బీఆర్ఎస్‌కు బండి మాస్ వార్నింగ్.. కార్లు కూడా తిరగనివ్వమంటూ..
ఏబీఎన్‌కు మద్దతుగా నిలిచిన బండి సంజయ్. దాడులు చేసే ముందు మీకూ ఛానెల్ ఉందని గుర్తుంచుకోవాలే.;
శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్లు ఉన్న ఏబీఎన్, బండి సంజయ్ మధ్య సంబంధం. ‘తెలంగాణ బీఆర్ఎస్ జాగిరా’ అన్న శీర్షికతో ఏబీఎన్ ఓనర్ ఎన్ రాధాకృష్ణ రాసిన కథనం ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలన రేకెత్తిస్తోంది. ఇదే విషయంలో బీఆర్ఎస్ శ్రేణులు అగ్గిమీద గుగ్గిలంలా మారాయి. ఏబీఎన్ అన్నా, రాధాకృష్ణా అన్నా సరే ఆగ్రహంతో ఊగిపోతున్నాయి. అసలు తెలంగాణ, ఆంధ్ర విడిపోయి పదేళ్లు అవుతున్నా ఇంకా సంస్థ పేరు ఎందుకు మార్చలేదని కూడా నిలదీస్తున్నారు. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇదే ప్రశ్నను లేవనెత్తారు. ఆంధ్ర నేతలకు తొత్తులుగా పనిచేసే వారి పత్రికలను తెలంగాణ వాసులు ఎందుకు చదవాలని కూడా ప్రశ్నించారు. అయితే తాజాగా ఏబీఎన్ సంబంధిత భవనాలపై దాడులు చేయడానికి బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమవుతున్నాయన్న వార్తలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రమంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ కుమార్.. ఏబీఎన్‌కు మద్దతుగా నిలిచారు. రాధాకృష్ణ రాసిన దాంట్లో తప్పేముందన్నారు. తెలంగాణ కేసీఆర్ జాగిరా? అని ఆయన ప్రశ్నించారు. రాధాకృష్ణ సంస్థపై దాడి జరిగితే మాత్రం తాము ఊరుకోమని, బీఆర్ఎస్‌కు ఉన్న ఛానెల్‌కు చుక్కలు చూపిస్తామంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు.
తెలంగాణ అవతరణ ముందు, అవతరణ తర్వాత కేసీఆర్ కుటుంబ ఆస్తులు ఎంత? అని బండి సంజయ్ ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబానికి వేల కోట్ల రూపాయల ఆస్తులు ఎలా వచ్చాయి? ఎక్కడి నుంచి వచ్చాయి? తెలంగాణ ప్రజల సొమ్మును కొల్లగొట్టి కూడబెట్టుకుంది కాదా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ‘నా కుమారుడు కాస్ట్లీ బట్టలు వేసుకుంటే కేటీఆర్ ఓర్వలేకపోయారు. నా కుమారుడు స్థాయి కంటే కేటీఆర్‌ది తక్కువ స్థాయి. కేసీఆర్ ఉద్యమం చేయకపోయినా ఆంధ్రజ్యోతి రాసింది. కేసీఆర్ తాగి ఫామ్‌హౌస్‌లో పడుకుంటే ఉద్యమాన్ని ఆంధ్రజ్యోతి నడిపింది. అప్పుడు ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి మంచిది అయింది. ఇప్పుడు చెడ్డది అయిందా. తెలంగాణ రావాలని కేసీఆర్‌కు ఏబీఎన్ మద్దతు తెలిపింది. ఏబీఎన్ మీద దాడి చేసి చూడు నీ బీఆర్ఎస్ భవన్‌ను ఏం చేస్తామో తెలుస్తుంది’ అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేతగాని స్థాయిలో ఉందని విరుచుకుపడ్డారు కేంద్రమంత్రి. కాంగ్రెస్‌కు కేసీఆర్ కుటుంబం మీద ఎందుకు అంత ప్రేమ ఉందని నిలదీశారు. కేసీఆర్ కుటుంబాన్ని ఎందుకు అరెస్టు చేయడం లేదని బండి సంజయ్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ధ్వజమెత్తిన గులాబీ దళం
రాధాకృష్ణ రాసిన వ్యాసంపై గులాబీ దళం దండయాత్ర చేస్తోంది. రాధాకృష్ణను తరిమి కొట్టాలని డిమాండ్ చేస్తున్నాయి గులాబీ శ్రేణులు. బీఆర్ఎస్, ఆంధ్రజ్యోతి మధ్య ఎంతో కాలంగా సయోధ్య లేదు. మధ్యలో వీరు కలిసినట్లే అనిపించినప్పటికీ 2017 నుంచి మళ్ళీ ఉప్పునిప్పు అన్నట్లు మారింది వీరి మధ్య వాతావరణం. ఇప్పుడు రాధాకృష్ణ రాసిన వ్యాసం.. అగ్నికి ఆజ్యం పోసినట్లు మారింది. బీఆర్ఎస్ శ్రేణులు ఆయనపై ధ్వజమెత్తుతున్నారు. అందులో ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఉన్నారు.. ఆంధ్రజ్యోతి పేరులో ఆంధ్ర అనే పదాన్ని మార్చుకోకుండా తెలంగాణలో ఎలా వార్తలను ప్రచురిస్తారని ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ఎక్స్(ట్విట్టర్) వేదికగా ఓ పోస్ట్ పెట్టారు.
‘‘తెలంగాణ వచ్చిన తరువాత కూడా ‘ఆంధ్ర జ్యోతి’ దినపత్రిక ‘తెలంగాణ జ్యోతి’ గా పేరు మార్చుకోకుండా తెలంగాణ లో ఇంకా సర్కులేట్ ఐతనే ఉన్నది! తెలంగాణ ప్రజల కష్టార్జితం అడ్వర్టైజ్మెంట్ల రూపంలో దోపిడికి గురైతూనే ఉన్నది. విశాలాంధ్ర మన తెలంగాణ గా, ప్రజాశక్తి నవ తెలంగాణ గా తొలినాళ్లలో నే పేరు మార్చుకున్నట్లున్నది. ఇట్లా పేరు మార్చుకోకుండా వలసవాద భావాలను బలవంతంగా ప్రజలపై రుద్ది, ఆంధ్ర పాలకుల తొత్తులకు దన్నుగా నిలిచే ఆంధ్ర మూలాలున్న దిన పత్రిక/టీవీ చానల్లను తెలంగాణ ప్రజలు ఎందుకు చదవాలి/చూడాలి?? ఒక్కసారి ఆలోచించండి’’ అని ఆయన పోస్ట్ పెట్టారు.