కవిత 'లిక్కర్ గాయం' పై బీఆర్ ఎస్ కారం

పంచాయతీ ఎన్నికల ముందు అవినీతి పుండు కెళుకుతున్న కేసీఆర్ బిడ్డ

Update: 2025-11-26 10:51 GMT

బీఆర్ఎస్ గాయాలపై కవిత కారం రాస్తే, కవిత గాయాలపై బీఆర్ఎస్ నేతలు ఉప్పు చల్లుతున్నారు. ఒకరి లోపాలను మరొకరు ఎప్పటికప్పుడు ఎత్తిచూపుకుంటూ అసలుకే మోసం తెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ నేత నిరంజన్ రెడ్డి, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మధ్య హోరాహోరీ మాటల యుద్ధం జరుగుతోంది. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. గత అంశాలను ఎత్తి ముందేస్తూ తమ విమర్శస్త్రాల పదును పెంచుతున్నారు. కానీ ఇది వీరిద్దరికీ నష్టమే చేస్తుందన్న విషయాన్ని వీళ్లు గ్రహించడం లేదో, గ్రహించినా పట్టించుకోవడం లేదో అర్థం కావడం లేదు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నంత కాలం ఒక్క మాట కూడా మాట్లాడని కవిత.. బయటకు వచ్చినప్పటి నుంచి సందర్భం దొరకడం ఆలస్యం బీఆర్ఎస్ నేతలపై ఆరోపణలు, విమర్శలు గుప్పిస్తున్నారు. అధికారంలో ఉన్న సమయంలో బీఆర్ఎస్ నాయకులు అవినీతికి పాల్పడ్డారని కూడా ఆరోపించారు. కానీ తన తండ్రి కేసీఆర్‌కు ఏమీ తెలియదని, ఆయనను అంతా కలిసి మోసం చేస్తున్నారని అన్నారు. ఈ క్రమంలోనే తాజాగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిపై కవిత ఘాటు వ్యాఖ్యలు చేశారు.

బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి కవిత.. తన రాజకీయ ఉనికి కోసం చాలా తాపత్రయపడుతున్నారు. సొంత పార్టీ పెట్టనున్నారని వాదనలు వినిపించినా కవిత ఆ దిశగా అడుగులు వేయలేదు. కానీ తెలంగాణ జాగృతితో కలిసి ‘జాగృతి జనం బాట’ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో దాదాపు ప్రతి జిల్లాకు వెళ్తూ ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు టార్గెట్‌గా విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే నిరంజన్ రెడ్డి.. భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. అది కాస్తా వారి మధ్య మాటల యుద్ధానికి కారణమైంది. కవితను బీఆర్ఎస్‌లో ఏ నేత కూడా ఇప్పటి వరకు అనని ‘లిక్కర్ రాణి’ అన్న వ్యాఖ్యలను నిరంజన్ రెడ్డి అన్నారు. ఆ వ్యాఖ్యలకు కవిత కాకుండా జాగృతి అధికార ప్రతినిధి శ్రీకాంత్ గౌడ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

నిరంజన్ ఎందుకు భుజాలు తడుముకుంటున్నవ్: శ్రీకాంత్

‘‘నిరంజన్ రెడ్డిపై కవిత మాట్లాడారో లేదో బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి ముందుకు వచ్చారు. కవితపై ఆయన ఆరోపణలు చేస్తున్నారు. అంటే బీజేపీ తో బీఆర్ఎస్ కు ఏం లోపాయికారీ ఒప్పందం ఉందో స్పష్టం చేయాలి. జనం బాటలో మేము అన్ని పార్టీల నాయకుల గురించి మాట్లాడుతున్నాం. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నేతల గురించి కూడా కచ్చితంగా స్పందించాల్సి వస్తుంది’’ అని అన్నారు.

