తెలంగాణ బిడ్డ సుదర్శన్ రెడ్డికి బిఆర్ఎస్ మద్దతిచ్చేనా?
తెలంగాణ ఉద్యమంలోచురుకైన పాత్ర పోషించిన వ్యక్తిగా పేరు;
తెలంగాణ వాదంతో అధికారంలో వచ్చిన బిఆర్ఎస్ (అప్పటిఆర్ఎస్) పార్టీకి పెద్ద చిక్కే వచ్చింది. ఎన్డీఏ కూటమిలో అనధికారికంగా మిత్ర పక్ష పార్టీగా కొనసాగుతున్న బిఆర్ఎస్ బాల్ క్రిష్ణ సుదర్శన్ రెడ్డికి సపోర్ట్ చేసే అవకాశం ఉందా? 17 వ ఉపరాష్ట్ర పతి పదవికి ఇండియా కూటమి అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో బిఆర్ఎస్ డైలమాలో పడిపోయింది. తెలంగాణ బిడ్డకు సపోర్టు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుగు రాష్ట్రాల్లోని అన్ని రాజకీయ పార్టీలకు వినతి చేశారు. తెలంగాణకు చెందిన జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి రంగారెడ్డి జిల్లాలోని ఆకుల మైలారం గ్రామంలో రైతు కుటుంబంలో జన్మించారు. ఆయన విద్యాభ్యాసం కూడా తెలంగాణలోనే కొనసాగింది ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి న్యాయవాద పట్టాపుచ్చుకుని హైదరాబాద్ లోని సీనియర్ న్యాయవాది కె. ప్రతాప్ రెడ్డి వద్ద ప్రాక్టీస్ ప్రారంభించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రభుత్వ ప్రాసిక్యూటర్ గా కొనసాగారు. ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయమూర్తిగా పని చేశారు. అక్కడ్నించి ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయ్యారు. సుదర్శన్ రెడ్డి ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బరిలో దిగారు. ప్రధాని పీవీ నరసింహారావు తర్వాత ఒక తెలంగాణ వాసి దేశ అత్యున్నత పదవులలో ఒకటైన ఉపరాష్ట్ర పతి పదవికి పోటీ చేస్తున్నారు.
సుదర్శన్ రెడ్డిని ఒప్పించడంలో రేవంత్ రెడ్డి కీలకం
ఇంతకు మునుపు తెలంగాణ వాసికి ఇటువంటి అరుదైన అవకాశం దక్కలేదు. సుదర్శన్ రెడ్డిని ఉపరాష్ట్రపతి పదవికి ఒప్పించడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించినట్లు ప్రచారంలో ఉంది. తెలంగాణలో బిఆర్ఎస్ ప్రధాన ప్రతి పక్ష పార్టీ. అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన రేవంత్ రెడ్డి సుదర్శన్ రెడ్డి చేత నామినేషన్ వేయించడానికి ఢిల్లీ వెళ్లనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిఫారసు చేసిన అభ్యర్థి సుదర్శన్ రెడ్డి కావడంతో బిఆర్ఎస్ ఆత్మ రక్షణలో పడిపోయింది. సుదర్శన్ రెడ్డికి సపోర్ చేయకపోతే బిఆర్ఎస్ తెలంగాణ వాదాన్ని బలపరచలేదన్న సంకేతాలు ప్రజల్లో వెళ్లే అవకాశం ఉంది. ఇప్పటికే బిఆర్ఎస్ ప్రాబల్యం పడిపోయి ఆ పార్టీ తెలంగాణలో అధికారాన్ని కోల్పోయింది. ఆ పార్టీని పదేళ్లు అధికారంలో నిలబెట్టింది కేవలం తెలంగాణ వాదం మాత్రమే. ఉప ఎన్నికలు వచ్చినప్పుడల్లా బిఆర్ఎస్ గెలుపొందడానికి తెలంగాణ వాదం దోహదపడింది.ఈ బలంతోనే ఆ పార్టీ ముందస్తు ఎన్నికలకు వెళ్లింది. తెలంగాణ అస్థి త్వానికి ప్రతీకగా నిల్చిన తెలంగాణ రాష్ట్ర సమితిలో తెలంగాణ అనే పదం లేకుండా భారత రాష్ట్ర సమితి పేరిట అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలబడి ఓడిపోయింది.
ఉట్టి కెగరలేనమ్మ ఆకాశానికి ఎగిరింది అన్నట్టు బిఆర్ఎస్ మహరాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయింది.
