టీడీపీ సభ్యత్వం తీసుకున్న బాబూ మోహన్..

తెలంగాణలో టీడీపీని పునరుజ్జీవింపజేయాలని పార్టీ అధినేత నారా చంద్రబాబు సహా పార్టీ పెద్దలు అంతా తెగ కృషి చేస్తున్నారు.

Update: 2024-10-29 08:18 GMT

తెలంగాణలో టీడీపీని పునరుజ్జీవింపజేయాలని పార్టీ అధినేత నారా చంద్రబాబు సహా పార్టీ పెద్దలు అంతా తెగ కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ టీడీపీలో సీనియర్ నేతలకు అవకాశం కల్పించడానికి టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవల తీగల కృష్ణారెడ్డి కూడా తాను అతి త్వరలో టీడీపీలో చేరనున్నట్లు ప్రకటించారు. కాగా తాజాగా మాజీ మంత్రి, నటుడు బాబూ మోహన్.. టీడీపీ సభ్యత్వం తీసుకున్నారు. ఆందోల్ నియోజకవర్గంలో ఆయన సభ్యత్వం తీసుకున్నట్లు ఆయనే స్వయంగా ప్రకటించారు. ఈ క్రమంలోనే మెంబర్‌షిప్ స్లిప్‌తో తీసుకున్న ఫొటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో టీడీపీ మళ్ళీ పుంజుకుంటుందా? టీడీపీ రాక ప్రస్తుతం తెలంగాణలో పాతుకుపోయి ఉన్న బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌లపై ఏమాత్రం ఉండనుంది? టీడీపీ హైకమాండ్‌తో ఇప్పటి వరకు ఎంతమంది టచ్‌లోకి వెళ్లారు? అనే అంశాలపై తీవ్ర చర్చ సాగుతోంది. గతంలో చంద్రబాబును కలవాడనికి వెళ్లిన కొద్ది సేపటికే టీడీపీలో చేరనున్నట్లు తీగల కృష్ణారెడ్డి ప్రకటించారు. ఆరోజు ఆయనతో పాటు మాజీ మంత్రి మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి కూడా చంద్రబాబుతో భేటీ అయ్యారు. కానీ తన మనవరాలు పెళ్ళికి ఆహ్వానించడం కోసమే తాను వెళ్లానని మల్లారెడ్డి తర్వాత స్పష్టం చేశారు. ఇది 7 అక్టోబర్‌న జరిగింది.

తీగల ఏమన్నారంటే..

ఈ సందర్భంగా తీగల కృష్ణారెడ్డి మాట్లాడుతూ హాట్ కామెంట్స్ చేశారు. హైదరాబాద్ అభివృద్ధి చెందిందంటే అది చంద్రబాబు, టీడీపీ ఘనతే అని అన్నారు. ‘‘తెలంగాణలో ఇంకా టీడీపీ అభిమానులు ఉన్నారు. టీడీపీకి తెలంగాణలో మళ్ళీ పూర్వవైభవం తీసుకొస్తాం. త్వరలోనే ఆ పార్టీలో చేరనున్నాను. నాతో పాటు చాలా మంది నాయకులు టీడీపీలో చేరనున్నారు’’ అని ఆయన ప్రకటించారు. కాగా ఈ సందర్బంగానే మీడియాతో మాట్లాడటానికి మాజీ మంత్రులు మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్‌ నిరాకరించారు. అయితే ఇప్పుడు బాబు మోహన్ కూడా రాజకీయంగా బలోపేతం కావాలంటే ప్రస్తుతం తెలంగాణలో టీడీపీ మంచి మార్గమని భావించే ఆ పార్టీ కండువా కప్పుకోవడానికి సిద్ధమయ్యారని వాదన వినిపిస్తోంది.

ఇది వరకు బీజేపీలో ఉన్న బాబు మోహన్.. రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పార్టీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత కేఏ పాల్ పార్టీ ‘ప్రజాశాంతి’లో చేరారంటూ వార్తలు కూడా జోరుగా వచ్చాయి. కాగా కొద్దిరోజుల కింద హైదరాబాద్‌కు ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు వచ్చిన సమయంలో బాబు మోహన్ వెళ్లి కలిశారు. అప్పుడే టీడీపీలోకి వస్తానన్న బాబు మోహన్ ప్రతిపాదనకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ఆ సందర్భంగానే టీడీపీ తీర్థం పుచ్చుకున్నట్లు సన్నిహిత వర్గాలు చెప్తున్నారు. రెండు రోజుల క్రితమే టీడీపీ తెలంగాణలో పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. వెంటనే బాబు మోహన్ సభ్యత్వం తీసుకోవడంతో ఈ వార్తలు నిజమే అన్న వాదన మొదలైంది.

Tags:    

Similar News