మంత్రుల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయా ?

సీఎం పోస్టుకోసం రేవంత్(Revanth) తో పాటు పై ముగ్గురు పోటీపడిన విషయం అందరికీ తెలిసిందే.;

Update: 2025-07-18 10:06 GMT
Ministers Ponguleti,Uttham and Bhatti

మంత్రుల ఫోన్లను ఎనుముల రేవంత్ రెడ్డి ట్యాపింగ్ చేయిస్తున్నారా ? అవునని అంటున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఖమ్మం జిల్లా పర్యటనలో మాట్లాడుతు పదవి ఊడిపోతుందన్న భయంతోనే రేవంత్ తన మంత్రివర్గంలోని ముగ్గురు మంత్రుల ఫోన్లను ట్యాప్ చేయిస్తున్నట్లు ఆరోపించారు. మంత్రులు అని చెప్పటంతో ఆగని కేటీఆర్ వారిపేర్లను కూడా బయటపెట్టారు. మంత్రివర్గంలోని పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Ponguleti), ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttham), ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Bhatti vikramarka) ఫోన్లను రేవంత్ ట్యాప్ చేయిస్తున్నట్లు చేసిన ఆరోపణలు కాంగ్రెస్ లో దుమారం రేపుతున్నాయి. సీఎం సీటుకు పై ముగ్గురు ఎప్పుడు ఎసరుపెడతారో అన్న భయంతోనే ముఖ్యమంత్రి పై ముగ్గురి ఫోన్లను ట్యాప్ చేయిస్తున్నట్లు చెప్పారు.

తాను ఊరికే ఆరోపణలు చేయటంలేదని తన దగ్గర అన్నీ ఆధారాలు ఉన్నాయని కూడా అన్నారు. తొందరలోనే తనదగ్గర ఉన్న ఆధారాలను బయటపెడతానని ప్రకటించారు. కేటీఆర్ చేసిన ఆరోపణల్లో ఎంతవరకు నిజమో ఎవరికీ తెలీదు కాని కాంగ్రెస్ లో కలకలం మాత్రం మొదలైంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం పోస్టుకోసం రేవంత్(Revanth) తో పాటు పై ముగ్గురు పోటీపడిన విషయం అందరికీ తెలిసిందే.

ఇప్పటికే బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ట్యాపింగ్ లో కేసీఆర్(KCR), కేటీఆర్(KTR) పాత్ర ముఖ్యమని ఇప్పటికే రేవంత్, మంత్రులు అనేకసార్లు ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ట్యాపింగ్ లో కీలకపాత్ర పోషించిన పోలీసు అధికారుల్లో నలుగురిని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్) అరెస్టుచేసి విచారిస్తోంది. అప్పట్లో ట్యాపింగులో కీలకపాత్ర పోషించిన ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ టీ ప్రభాకరరావును సిట్ విచారిస్తోంది. ట్యాపింగు కేసులో కేసీఆర్, కేటీఆర్ పై కేసులు పెట్టి అరెస్టుచేయాలని కేంద్రమంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి చాలాసార్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. కేసీఆర్, కేటీఆర్ పై కేసులుపెట్టి అరెస్టుచేయటం చేతకాకపోతే ట్యాపింగ్ కేసును సీబీఐకి బదిలీచేయాలని కూడా డిమాండ్ చేశారు.

పోలీసువర్గాల సమాచారం ప్రకారం ఏదోరోజు టెలిఫోన్ ట్యాపింగ్ కేసు కేసీఆర్, కేటీఆర్ మెడకుచుట్టుకునే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. బహుశా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకునే కాబోలు కేటీఆర్ ఎదురు రేవంత్ పైన ట్యాపింగ్ ఆరోపణలు చేస్తున్నట్లు అనిపిస్తోంది. మరి కేటీఆర్ దగ్గర ఉన్న ట్యాపింగ్ ఆధారాలు ఏమిటో చూడాల్సిందే.

Tags:    

Similar News