లాస్ట్ కి వరంగల్ కార్ కి బాల్క సుమనే బెస్టా

కడియం కావ్య బీఆర్ఎస్ పార్టీ వరంగల్ ఎంపీ అభ్యర్థిత్వం నుంచి తప్పుకున్నారు. ఆ స్థానంలో మరో అభ్యర్ధి కోసం గులాబీ అధిష్టానం కసరత్తు ప్రారంభించింది.

Update: 2024-03-29 12:53 GMT

పార్లమెంటు ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. వరుసపెట్టి బీఆర్ఎస్ సీనియర్ నేతలు పార్టీ ఫిరాయించడంతో ఆ పార్టీలో గందరగోళం నెలకొంది. తాజాగా కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్య బీఆర్ఎస్ పార్టీ వరంగల్ ఎంపీ అభ్యర్థిత్వం నుంచి తప్పుకున్నారు. గత కొన్ని రోజులుగా పార్టీ నాయకత్వంపై వస్తున్న అవినీతి ఆరోపణలు, ఫోన్ ట్యాపింగ్, లిక్కర్ స్కాం వంటి వ్యవహారాలు పార్టీ ప్రతిష్టను దిగజార్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో నేను పోటీ నుంచి విరమించుకోవాలని నిర్ణయించుకుంటున్నాను అంటూ పార్టీ అధినేత కేసీఆర్ కి లేఖ రాసి కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు. దీంతో కావ్య స్థానంలో మరో అభ్యర్ధి కోసం గులాబీ అధిష్టానం కసరత్తు ప్రారంభించింది.

వరంగల్ పార్లమెంటు బరిలో బీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పేరును అధిష్టానం పరిశీలిస్తున్నట్టుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం మొదలైంది. పదవుల కోసం గోడ దూకే నాయకుల కంటే కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్న బాల్క సుమన్ లాంటి నాయకులకి టికెట్ ఇవ్వడం సరైన నిర్ణయం అంటూ కార్యకర్తలు ట్విట్టర్ వేదికగా హై కమాండ్ కి సూచనలు చేస్తున్నారు.

"వరంగల్ ఎంపీ అభ్యర్థిగా బాల్క సుమన్ ది బెస్ట్. నాటి నుంచీ ఉద్యమ స్ఫూర్తి, నేటిదాకా అదే అడుగు. తెలంగాణ కోసమే ఆయన ఆరాటం, కేసీఆర్ వెంటే నిబద్ధ జీవితం. పదవుల కోసం ఆరూరిలా.. కడియం కుటుంబం లా అవసరానికి గోడలు దూకలేదు. ఆపద సమయంలో అన్నం పెట్టిన చేయిని వదల్లేదు" అని బీఆర్ఎస్ అభిమాని ఒకరు ట్వీట్ చేశారు.

Tags:    

Similar News