కడియం-మందకృష్ణ మధ్య బిగ్ ఫైట్

చెప్పుకోవటానికి ఇద్దరు ఎస్సీలే అయినా మందకృష్ణేమో మాదిగల అభివృద్ధికోసం పోరాటాలు చేస్తుంటారు. కడియం ఏమో మాల సామాజికవర్గానికి చెందిన నేత.

Update: 2024-04-26 10:32 GMT
Kdiyam Srihari and Manda Krishna Madiga

ఇద్దరు ఎస్సీ లీడర్ల మధ్య ఫైట్ ముదిరిపోతోంది. వీళ్ళిద్దరి మధ్య వైరం ఈనాటిది కాదని అందరికీ తెలిసిందే. ఇంతకీ ఆ ఇద్దరు ఎవరంటే ఒకరేమో మాజీమంత్రి, సీనియర్ నేత కడియం శ్రీహరి అయితే మరొకరేమో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎంఆర్పీఎస్) వ్యవస్ధాపక అధ్యక్షుడు మందా కృష్ణమాదిగ. చెప్పుకోవటానికి ఇద్దరు ఎస్సీలే అయినా మందకృష్ణేమో మాదిగల అభివృద్ధికోసం పోరాటాలు చేస్తుంటారు. కడియం ఏమో మాల సామాజికవర్గానికి చెందిన నేత. బైండ్ల ఉపకులం కూడా మాదిగ పరిధిలోకే వస్తుందని కడియం చెప్పుకుంటున్నా దాన్ని మందకృష్ణతో పాటు చాలామంది మాదిగ నేతలు అంగీకరించటంలేదు.

హోలుమొత్తంమీద ఇపుడు సమస్య ఏమిటంటే కడియం బీఆర్ఎస్ లో నుండి కాంగ్రెస్ లోకి ఫిరాయించారు. వరంగల్ ఎంపీగా శ్రీహరి కూతురు కడియం కావ్యకు బీఆర్ఎస్ అధినేత టికెట్ ఇచ్చారు. అయితే బీఆర్ఎస్ టికెట్ వద్దనుకున్న తండ్రి, కూతుళ్ళు కాంగ్రెస్ లో చేరారు. ఇపుడు కావ్య హస్తం పార్టీ అభ్యర్ధిగా పోటీచేస్తున్నారు. ఎప్పుడైతే కడియం తన కూతురుతో బీఆర్ఎస్ ను వదిలేశారో అప్పటినుండే ఆయనపై ఆర్ధికపరమైన ఆరోపణలు కూడా మొదలయ్యాయి. టికెట్ తో పాటు బీఆర్ఎస్ అధినేత కడియం కావ్యకు పదికోట్ల రూపాయలు కూడా ఇచ్చారనేది ఒక ఆరోపణ. ఇంతపెద్దమొత్తంలో డబ్బులు ఇచ్చారనేందుకు ఆధారాలు లేవు. అయితే ప్రచారమైతే విపరీతంగా జరిగిపోతోంది. ఈమధ్యనే ఒక ఛానల్లో కేసీయార్ ఇదే విషయమై మాట్లాడుతు ‘డబ్బులిచ్చిపుచ్చుకునేది ఏ రాజకీయ నాయకుడైనా బహిరంగంగా చెబుతారా’ ? అన్నారు. డబ్బులిస్తే చెప్పాల్సిన అవసరంలేదు కాని ఇవ్వకపోతే ఆ విషయాన్ని కేసీయార్ కన్ఫర్మ్ చేయచ్చు. కాని కేసీయార్ తెలివిగా కడియంపై ఆరోపణలు పెరగటానికి కావాలనే పై విధంగా మాట్లాడారు. ఇదే విషయాన్ని ఇపుడు మందకృష్ణ పట్టుకున్నారు. కడియం బీఆర్ఎస్ దగ్గర డబ్బులు తీసుకోవటమే కాకుండా పోటీపేరుతో కాంగ్రెస్ లో కూడా భారీగా డబ్బులు తీసుకున్నారని ఆరోపించారు. రెండుపార్టీల్లోను కడియం రు. 100 కోట్లు తీసుకున్నట్లు మందకృష్ణ రెచ్చిపోతున్నారు. కడియం రు. 100 కోట్లు తీసుకున్నారనేందుకు మందకృష్ణ దగ్గరున్న ఆధారాలు ఏమిటో తెలీదు.

ఇదే విషయమై కడియం మాట్లాడుతు తాను కేసీయార్ దగ్గర నుండి ఒక్కరూపాయి కూడా తీసుకోలేదని చెప్పారు. తాను రు. 10 కోట్లు తీసుకున్నట్లు ఆధారాలుంటే నిరూపించాలని సవాలు కూడా చేశారు. డబ్బులు తీసుకున్నట్లు సాక్ష్యాధారాలు చూపిస్తే తన ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేయటంతో పాటు తన కూతురును పోటీలో నుండి విత్ డ్రా చేయిస్తానని ఓపెన్ ఆఫర్ కూడా ఇచ్చారు. అయినా సరే ఆరోపణలు ఆగకపోగా మరింత పెరుగుతున్నాయి. బీజేపీకి మద్దతుగా నిలిచిన మందకృష్ణకు కడియంతో ఉన్న పాత పంచాయితీని ఎన్నికల సమయంలో తీర్చుకోవటానికి ప్రయత్నిస్తున్నట్లు అనుమానంగా ఉంది.

ఇదే విషయమై కాంగ్రెస్ సీనియర్ నేత మాదిగ సామాజికవర్గంలో ప్రముఖనేత గజ్జల కాంతం ‘తెలంగాణా ఫెడరల్’ తో మాట్లాడుతు వంద కోట్ల రూపాయలు ఎవరికీ ఇచ్చే పరిస్ధితి లేదన్నారు. ‘కాంగ్రెస్ అభ్యర్ధులంతా ఎవరి ఖర్చులు వాళ్ళే పెట్టుకోవాలన్నా’రు. బీఆర్ఎస్ నుండి కడియం డబ్బులు తీసుకున్నది లేనిది తమకు తెలీదన్నారు. ’తమ ఎంఎల్ఏలు, ఇద్దరు మంత్రులు పార్టీ నేతలు, క్యాడరే కడియం కావ్యను గెలిపించాలని రేవంత్ రెడ్డి చెప్పారన్నా‘రు. మందకృష్ణ బీజేపీ మాయలో పడి మాట్లాడుతున్నట్లు ఆరోపించారు.

ఎస్సీల వర్గీకరణ పేరుచెప్పి మందకృష్ణ 2017, 2023లో సభపెట్టినప్పటినుండి ఇప్పటివరకు బీజేపీ ఎందుకని కేంద్రప్రభుత్వం వర్గీకరణ చేయలేదో కృష్ణమాదిగ సమాధానం చెప్పాలని నిలదీశారు. ఎస్సీ వర్గీకరణ చేయాలని అనుకుంటే మోడి ఎప్పుడో చేసుండే వారని గజ్జెల కాంతం స్పష్టంచేశారు. మాదిగల ఓట్లు బీజేపీకి వేయించేందుకు, సభల నిర్వహణకు మందకృష్ణకు ప్రధానమంత్రి రు. 200 కోట్లు ఇచ్చినట్లు ఆరోపణలు వినబడుతున్నాయన్నారు. అలాగే వరంగల్ బీజేపీ అభ్యర్ధి ఆరూరి రమేష్ నుండి కూడా మందకృష్ణ భారీగా డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు వినబడుతున్నాయన్న విషయాన్ని గజ్జెల కాంతం ప్రస్తావించారు.

Tags:    

Similar News