సర్పంచ్ గా గెలిస్తే.. జీవితంలో ఓడినట్లేనా?
గత అనుభవాలను దృష్టిలో ఉంచుకోవాలంటున్న తాజా మాజీలు, భారీగా ఖర్చు పెట్టవద్దని హితవు
By : Chepyala Praveen
Update: 2025-11-26 10:58 GMT
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. గత రెండు సంవత్సరాలుగా గ్రామాలకు నాయకుడు లేక అధికారుల కింద పాలన కొనసాగుతోంది. అలాగే శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల తరువాత రాష్ట్రంలో ఎలాంటి ఎన్నికలు లేకపోవడంతో గ్రామాలల్లో కూడా రాజకీయ స్తబ్ధత ఏర్పడింది.
అయితే రాష్ట్ర ఎన్నికల సంఘం మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు ప్రకటించడం, రిజర్వేషన్ల ఖరారు, ఎన్నికల తేదీలు వెలువడటం, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రావడం, నామినేషన్ తేదీలు కూడా నిర్ణయం కావడంతో పల్లెలన్నీ కోలాహాలంగా ఉన్నాయి.
డిసెంబర్ 11,14,17 తేదీలలో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు కమిషనర్ రాణి కుముదిని మీడియా సమావేశంలో ప్రకటించడమే ఆలస్యం పల్లెల్లో విందు రాజకీయాలు మొదలయ్యాయి.
సర్పంచ్ పదవిపై ఆశపెట్టుకున్న వారు ఇప్పటికే తమకు అనుకూలంగా ఓ వర్గాన్ని ప్రచారంలో దింపేశారు. వార్డులో తమకు అనుకూలంగా ఉన్నవారేవరూ? తటస్థంగా ఉన్న ఓటర్లు, వ్యతిరేకంగా ఉన్నవారు ఎవరెవరంటూ ఆరాలు తీయడం ప్రారంభించారు. ఇందుకోసం భారీగా ఖర్చు చేస్తున్నారు.
తమ టీమ్ ను సిద్దం చేసుకోవడానికి ఉప సర్పంచ్ గా ఉన్న వ్యక్తి భవిష్యత్ లో తమ సీటుకు ఎసరు పెట్టకుండా ఉండే వారేవరూ అని వెతుకుతున్నారు. పైసలు ఎన్ని పోయిన ఫరావలేదు కానీ.. గెలిచి తీరాల్సిందే అని పట్టుదలకు పోతున్నారు.
అంతా బాగానే ఉంది కానీ.. ఇంతకుముందు సర్పంచ్ గా చేసిన వారు ఎంత ఖర్చు చేశారు. ఆ ఐదేళ్లలో వారు ఏం చేశారు. వారి ఆర్థిక పరిస్థితి ఏంటీ? ‘ఫెడరల్ తెలంగాణ’ చాలామంది మాజీ సర్పంచ్ లు, సర్పంచ్ పదవికి పోటీ చేసిన వారితో మాట్లాడింది. తమ పేరు వెల్లడించవద్దనే షరతుతో వారిలో కొంతమంది తాజా మాజీలు అనేక విషయాలను పంచుకున్నారు.
ప్రెస్టేజ్ కానీ తరువాత అంతా ఫ్రస్టేషనే..
దేశంలో గ్రామ స్వరాజ్యం అనేది పల్లెలో మొదలవ్వాలని కేంద్ర ప్రభుత్వం 73, 74 వ రాజ్యాంగ సవరణ చేసి పంచాయతీలకు రాజ్యాంగబద్ద స్థానం కల్పించింది. కానీ వాస్తవంగా అలా జరగడం లేదు. చాలా గ్రామా పంచాయతీలకు ఎలాంటి ఆదాయ వనరులు లేవు.
ప్రభుత్వం ఇచ్చిన పథకాలు, ఆదాయాలపైనే ఆధారపడి మనుగడ సాగిస్తున్నాయి. అయినప్పటికీ సర్పంచ్ ఎన్నికలను చాలామంది అభ్యర్థులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని బరిలోకి దిగుతున్నారు.