‘‘గత ప్రభుత్వం ఆయన ఆగడాలు కొనసాగించారు. ఈ ప్రభుత్వంలో కూడా అదే చేస్తున్నారని అన్నారు. దాని గురించి అడిగితే హుందాగా మాట్లాడాల్సింది పోయి ఎందుకు అగ్రెసివ్ అవుతున్నావ్. నీళ్ల మంత్రి అని చెప్పుకునే నువ్వు ఏదుల రిజర్వాయర్ ఎందుకు పూర్తి చేయలేదు. జిల్లాలో ఒక్క ఎకరాకు కూడా అడిషనల్ గా మీరు నీళ్లు ఇవ్వలేదు. మీ చెరువులు, కుంటల కబ్జాల గురించి మాట్లాడితే భయం, వణుకు పుడుతుందా?సీలింగ్ యాక్ట్ ప్రకారం ఒక వ్యక్తి కి 50 ఎకరాలకు మించి ఉండకూడదు. మరి మీరు 80 ఎకరాలు ఎలా కొన్నారు. 166 ఎకరాల ప్రహారీ గోడ ఎలా కట్టారు? ఈ అంశాలపై ప్రజా దర్భార్ పెడదమా? ప్రజల్లోకి వెళ్లి చర్చిద్దామా?’’ అని ప్రశ్నించారు.

‘‘కవితని లిక్కర్ రాణి అని సంబోధించారు. బీజేపీ తనను ఎదుర్కొలేక తన కూతురుపై కేసు పెట్టిందన స్వయంగా కేసీఆర్ చెప్పారు. కానీ కేసీఆర్ నాయకత్వాన్ని పాతర వేసే విధంగా మీరు మాట్లాడారు.

హరీష్ రావు నాయకత్వంలో ఆయన పెంపుడు కుక్కలా మొరుగుతున్నావ్. పెద్ద, పొడుగు నాయకులతో ఉంటే కాపాడుతారని ధీమానా? లేదంటే కృష్ణార్జునులు కాపాడుతారని భావిస్తున్నారా? ఆడబిడ్డపై కుసంస్కారంతో మాట్లాడితే జాగృతి నుంచి తీవ్రమైన ప్రతి స్పందన ఉంటుంది. నిరంజన్ రెడ్డి పై వచ్చిన ఆరోపణలపై స్పందించి ప్రభుత్వం విచారణ చేపట్టాలి. కృష్ణార్జునులు ఇలాంటి అవినీతి నాయకులను కాపాడటాన్ని మానుకోవాలి’’ అని వ్యాఖ్యానించారు.

నిజాలు చెప్పే చెడ్డపేరు తెచ్చినట్లా: మనోజా గౌడ్

నిరంజన్ రెడ్డి వ్యాఖ్యలపై జాగృతి అధికారి ప్రతినిధి మనోజా గౌడ్ కూడా ఘాటుగా స్పందించారు. నిజాలు చెప్తే.. చెడ్డపేరు తెచ్చామంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘కవిత కారణంగానే బీఆర్ఎస్ ఓడిపోయిందని మీరు అంటున్నారు. కానీ కేసీఆర్ కళ్లు కప్పి మీ లాంటి నాయకులు చేసిన కబ్జాల కారణంగానే బీఆర్ఎస్ ఓడిపోయింది. సోషల్ మీడియా వేదికగా సో కాల్డ్ మేధావులు, పెయిడ్ బ్యాచ్ కవితపై నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. రెండు మూడేళ్ల క్రితం వచ్చి ఫోజులు కొట్టే బ్యాచ్ హద్దు, అదుపులో ఉండాలని హెచ్చరిస్తున్నాం. అక్రమాలకు పాల్పడిన వారి బండారం బయటపెడితే కేసీఆర్‌కి చెడ్డపేరు తెచ్చారని అంటున్నారు. మరి కేసీఆర్ కూతురును నోటికి వచ్చినట్లు మాట్లాడితే కేసీఆర్‌కి చెడ్డపేరు తెచ్చినట్లు కాదా? నోటికి వచ్చినట్లు మాట్లాడటం మానేసి ముందు పార్టీని కాపాడుకోండి. కవిత బీఆర్ఎస్ కార్యకర్తల గురించే మాట్లాడుతున్నారు. ఆడబిడ్డ గురించి మాట్లాడేప్పుడు లిక్కర్ అని మాట్లాడితే తెలంగాణ ఆడబిడ్డలు ఊరుకోరు. ఇష్యూ బేస్డ్ గా మాట్లాడండి. మేము సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నాం’’ అని తెలిపారు.

