Bengal Labor in Telangana|తెలంగాణ రైతును ఆదుకుంటున్న బెంగాల్ వలస కూలీ

ఇతరరంగాల్లాగే వ్యవసాయరంగంలో కూడా తెలంగాణాపై ఉత్తరాధిరాష్ట్రాల ప్రభావం పెరిగిపోతోంది. వ్యవసాయరంగంలో ముఖ్యంగా వలసకూలీల ప్రభావం ఏటికేడు పెరిగిపోతోంది.;

Update: 2024-12-31 09:58 GMT
Bengal labor in Telangana

తెలంగాణా వ్యవసాయరంగంలో వలసకూలీల ప్రభావం పెరిగిపోతోంది. ఉత్తర, ధక్షిణాది రాష్ట్రాలకు హైదరాబాద్ హబ్ గా ఉన్న విషయం తెలిసిందే. ఈ కారణంగానే ఉత్తరాధి నుండేకాక ధక్షిణాది రాష్ట్రాల నుండికూడా ఉద్యోగ, వ్యాపార, వృత్తుల్లో రాణించేందుకు చాలామంది హైదరాబాద్(Hyderabad) వస్తున్నారు. ధక్షిణాది రాష్ట్రాల వాళ్ళలో చాలామందికి ఉత్తరాధికి వెళ్ళటానికి ప్రధాన అడ్డంకి భాష. ఉత్తరాధినుండి ధక్షిణాది రాష్ట్రాలకు రావటానికి కూడా ఇదే సమస్య ప్రధాన అడ్డంకి. అయితే పై రెండు ప్రాంతాలవాళ్ళు హైదరాబాద్ రావటానికి ఎలాంటి అడ్డంకులు లేదు. ఎందుకంటే హైదరాబాద్ లో వాడుకభాషగా హిందీ, తెలుగు సమానంగా ఉంటుంది.


అందుకనే ఇతరరాష్ట్రాలవాళ్ళు హైదరాబాద్ కు రావాలంటే హ్యాపీగా వచ్చేస్తారు. ఇపుడు విషయంఏమిటంటే ఇతరరంగాల్లాగే వ్యవసాయరంగంలో కూడా తెలంగాణాపై ఉత్తరాధిరాష్ట్రాల ప్రభావం పెరిగిపోతోంది. వ్యవసాయరంగంలో ముఖ్యంగా వలసకూలీల ప్రభావం ఏటికేడు పెరిగిపోతోంది. తెలంగాణాలో వరినాట్ల సీజన్లో కూలీలుగా పనిచేయటానికి పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, ఒడిస్సా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలనుండి ఎక్కువమందివస్తున్నారు. వలసకూలీల్లో ఎక్కువగా వరినాట్లు వేయటానికి మాత్రమే వస్తున్నారు. తెలంగాణలోని నల్గొండ, కరీంనగర్, పెద్దపల్లి, ఆదిలాబాద్, జగిత్యాల జిల్లాల్లో వలసకూలీల ప్రభావం పెరిగిపోతోంది. ప్రతి ఏడాది డిసెంబర్ 15వ తేదీనుండి జనవరి 15వ తేదీ మధ్యలో వరినాట్లు వేయటానికి తెలంగాణా వ్యాప్తంగా వరిపొలాల్లో కూలీలు చాలా అవసరం అవుతారు.