చాలా చిన్న గ్రామ పంచాయతీలలో కూడా కనీసం డజన్ కు తక్కువ కాకుండా అభ్యర్థులు నిలబడుతున్నారు. ఒకరిని చూసి మరొకరు భారీ ఖర్చు చేస్తున్నారు. హనుమకొండ జిల్లాలోని భీమదేవరపల్లి మండలంలోని 3000 ఓటర్లు ఉన్న ఓ గ్రామ సర్పంచ్ అభ్యర్థి గడచిన ఎన్నికలలో గెలవడానికి దాదాపు 35 లక్షలు ఖర్చు చేసింది.
తమ ప్రత్యర్థి వర్గం కూడా ఇదే స్థాయిలో ఖర్చు చేశారు. ఇద్దరిది రెడ్డి వర్గాలు, యూఎస్ నేపథ్యం ఉండటంతో ఎవరూ తగ్గలేదు. దానితో ఓటర్ కు పదిహేను వందల నుంచి రెండువేల వరకూ పంచారు.
వీటికి తోడు నలుగురు ఉన్న కుటుంబ సభ్యులకు ఓ ఫుల్ బాటిల్ లిక్కర్ కూడా అందించారు. దాదాపు పక్షం రోజుల పాటు రోజుకు పదిహేను మంది వరకూ అనుచరులను మెయిన్ టైన్ చేసి వారి ఖర్చులు భరించారు. కానీ గెలిచిన తరువాత వారు పెట్టిన ఖర్చు లో కనీసం పదోవంతు కూడా రాబట్టుకోలేకపోయారు.
ఉన్నది అమ్ముకుని.. కూరగాయలు అమ్ముకుంటూ..
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఓ గ్రామ ఎంపీటీసీగా పోటీ చేసిన సురేష్(పేరుమార్చాం) కథ మరోలా ఉంది. అప్పటికే అధికార టీఆర్ఎస్ చాలా చురుకుగా ఉండే కార్యకర్త కావడంతో ఎంపీటీసీ ఎన్నికలల్లో బరిలోకి దిగాడు.
కులం సపోర్టు కూడా బాగా రావడంతో సులువుగా గెలుస్తామనే ధీమాతో నామినేషన్ వేశాడు. అయితే ప్రత్యర్థి కూడా గట్టి వ్యక్తే కావడంతో ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా అందినకాడికి అప్పు చేసి గెలిచాడు.
కానీ ఆ తరువాతే అసలు కథ మొదలైంది. ఎంపీటీసీ పదవీ అలంకార ప్రాయమని, దానికి ఎలాంటి విలువ లేదని, పైసా ఆదాయం లేదని తెలుసుకున్నాడు. తన అప్పులను తీర్చాడానికి రకరకాల పనులు చేసిన అప్పులకు వడ్డీలకు కూడా సరిపోకపోవడంతో తనకున్న ఎకరం పొలం అమ్మి అప్పులు తీర్చాడు.
తరువాత ఉత్తర తెలంగాణలోని మరో పట్టణానికి వలసపోయి అక్కడ కూరగాయల వ్యాపారం చేసుకుంటున్నాడు. తనను స్థానిక ఎన్నికలు నిలువునా ముంచాయని, జీవితకాలం వృథా అని ఆవేదన వ్యక్తం చేశాడు. పిల్లల చదువులు, ఇంటి అద్దెకు కూడా అవస్థ పడుతున్నట్లు చెప్పుకొచ్చాడు.
కోటీ రూపాయల పని.. 20 లక్షల అప్పు..
గ్రామపంచాయతీ స్థాయిలో జరిగే పనులకు సకాలంలో బిల్లు రాక అనేమంది సర్పంచ్ లు, ఎంపీటీసీలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. వారిలో కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పర్లపల్లి గ్రామానికి చెందిన చిందం చంద్రమౌళి ఒకరు.