బిఆర్ఎస్ నాయకత్వం ఈ కఠోర వాస్తవాన్ని గుర్తించి బిఆర్ఎస్ పేరుకు సమాధి పెట్టి తెలంగాణ రాష్ట్ర సమితి పేరిట పూర్వ వైభవాన్ని తెచ్చుకోవాలనుకుని ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారంలో ఉంది. ఉపరాష్ట్ర పతి పదవి బిఆర్ఎస్ కు అంది వచ్చిన అవకాశమే అయినప్పటికీ ఆ అవకాశాన్ని జారవిడుచుకోవడానికి బిఆర్ఎస్ సిద్దమైనట్లు తెలుస్తోంది. ఎందుకంటే సుదర్శన్ రెడ్డికి సపోర్ట్ చేస్తే కాంగ్రెస్ కు సపోర్ట్ చేసినట్లు సంకేతాలు వెళతాయన్నది బిఆర్ఎస్ భయం.
బిఆర్ఎస్ తటస్థం: రాజకీయ విశ్లేషకుడు పి. మోహన్ రావు
‘‘సుదర్శన్ రెడ్డిని వ్యతిరేకించి బీజేపీ నేత, తమిళనాడు సీనియర్ రాజకీయ నాయకుడు సిపి రాధాకృష్ణన్‌ను సపోర్ట్ చేస్తే తెలంగాణ వాదాన్ని కెసీఆర్ మరోసారి సమాధి చేసినట్టే’’ అని రాజకీయ విశ్లేషకుడు, రిటైర్డ్ ప్రొఫెసర్ పులకంటి మోహన్ రావు అన్నారు. ‘‘ఉప రాష్ట్ర పతి ఎన్నికలకు తటస్థంగా ఉండాలని బిఆర్ఎస్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. బిజెపి, కాంగ్రెస్ లకు దూరంగా ఉండాలని బిఆర్ఎస్ నాయకత్వం ఆలోచిస్తున్నట్టు కనబడుతుంది’’ అని ఆయన అన్నారు. ‘‘లోకసభలో బిఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా లేదు. రాజ్యసభకు నలుగురు ఎంపీలు మాత్రమే ఉన్నారు. బహుశా ఎన్టీఏకు బిఆర్ఎస్ మద్దతు అవసరం ఉండకపోవచ్చు’’ అని మోహన్ రావు అన్నారు. రాధాకృష్ణన్ రెండు పర్యాయాలు బిజెపి నుంచి లోక్‌సభ ఎంపీగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన మహారాష్ట్ర గవర్నర్‌గా కొనసాగుతున్నారు. నేషనల్ పాలిటిక్స్, సంస్థాగత రంగంలో ఆయనకున్న సుదీర్ఘ అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని బీజేపీ ఆయనను అభ్యర్థిగా ఖరారు చేసింది.
ప్రతిపక్ష ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి ఎన్నికకు తన అభ్యర్థిని ప్రకటించినప్పటికీ బిఆర్ఎస్ ఇంతవరకు తన వైఖరి స్పష్టం చేయకపోవడంతో బిఆర్ఎస్ లో అంతర్మథనం ప్రారంభమైంది.
‘‘పార్టీలకతీతంగా ఆయన తెలంగాణ ఉద్యమంలోపాలుపంచుకున్నారు. ఒక తెలంగాణ ఉద్యమకారుడు ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేస్తున్నప్పటికీ బిఆర్ఎస్ తన వైఖరి స్పష్టం చేయకపోవడం శోచనీయం’’ అని సీనియర్ కాంగ్రెస్ నేత జి. నిరంజన్ వ్యాఖ్యానించారు.
పార్టీ అధిష్టానం అనుమతిస్తే కెసీఆర్ ను కలుస్తా: రేవంత్ రెడ్డి
‘‘రెండు రాష్ట్రాల 60 ఓట్లు ఆయనకే వేయాలి.పార్టీలు వేరైనా నాడు పీవీ విషయంలో ఎన్టీఆర్ చూపిన చొరవను స్ఫూర్తిగా తీసుకోవాలి’’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సుదర్శన్‌రెడ్డి గెలిస్తే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కులగణన సర్వే అధ్యయనానికి నిపుణుల కమిటీ చైర్మన్‌గా సేవలందించారు.పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే సుదర్శన్‌రెడ్డికి మద్దతు కోసం కేసీఆర్‌ను కలుస్తానని రేవంత్ రెడ్డి అన్నారు
ఆయన నా ముఖం చూస్తాడో లేడో అనిమీడియాతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సెటైరికల్ గా వ్యాఖ్యానించారు.
ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు తర్వాత ఒక తెలుగు వ్యక్తి ఈ పదవికి పోటీ చేస్తుండటంతో తెలుగు రాష్ట్రాల్లో సుదర్శన్ రెడ్డి పోటీ ప్రతిష్టాత్మకంగా మారింది.