కేసీఆర్ అనుమతితోనే నిరంజన్ అన్నారా..!

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయి దాదాపు ఐదు నెలల జైలు జీవితం గడిపిన తర్వాత బెయిల్‌పై కవిత బయటకు వచ్చారు. బయటకు వచ్చిన చాలా కాలం పాటు ఆమె ప్రజల్లోకి రాలేదు. ఇంటికే పరిమితం అయ్యారు. అప్పటి నుంచి కవితను కాంగ్రెస్, బీజేపీ పార్టీల నేతలు ‘లిక్కర్ రాణి’ అని విమర్శించారు. ఆ తర్వాత కవిత.. అనేక కారణాలతో బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చేసినా ఏ బీఆర్ఎస్ నేత కూడా కవితను ‘లిక్కర్ రాణి’ అని అనలేదు. అలాంటిది ఇప్పుడు నిరంజన్ రెడ్డి.. ‘లిక్కర్ రాణి’ అని అనిపించుకుంది ఎవరు ? అని ప్రశ్నించడంతో అది భారీ దుమారాన్ని రేపింది. కేసీఆర్ అనుమతితోనే నిరంజన్ ఆ తరహా వ్యాఖ్యలు చేశారన్న వాదనా మొదలైంది.

బీఆర్ఎస్ పార్టీలో ఎవరు ఏం చేయాలన్నా? అందుకు కేసీఆర్ అనుమతి ఉండాల్సిందే. అందులోనూ కేసీఆర్ కుమార్తె కవితను ఇష్టారాజ్యంగా ఎవరైనా ఏమైనా అంటే కేసీఆర్ ఊర్కుంటారా? అలాంటిది ఇప్పుడు నిరంజన్ రెడ్డి.. అంతలా విమర్శించారంటే అందుకు కేసీఆర్ నుంచి గ్రీన్ సిగ్నల్ అందుకున్నాకనే అయ్యుంటద్న వాదనల బలం పుంజుకుంటుంది. కేసీఆర్‌కు పలు సూచనలు చేస్తూ కవిత లేఖ రాయడం, అది బహిర్గతం అయినప్పటి నుంచి కవిత విషయంలో కేసీఆర్ కొంత కోపంగా ఉన్నట్లు అర్థమవుతోంది. తన కుమారుడిని అమెరికా పంపిస్తున్న తరుణంలో కూడా కవిత ఇంటికి వచ్చినా కేసీఆర్ పట్టించుకోలేదు. దానిని బట్టే కవితపై కేసీఆర్‌కు ఎంత కోపం ఉందో అంచనా వేసుకోవచ్చు. దాని కారణంగానే నిరంజన్ రెడ్డి విమర్శలు గ్రీన్ సిగ్నల్ వచ్చి ఉండొచ్చని చర్చ జరుగుతోంది.

కానీ బయటి పార్టీలు ఏమన్నా ఒక ఎత్తు? సొంత పార్టీ ఏమైనా అనడం ఒక ఎత్తు. కవిత విషయంలో అదే జరుగుతుంది. ఇన్నాళ్లూ కవితపై వస్తున్న ‘లిక్కర్ రాణి’ ఆరోపణలన్నీ కూడా ఇతర పార్టీల వారు చేస్తున్న వ్యాఖ్యలుగా, ఆరోపణలుగానే చూశారు ప్రజలు. కానీ ఇప్పుడు కవిత పుట్టింటి పార్టీ, ఆమె తండ్రి కేసీఆర్ అధ్యక్షుడిగా ఉన్న పార్టీలో కీలక నేత ఆమెను ‘లిక్కర్ రాణి’ అనడం కీలకంగా మారింది. కవిత స్కాం చేయబడ్డే సొంత పార్టీ నేతలు కూడా ఈ తరహా విమర్శలు చేస్తున్నారన్న వాదనలు బలంపుంజుకుంటున్నాయి.

