గాల్లో కలకలం రేపింది. రివాల్వర్‌ను సంఘ విద్రోహశక్తులకు విక్రయించాడా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.