ఒకేనెలలో వరినాట్లు వేయాలి కాబట్టి కూలీలకు ఫుల్లుగా డిమాండ్ ఉంటుంది. దాని అవకాశంగా తీసుకుని వరినాట్లు వేసే కూలీలు ఎప్పటికప్పుడు తమ డిమాండును పెంచేసుకుంటున్నారు. అడిగినంత డబ్బులుఇస్తేనే తాము పొలాల్లోకి దిగుతామని కూలీలు బెట్టుచేస్తుంటారు. దాంతో రైతులకు కూలీలు అడిగినంత డబ్బులు ఇచ్చుకోక తప్పటంలేదు. పోనీ అడిగినంత కూలీఇచ్చినా ప్రతిరోజు పనిచేస్తారా అంటే అదీలేదు. ఏదో కారణంగా తరచూ మానేస్తుంటారు. కూలీలు పనికిరాకుండా మానేసిన రోజుల్లో రైతుల బాధ వర్ణనాతీతమనే చెప్పాలి. అప్పటికప్పుడు వేరేకూలీలను వెతుక్కుని పనిలోకి తీసుకురావాలంటే అంతకముందు కూలీలకు ఇచ్చిన డబ్బులకన్నా మరింత ఎక్కువ ఇచ్చుకోవాల్సిందే తప్ప వేరేదారిలేదు. ఒకవేళ ఎక్కువకూలీ ఇచ్చుకోవటానికి రైతుల దగ్గర డబ్బులు లేవని అనుకుంటే వరినారంతా చెడిపోవటమే కాకుండా పనిదినాలు కూడా వృధా అయిపోవటం ఖాయం. ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న రైతుల సంఖ్య ప్రతి ఏడాది పెరిగిపోతోంది.



 ఇలాంటి సమస్యలన్నింటినీ దృష్టిలో ఉంచుకునే కొందరు ఉత్తరాధి రాష్ట్రాలకు చెందిన కూలీలను రంగంలోకిదింపారు. ఉత్తరాధి రాష్ట్రాలనుండి వచ్చిన కూలీలతో రైతులకు మూడురకాల లాభాలున్నాయి. అవేమిటంటే మొదటిది తక్కువ కూలీకే పనిచేస్తారు. రెండోది, వరినాట్లు వేయటానికి వచ్చారు కాబట్టి ప్రతిరోజు పొల్లాల్లోకి పొద్దునే దిగేస్తారు. మూడోది, ఎక్కడినుండో వచ్చారు కాబట్టి పనెగొట్టేది ఉండదు. ఒకవేళ వచ్చిన వాళ్ళల్లో ఎవరైనా అనారోగ్యంపాలైతే సదరు వ్యక్తి పనిని తోటికూలీలు పంచుకుని పనిఆగకుండా పూర్తిచేసేస్తారు. భాష సమస్య లేకపోవటంతో బెంగాల్ నుండి తెలంగాణా జిల్లాల్లో పనిచేయటానికి ఉత్సాహంగా వలసకూలీలు వస్తున్నారు. ఉత్తరాధి రాష్ట్రాల్లో ఏ రాష్ట్రభాష ఆ రాష్ట్రంలో ఉన్నా కామన్ లాంగ్వేజ్ గా హిందీనే(Hindi Language) చెలామణి అవుతుంటుంది. అలాగే ఎలాంటి పేచీలు లేకుండా కూలీలు పనిపూర్తి చేసేస్తారు కాబట్టి ఏరోజు కూలీ ఆరోజు దక్కుతుంది. ఇదే సమయంలో రైతులకు కూడా నెలరోజుల్లోనే పని పూర్తయిపోతుంది. కాబట్టి అటు వలసకూలీలు, ఇటు రైతులు ఇద్దరూ హ్యాపీయే. వలసకూలీలకు డిమాండ్ ఎంతగా పెరిగిపోతోందంటే బయటరాష్ట్రాల నుండి కూలీలను సప్లైచేయటానికి ప్రత్యేకంగా ఏజెన్సీలు పెరిగిపోయేంతగా.

