పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై హైకోర్టులో పిటిషన్
బీసీలకు అన్యాయం జరిగిందని పిటిషన్ వేసిన గ్రామస్తులు.
పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ల అంశంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తప్పేలా కనిపించడం లేదు. పాత రిజర్వేషన్ల పద్దతిలోనే పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు చేపట్టింది. కాగా వీటిలో తమకు అన్యాయం జరిగిందంటూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు. బీసీ జనాభా ఆధారంగా రిజర్వేషన్లు కేటాయించలేదని పిటిషనర్లు పేర్కొన్నారు. ఇప్పటికే స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం చిక్కులు ఎదుర్కొంటోంది. అందువల్లే స్థానిక ఎన్నికలను విడతలుగా నిర్వహించాలని, ముందుగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ క్యాబినెట్ నిశ్చయించుకుంది. ఆ ప్రకారమే ముందడుగు వేస్తూ పాత పద్దతిలోనే రిజర్వేషన్లను ఖరారు చేసింది. ఈ విషయంలో ఇప్పుడు పలువురు గ్రామస్తులు హైకోర్టులో పిటిషన్ వేయడంతో తెలంగాణ ప్రభుత్వానికి పంచాయతీ ఎన్నికల విషయంలో కూడా ఎదరుదెబ్బ తప్పదా అన్న చర్చ మొదలైంది.
కల్వకుర్తి నియోజకవర్గంలోని వెల్దండ తిమ్మనోనిపల్లిలో బీసీ జనాభా ఆధారంగా రిజర్వేషన్ల కేటాయింపు జరగలేదని పిటిషనర్లు పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీల కంటే బీసీ జనాభా అధికంగా ఉందని మరో పిటిషనర్ తెలిపారు. అదే విధంగా సంగారెడ్డి జిల్లాలోని పలు గ్రామాల్లో సరైన రిజర్వేష్లు పాటించడం లేదని అంధో్ మండలం రామసానిపల్లికి చెందిన మాజీ సర్పంచ్ ఆగమయ్య మరో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టీ మాధవిదేవి బుధవారం విచారించారు. ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం విచారణను గురువారానికి వాయిదా వేశారు. కాగా ఈ వాదనల్లో
రిజర్వేషన్లను ఖరారు చేస్తూ ప్రభుత్వం జీవో నెం.46ను తీసుకొచ్చిందని పిటిషనర్ తెలిపారు. కాగా జిల్లాలో మొత్తం 613 గ్రామ పంచాయతీలు ఉన్నాయని, వాటిలో బీసీలకు 117 సర్పంచ్ స్థానాలనే రిజర్వ్ చేశారని పిటిషనర్ ఆగమయ్య తరుపు న్యాయవాది న్యాయమూర్తికి వివరించారు. సంగారెడ్డి జిల్లాలో 19శాతం బీసీ రిజర్వేషన్లే అమలు చేశారని న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే రిజర్వేషన్లపై సంగారెడ్డి కలెక్టర్ జారీ చేసిన గెజిట్‌ను రద్దు చేసి మళ్ళీ రిజర్వేషన్లు కేటాయించేలా ఆదేశాలు ఇవ్వాలని న్యాయవాది కోరారు. రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 17శాతం రిజర్వేషన్లు వస్తున్నాయని, కానీ ప్రభుత్వం ఇచ్చిన జీఓ నెం.46కు కేటాయించిన రిజర్వేషన్లు విరుద్ధంగా ఉన్నాయని పిటిషనర్లు పేర్కొన్నారు.