‘‘నేను ఎంపీటీసీగా గెలిచాక అనేక వర్క్ లు చేశాను. ఐదు లక్షల లోపు ఉన్న పనులు గ్రామపంచాయతీ తీర్మానంతో చేసుకోవచ్చు. అంతకుమించితే జిల్లా నుంచి అనుమతి రావాల్సిందే. నేను అన్ని పనులు పూర్తి చేశాను వీటి విలువ దాదాపు కోటీ రూపాయలపైన ఉంటుంది.
పనులకు విధించిన గడువు వల్ల పనులు పూర్తి చేయాలని నా సొంత జేబు నుంచి డబ్బు ఖర్చు చేశాను. కానీ అన్ని బిల్లులు సరిగా రాకపోవడంతో రూ.20 లక్షలకు పైగా అప్పు మిగిలింది’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
అంతకుముందు సర్పంచ్ పదవికి పోటీ చేసి భంగపడిన ఆయన, తరువాత గెలవాలనే లక్ష్యంతో ఎంపీటీసీగా బరిలోకి దిగి విజయం సాధించారు. కానీ ఆయనకు మిగిలింది అప్పులు మాత్రమే.
ఎకరం భూమి అమ్మించారు..
సర్పంచ్ ఎన్నికలు సమీపిస్తున్నాయని సమాచారం రాగానే ఊళ్లో ఒక వర్గం మెల్లగా తమ ప్రయత్నాలు మొదలు పెడతారు. బాగా ఖర్చు పెట్టే అభ్యర్థులను గుర్తించి ఎన్నికల మాటున తమ పట్టును జారీపోకుండా చూసుకుంటారు.
వీరికి భజన చేయడానికి ఎప్పుడూ ఓ వర్గాన్ని సదరు పెద్ద మనుషులే పెంచిపోషిస్తారు. అలాంటి వారి మాటలు నమ్మి హనుమకొండ జిల్లాలోని ఓ మహిళా, సర్పంచ్ ఎన్నికలలో గెలవడానికి ఎకరం భూమిని అమ్మినట్లు ఫెడరల్ కు చెప్పారు.
ఇవే కాకుండా మనకు పోటీగా అనేక మంది డమ్మి అభ్యర్థులను నిలబెట్టి నామినేషన్ విత్ డ్రా చేయించడానికి డబ్బు డిమాండ్ చేసేలా వెన్నుపోటు రాజకీయాలు చేస్తారని మరో మాజీ సర్పంచ్ పేర్కొన్నారు.
‘‘మాకు రాజకీయాలలోకి రావాలనే ఉద్దేశం లేదు. బీసీ మహిళకు సర్పంచ్ అవకాశం వచ్చిందని, ఏకగ్రీవం చేస్తామని ఓ పెద్దమనిషి చెప్పారు. ఆయన మాటలు నమ్మి పోటీ చేయడానికి ఒప్పుకున్నాను.
కానీ సమయం గడిచిన కొద్ది అభ్యర్థులు వచ్చారు. ఏకగ్రీవం చేయడానికి చేసిన ప్రయత్నాలు అన్ని విఫలం అయ్యాయి. చివరకు ఓడిపోవద్దనే లక్ష్యంతో పది లక్షలు ఖర్చు చేశాము.. కాదు చేయించారు.
కానీ ఐదు సంవత్సరాలలో మాకు తిరిగి వచ్చింది ఏమిలేదు. ఖాళీ చేతులతో, అప్పుల కుప్పతో మిగిలిపోయాం’’ అని ఆ మహిళా మాజీ సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజల గొంతెమ్మ కోరికలు..
మా ఊళ్లో కోతుల బెడద చాలా ఉంది. కాబట్టి కోతులను వెళ్లగొట్టి మమ్మల్ని కాపాడిన వారికే ఓటు వేస్తామని కొంతమంది తెగేసి చెప్తుంటారు. కానీ ఎన్నికలు జరగడానికి ముందు వారికి చేయాల్సిన మర్యాదలు చేయాల్సిందే అని సర్పంచ్ గా పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి వెల్లడించారు.