నాలుగేళ్ళుగా బెంగాల్ కూలీలే పనిచేస్తున్నారు



ఇదే విషయమై కసిరెడ్డి మల్లారెడ్డి అనే రైతు కమ్ ఏజెంట్ ‘ది తెలంగాణా ఫెడరల్’ తో మాట్లాడుతు ‘తెలంగాణాకు వలసకూలీల రాక నాలుగేళ్ళుగా పెరుగుతోంద’ని చెప్పారు. ‘ప్రతిఏడాది పశ్చిమబెంగాల్ నుండి తాను 45 బ్యాచులను రెండుసార్లు తెప్పిస్తున్న’ట్లు చెప్పారు. ప్రతిబ్యాచ్ లో 14 మంది కూలీలుంటారన్నారు. ‘బెంగాల్(West Bengal) నుండి వస్తున్న కూలీలు అచ్చంగా వరినాట్లు(Paddy Fields) మాత్రమే వేస్తార’ని చెప్పారు. ‘తెలంగాణాలో వరినాట్లు వేసే కూలీలసంఖ్య తగ్గిపోవటంతో పాటు వేసేవారు సక్రమంగా పనిలోకి రావటంలేద’న్నారు. ‘వచ్చిన కూలీలు కూడా చాలా ఎక్కువ డబ్బులు డిమాండ్ చేస్తార’ని అన్నారు. ‘స్ధానికంగా ఉండే కూలీలు ఎకరాపొలంలో వరినాట్లు వేయటానికి రోజుకు రు. 6-7 వేల మధ్యలో డిమాండ్ చేస్తున్న’ట్లు చెప్పారు. ‘వలసకూలీల్లో బ్యాచ్ కు ఎకరాకు రు. 3500 ఇస్తే సరిపోతుంద’న్నారు. రోజుకు ఒక ఎకరంలో వలసకూలీలు వరినాట్లు వేసేస్తారని చెప్పారు. ‘ఒకరైతు పొలంలో పనియిపోగానే మరో రైతు పొలంలోకి వలసకూలీలు దిగేస్తార’ని మల్లారెడ్డి చెప్పారు. ‘బెంగాల్ నుండి వచ్చేది వరినాట్లు వేయటానికే కాబట్టి ఎంత ఎక్కువమంది రైతులకు పనిచేశామా ? డబ్బులు తీసుకున్నామా ? అన్నట్లుగా వలసకూలీలుంటార’ని కసిరెడ్డి చెప్పారు.



 ‘ఎక్కడినుండో వస్తారుకాబట్టి వచ్చినపని మీదే పూర్తిదృష్టిపెడతారని, తెలంగాణాలో సీజన్ అయిపోగానే ఏపీలోని నెల్లూరు, శ్రీకాకుళం, కృష్ణా జిల్లాల ప్రాంతాలకు వెళిపోతార’ని చెప్పారు. ‘తాను గడచిన నాలుగేళ్ళుగా బెంగాల్ నుండి వలసకూలీలను తీసుకొచ్చి తెలంగాణాలోని వివిధ జిల్లాల్లో పనికి పెడుతున్న’ట్లు మల్లారెడ్డి చెప్పారు. ‘నాలుగేళ్ళ క్రితం మొక్కలకొనుగోలు కోసం రాజమండ్రి(Rajahmundry) ప్రాంతానికి వెళ్ళినపుడు అక్కడ బెంగాల్ నుండి వచ్చిన వలసకూలీలను చూశా’నన్నారు. వాళ్ళతో మాట్లాడినపుడు ‘బెంగాల్ లో వరినాట్లు వేసేవాళ్ళు ఉన్న’ట్లు తెలిసిందన్నారు. నల్గొండ జిల్లాలో తనతో పాటు మరికొందరు రైతులు అప్పటికే వరినాట్లు వేసే విషయంలో స్ధానికకూలీలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. అదే విషయాన్ని రాజమండ్రిలో పనిచేస్తున్న వలసకూలీలతో ప్రస్తావించినపుడు వాళ్ళు బెంగాల్ లో వరినాట్లు వేసే కూలీలను సరఫరాచేసే మేస్త్రీల(ఏజెంట్ల)తో మాట్లాడించారన్నారు. అప్పుడు నల్గొండలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను చెప్పి బెంగాల్ నుండి వరినాట్లు వేయటానికే వలసకూలీలను తెప్పించినట్లు చెప్పారు.



