హైదరాబాద్ లో నకిలీ ఐఏఎస్ అధికారి అరెస్ట్
ఆయుధ లైసెన్స్ ఉన్న ఇద్దరిని బాడీగార్డులుగా నియమించుకున్న శశికాంత్
హైదరాబాద్ షేక్ పేట లో ఉంటున్న నకిలీ ఐఏఎస్ అధికారిని పోలీసులు అరెస్ట్ చేశారు. తాను ఐఏఎస్ , ఐపిఎస్, ఎన్ఐఏ అధికారినంటూ అమాయకులను మోసం చేస్తున్న శశికాంత్ అనే వ్యక్తిని పోలీసులు చాకచక్యంగా బుధవారం అదుపులోకి తీసుకున్నారు. సమాజంలో ఉన్నతాధికారిగా కనిపించేందుకు తన వెంబడి ప్రత్యేక బాడీ గార్డులు, వాకీటాకీ , సైరన్ అమర్చిన కారు మెయిన్ టైన్ చేసేవాడు. ఐఏఎస్ , ఐపిఎస్ , ఎన్ఐఏ అధికారుల ఫేక్ ఐడి కార్డులు, ఫేక్ లెటర్ హెడ్ లతో ప్రజలను బురిడీ కొట్టించేవాడు.
తాను డిప్యూటి కమిషనర్ ( మైన్స్) అంటూ వ్యాపారులను మోసం చేస్తున్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. వ్యాపారుల నుంచి లక్షలాది రూపాయలు శశికాంత్ వసూలు చేసినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
గోల్డ్ జిమ్ మేనేజింగ్ డైరెక్టర్ అలీ హసన్ నుంచి ఏకంగా రూ 10.50లక్షల రూపాయలు వసూలు చేసినట్టు పోలీసులు ఆరా తీశారు. తెలంగాణ పరిశ్రమల మౌలిక సదుపాయాల కార్పోరేషన్ (టిఎస్ ఐఐసీ)కి చెందిన ఫేక్ లెటర్ హెడ్ పెట్టుకుని టిఎస్ ఐఐసి భూములను ఇప్పిస్తానని గోల్డ్ జిమ్ మేనేజింగ్ డైరెక్టర్ నుంచి శశికాంత్ భారీ మొత్తంలో క్యాష్ వసూలు చేసినట్లు పోలీసులు చెప్పారు. జిమ్ సూపర్ వైజర్ నుంచి ఎనిమిది లక్షల రూపాయలు, జిమ్ బిల్డింగ్ ఓనర్ దగ్గర కూడా డబ్బులు వసూలు చేసినట్టు పోలీసులు చెప్పారు. తమకు పరిశ్రమల భూమిని చౌకగా ఇప్పిస్తానని నమ్మబలికి మోసం చేశాడని బాధితులు ఫిల్మ్ నగర్ పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అతను చేసే మోసాలకు ప్రవీణ్ (ఎ 2), విమల్ ( ఎ 3) పూర్తిగా సహకరించారు. శశికాంత్ ను అరెస్ట్ చేసే సమయంలో రెండు మొబైల్ ఫోన్లు, ఆరు సిమ్ కార్డులు, రెండు వాకీ టాకీలను, నకిలీ ఐడి కార్డులు, లెటర్ హెడ్ లు వంటి సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇద్దరు గన్ మెన్ లను పెట్టుకుని బిల్డర్ లను బెదిరించే వాడని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఇద్దరు గన్ మెన్ లను కూడా పోలీసులు అదుపులో తీసుకుని విచారిస్తున్నారు.ప్రతీ నెలా ఇచ్చే జీతం కోసం నకిలీ ఐఏఎస్ అధికారి వెంట ఉండిపోయామని వారు పోలీసులకు వెల్లడించారు. ఈ ఇద్దరు బాడీ గార్డ్ లు ఆయుధ లైసెన్స్ తీసుకుని నకిలీ ఐఏఎస్ అధికారికి సహకరించారని డిసిపి శ్రీనివాసులు చెప్పారు. నకిలీ ఐఏఎస్ అధికారితో బాటు సహకరించిన గన్ మెన్లపై కేసులు నమోదైనట్టు డిసిపి చెప్పారు. స్పెషల్ ఆఫిసర్ అంటూ బిల్డర్ల వద్ద నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసే నకిలీ అధికారి అరెస్ట్ తర్వాత అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయని పోలీసులు వెల్లడించారు. బెదిరించడమే కాదు పలు ప్రాజెక్టులు ఇప్పిస్తానని బిల్డర్ల నుంచి డబ్బులు గుంజేవాడు అని పోలీసులు చెప్పారు. సదరు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తాము అధికారులమంటూ డబ్బులు డిమాండ్ చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని వెస్ట్ జోన్ డిసిపి శ్రీనివాసులు మీడియాతో చెప్పారు.