రెబల్ ఎంఎల్ఏ రాజాసింగ్ తో బండి భేటీ
హనుమాన్ దేవాలయంలో పూజలు చేయబోతున్న కేంద్రమంత్రి తర్వాత రాజాసింగ్ తో భేటీ కాబోతున్నారు;
తెలంగాణ బీజేపీలో ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ జరగబోతోంది. పార్టీలో తిరుగుబాటు ఎంఎల్ఏగా గుర్తింపుపొందిన గోషామహల్ ఎంఎల్ఏ రాజాసింగ్(BJP MLA Raja singh) తో కేంద్రమంత్రి బండిసంజయ్ భేటీ అవబోతున్నారు. ఓల్డ్ సిటీ ఆకాశ్ పురిలోని శనివారం సాయంత్రం హనుమాన్ దేవాలయంలో పూజలు చేయబోతున్న కేంద్రమంత్రి తర్వాత రాజాసింగ్ తో భేటీ కాబోతున్నారు. రాజాసింగ్ తో కేంద్రమంత్రి భేటీ కాబోతుండటం ఆశ్చర్యంగానే ఉంది. ఎందుకంటే కొంతకాలంగా ఎంఎల్ఏ పార్టీలో తిరుగుబాటునేతగా గుర్తింపుపొందారు. అనేక అంశాలపై పార్టీనాయకత్వంపై బహిరంగంగానే ఆరోపణలు, విమర్శలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. రాజాసింగ్ ను కట్టడిచేయలేక అలాగని పార్టీనుండి బయటకు పంపలేక పార్టీ నాయకత్వం నానా అవస్తలు పడుతోంది.
హైదరాబాద్ జిల్లా స్ధానికసంస్ధల ఎంఎల్సీ ఎన్నికలో పార్టీ అభ్యర్ధిగా ఎన్ గౌతమ్ రావు పోటీచేస్తున్నారు. ఈ ఎంపిక విషయంలో కూడా ఎంఎల్ఏ డైరెక్టుగా కేంద్రమంత్రి, తెలంగాణ పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishanreddy)పై ఆరోపణలు గుప్పించారు. ఇపుడు విషయానికి వస్తే రాజాసింగ్ తో బండి(Bandi Sanjay) ఎందుకు భేటీ అవబోతున్నారన్న విషయమే ఆసక్తిగా మారింది. పార్టీకి ఎంఎల్ఏకి మధ్య సంధిచేయటం కోసమే బండి భేటీ అవబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే సంధివిషయం కాదుకాని పార్టీలో ఎంఎల్ఏని తిరిగి యాక్టివ్ చేయటంకోసమే బండి ప్రయత్నిస్తున్నట్లు మరో ప్రచారం జరుగుతోంది.
విషయం ఏదైనా పార్టీలో కీలకనేతయిన బండి తిరుగుబాటు ఎంఎల్ఏతో భేటీ అవుతుండటమే పార్టీలో పెద్ద సంచలనంగా మారింది. ఎందుకంటే పార్టీలోని కీలకనేతల్లో ఎవరూ రాజాసింగ్ తో టచ్ లో లేరు. ఎంఎల్ఏ వైఖరితో పార్టీ నాయకత్వంకు తలనొప్పులు పెరుగుతున్న నేపధ్యంలో సీనియర్ నేతలంతా దూరంగానే ఉంటున్నారు. ఈ నేపధ్యంలోనే బండి ఎందుకు ఎంఎల్ఏతో భేటీ అవ్వాలని అనుకుంటున్నారనే విషయమై పార్టీలో చర్చలు పెరిగిపోతున్నాయి.