 ‘ముందు తనపొలంలో వరినాట్లు వేయించటానికి వలసకూలీలను పిలిపించినా ఇతర రైతుల సమస్యలు కూడా తనకు తెలుసుకాబట్టి తనపొలంలో పని అయిపోగానే ఇతరుల పొలాల్లో పనిచేసేట్లు మాట్లా’డానని అన్నారు. అప్పటినుండి తాను కూడా ఏజెంటుగా మారిపోయినట్లు చెప్పారు. అప్పటినుండి ప్రతి ఏడాది బెంగాల్ నుండి తాను 45 బ్యాచ్ లను తెప్పిస్తున్నట్లు మల్లారెడ్డి చెప్పారు. ‘తనతో పాటు తెలంగాణాలోని మరికొందరు ఏజెంట్లు కూడా బెంగాల్ నుండి బ్యాచ్ లను తెప్పిస్తున్నార’ని చెప్పారు. ‘మొత్తంమీద 100 బ్యాచులు వరినాట్లకు బెంగాల్ నుండి ప్రతి సీజన్లో వలసకూలీలు వస్తున్న’ట్లు చెప్పారు. తాను తెప్పిస్తున్న బ్యాచుల్లో రోజుకు సమారు 20 గ్రామాల్లో పనిచేస్తున్నారని అన్నారు. ‘బెంగాల్లో వ్యవసాయపనులు లేకపోవటంతో పాటు ఇతర రంగాల్లో కూడా ఉద్యోగాల కొరత ఎక్కువగా ఉంద’న్నారు. ‘అందుకనే ఏడాదిలో కనీసం రెండునెలలైనా పనులుంటాయని, కూలీడబ్బులు దక్కుతాయనే తెలంగాణాకు వస్తున్న’ట్లు చెప్పారు. ‘తెలంగాణాలో పనులు అయిపోగానే తన బ్యాచులను ఏపీలోని అవసరమైన జిల్లాలకు పంపుతా’నన్నారు.


‘వలసకూలీల రాకవల్ల వాళ్ళకి కూలీడబ్బులు దక్కటమే కాకుండా తమకు వరినాట్ల సమస్యలుకూడా తొలగిపోయి’నట్లు మల్లారెడ్డి చెప్పారు. వలసకూలీలను తెప్పించటంలో స్ధానికుల నుండి తనకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదన్నారు. ఎందుకంటే ‘ఇక్కడ వరినాట్లు వేసే కూలీలతో పాటు రైతుకూలీల సంఖ్య కూడా తగ్గిపోతోంద’న్నారు. కారణం ఏమిటంటే ‘కూలీల పిల్లలు చదువులు, ఉద్యోగాలపై దృష్టిపెడుతుండటంతో పొలాల్లో పనిచేసేవారి సంఖ్య తగ్గిపోతోంద’న్నారు. ‘పనిచేయగలిగిన వాళ్ళ సంఖ్య తగ్గిపోతోంది కాబట్టే రైతుల అవసరాలను చూసుకుని డబ్బులు బాగాఎక్కువ డిమాండ్ చేస్తున్నార’న్నారు. డిమాండ్ చేసినంత డబ్బులు ఇవ్వటానికి రైతులు అంగీకరించినా ఒప్పుకున్నట్లుగా పనిచేయటం అనుమానమే అన్నారు. ‘స్ధానికులు కాబట్టి ఏదోకారణంతో పనిమానేసినా అడిగేందుకు లేద’న్నారు. ‘అందుకనే వీళ్ళతో పడలేక బెంగాల్ నుండి వలసకూలీలను తెప్పిస్తున్న’ట్లు కసిరెడ్డి మల్లారెడ్డి చెప్పారు. మల్లారెడ్డి చెప్పింది చూస్తుంటే తొందరలో వరినాట్లకు సీజన్లో తెలంగాణలో వలసకూలీలే దక్కయ్యేట్లున్నారు.

Tags:    

Similar News