ప్రస్తుతం కొన్ని గ్రామాల వాట్సాప్ గ్రూపులలో ఓ మెసెజ్ తెగ వైరల్ గా మారిన సంగతి గుర్తు చేశాడు. ‘‘ బాండ్ పేపర్ పై సర్పంచ్ ఎన్నికల ముందు ఎంత ఆస్తి ఉంది. అంతే ఆస్థి పదవీకాలం పూర్తయ్యాక కూడా ఉండాలి’’ అని ప్లే అవుతున్న ఓ వీడియోను చూపించారు.
సర్పంచ్ ఎన్నికలలో గెలిచిన తరువాత నెలకు రూ. 5 వేల జీతం తప్ప ఏం రాదని, అనవసరంగా లక్షలు ఖర్చు పెట్టి అప్పుల పాలు కావద్దని కొత్తగా పోటీ చేయబోయే అభ్యర్థులకు సూచించాడు. గెలిచాక భూమి పంచాయతీలు, పథకాల అమలు చేయడంలో పక్కవారికి ఇచ్చి, తమకు ఇవ్వకపోతే దుర్మార్గుడనే నిందలు వేస్తారని వివరించారు.
కొత్తగా తీసుకొచ్చిన తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం వల్ల కూడా సర్పంచ్ ల పదవీ దినదినగండంగా మారిందన కొంతమంది తాజా మాజీలు వివరించారు. అనేక పనులు చేయాలని సర్పంచ్ ల మీద ఒత్తిడి తేస్తారని కానీ బిల్లులు చెల్లించకుండా తీవ్రం జాప్యం చేస్తారని పేర్కొన్నారు.
గడిచిన ఐదు సంవత్సరాల సర్పంచ్ పదవీకాలంలో 60 మంది సర్పంచ్ లు ఆత్మహత్యలు చేసుకున్నారని వివరించారు. గొప్పలకు పోయి లక్షలకు లక్షలు ఖర్చు చేసి జీవితాన్ని ఇబ్బందుల్లోకి లాగొద్దని తమ అనుభవాలను వివరించారు.
ఎన్నికలు ఎప్పుడు జరగబోతున్నాయి..
తెలంగాణలో మొత్తం మూడు విడతలుగా పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి. రాష్ట్రంలో మొత్తం 12,728 సర్పంచ్ స్థానాలు, 1,12,242 వార్డులు ఉన్నాయి.
ఎన్నికలు ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ నిర్వహించబోతున్నారు. మధ్యాహ్నం రెండు గంటల తరువాత కౌంటింగ్ ప్రక్రియ ఉంటుంది. నేటి నుంచి తొలి విడత ఎన్నికలు జరిగే పంచాయతీలకు నామినేషన్ స్వీకరిస్తున్నారు.
తొలి విడతలో 4,236 పంచాయతీలకు, 37,440 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. రెండో విడతలో 4,333 సర్పంచ్ లకు, 38,350 వార్డులకు, మూడో విడతలో 4,333 సర్పంచ్ లు, 38, 350 స్థానాలకు పోలింగ్ ప్రక్రియ ఉంటుంది.
నెల రోజుల క్రితమే పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. అయితే రిజర్వేషన్ ప్రక్రియలో 50 శాతం మించడంతో హైకోర్టు వాటికి బ్రేకులేసింది. ముఖ్యంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటుతున్నాయని హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది.
దీనితో ప్రభుత్వం కూడా వెనక్కి తగ్గింది. జూబ్లిహిల్స్ ఉప ఎన్నికలలో అధికార పార్టీ ఘన విజయం సాధించడంతో మరోమారు పంచాయతీ ఎన్నిలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.
15వ ఆర్థిక సంఘం ప్రకారం గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరపకుంటే దాదాపు మూడు వేల కోట్ల కేంద్ర నిధులు వెనక్కి వెళ్లే అవకాశం ఉండటం కూడా ఇప్పుడు ఎన్నికలు నిర్వహించడానికి ఒక కారణంగా చెప్పవచ్చు.