400 మందిని రోడ్డున పడేసిన ఐటీ సంస్థ !

నిరుద్యోగులే టార్గెట్‌గా ఉద్యోగాలిప్పిస్తామని నమ్మించి మోసం చేసిన సంస్థ.

Update: 2025-11-26 10:54 GMT

మాదాపూర్‌లో ఉన్న ఐటీ కారిడార్‌లోని ఓ ఐటీ సంస్థ బోర్డ్ తిప్పేసింది. నిరుద్యోగులనే టార్గెట్‌గా చేసుకుని దందా చేసిన సంస్థ ఒక్కసారిగా బోర్డ్ తిప్పేయడంతో దాదాపు 400 మంది రోడ్డున పడ్డారు. ఎన్ఎస్ఎన్ ఇన్ఫోటెక్ అనే సంస్థ స్థానికంగా తాము బాగా పాపులర్ అన్నట్లు నిరుద్యోగులను నమ్మించింది. శిక్షణ, ఉద్యోగావకాశం పేరుతో వారి దగ్గర డబ్బులు తీసుకుంది. ఇప్పుడు ఒక్కసారిగా బోర్డ్ తిప్పేసింది. ఒక్కొక్కరి దగ్గర నుంచి దాదాపు రూ.3లక్షల డబ్బులు తీసుకున్నట్లు సమాచారం. దీంతో బాధితులంతా పోలీసులను ఆశ్రయించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా పోలీసుల దర్యాప్తులు పలు కీలక విషయాలు వెలుగు చూశాయి.

ఈ మోసం మొత్తానికి కూడా కంపెనీ యజమాని స్వామి నాయుడు అనే వ్యక్తి మాస్టర్ మైండ్ అని పోలీసులు నిర్ధారించారు. తాను ప్రైవేట్ ఛానల్ యజమానిని అని చెప్పుకునేవాడని, అటువంటి మోసపూరిత మాటలతోనే యువతకు టోకరా వేసినట్లు గుర్తించారు. ప్రస్తుతం స్వామి నాయుడు పరారీలో ఉన్నాడని, అతడికి కోసం గాలింపులు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. కాగా బాధితులు అందరూ కూడా సైబరాబాద్ కమిషనరేట్‌లోని ఈఓడబ్ల్యూ( ఎకనామిక్ అఫెన్సింగ్ వింగ్) దగ్గర ఫిర్యాదులు చేస్తున్నారు.

ఎప్పటిలానే తాము ఆఫీసుకు వెళ్లామని, కాగా అక్కడ ఖాళీ కార్యాలయం కనిపించడంతో విస్తుబోయామని బాధితులు చెప్తున్నారు. తాము మోసపోయామని స్పష్టం కావడంతో పోలీసులను ఆశ్రయించామని తెలిపారు. ఈ విషయంపై దృష్టి పెట్టిన పోలీసులు.. యువత కూడా కాస్తంత అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ఉద్యోగాల పేరుతో యువతను మోసాలు చేస్తున్న ఘటనలు అధికంగా జరుగుతున్నాయని, ఈ క్రమంలో ఎవరైనా ఒక్క రూపాయి అయినా ఖర్చు పెట్టే సమయంలో అన్నీ తెలుసుకునే ముందడుగు వేయాలని సూచిస్తున్నారు.

Tags:    

Similar News