ఇటు కవిత కూడా ఏమాత్రం తగ్గడం లేదు. పార్టీ నుంచి బయటకు వచ్చిన కొన్ని రోజులకే బీఆర్ఎస్ నేతలపై విమర్శలు గుప్పించడం స్టార్ట్ చేశారు. హరీష్ రావును టార్గెట్‌గా చేసుకుని కవిత చేసిన ఆరోపణలు అన్నీఇన్నీ కావు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని, దాని సూత్రధారి హరీష్ రావే అని కూడా ఆమె ఆరోపించారు. ఇతర నేతలను కూడా విమర్శించారు. వారిపై ఆరోపణలు కూడా చేశారు. ఇటీవల జూబ్లీ ఉపఎన్నిక ఓటమి సమయంలో కూడా ‘కర్మ హిట్స్ బ్యాక్’ అని పోస్ట్ పెట్టి పుండుపై కారం చల్లినట్లు చేశారు. కేటీఆర్‌ను కూడా సోషల్ మీడియా వీడి బయటకు రావాలని అన్నారు. కానీ ఇంత చేసినా కవిత ఏనాడూ కూడా కేసీఆర్‌ను ఒక్క మాట అనలేదు. బీఆర్ఎస్ నేతలంతా కూడా తన తండ్రి కేసీఆర్‌ను మోసం చేస్తున్నారనే కవిత విమర్శించారు.

కేసీఆర్‌ను మినహాయించడం కంబ్యాక్ కోసమేనా..

అయితే బీఆర్ఎస్‌లో అందరిపై విమర్శలు, ఆరోపణలు చేస్తున్న కవిత.. కేసీఆర్‌ను మినహాయించారు. ఏమైనా అటూ ఇటూ అయితే బీఆర్ఎస్‌లోకి కంబ్యాక్ ఇవ్వడం కోసం కేసీఆర్ అనే విండోను కవిత కావాలనే పక్కా ప్లాన్ ప్రకారం ఓపెన్ చేసుకుని ఉన్నారనిపిస్తోంది. కానీ కవిత తాను చేస్తున్న ఆరోపణల ద్వారా.. కేసీఆర్ పదేళ్ల పాలనపై కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న ఆరోపణలను వాస్తవాలను చేస్తూన్నారు.

ఇద్దరికీ జరుగుతున్న నష్టం..

తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారుతున్న కవిత వర్సెస్ బీఆర్ఎస్ గొడవ.. ఇరు వర్గాలకు నష్టాన్నే మిగులుస్తోంది. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత రాజకీయ గుర్తింపు కోసం చాలా తాపత్రయ పడుతున్నారు. అందులో భాగంగానే ముందుగా ప్రజల్లో తిరుగుతూ వారి నుంచి పోరాటాన్ని స్టార్ట్ చేశారు. కానీ జాగృతి పేరుతో కవిత చేస్తున్న కార్యక్రమంలో భాగంగా ఆమె ఎక్కువగా బీఆర్ఎస్‌ను టార్గెట్ చేస్తూ వచ్చారు. బీఆర్ఎస్ కొందరు నేతలంతా కలిపి అవినీతి కూటమిగా ఏర్పడ్డారని కూడా ఆరోపించారు. హరీష్ రావు, సంతోష్‌లు భారీగా అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఇవి అసెంబ్లీ ఎన్నికల్లో, ఆతర్వాత జరిగిన రెండు ఉపఎన్నికల్లో ఓడిపోవడంతో బీఆర్ఎస్‌కు అయిన గాయాలను కవిత ఆరోపణలు పుండు చేసి మానకుండా చేస్తున్నాయి. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో దారుణంగా రాణించి అపకీర్తిని మూటగట్టుకున్న బీఆర్ఎస్‌ను కవిత ఆరోపణలు మరింత దిగజారుస్తున్నాయి.

అదే విధంగా బీఆర్ఎస్ నేతలు ఇస్తున్నకౌంటర్లు కూడా కవితకు డ్యామేజీనే ఎక్కువ చేస్తున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో తన కంటూ ప్రత్యేక మార్క్ చూపుకోవాలని ప్రయత్నిస్తున్న కవితకు బీఆర్ఎస్ నేతల ఆరోపణలు మైనస్ అవుతున్నాయి. కవితకు అంటిన లిక్కర్ మరకలు చెరగకుండా చేస్తున్నాయి.

Tags:    

Similar News