Harish Rao | ‘పాలించడం అబద్ధాలు ఆడినంత ఈజీ కాదు రేవంత్’
ఆధార్ కార్డులు, పాస్ బుక్కులు, చెప్పులు క్యూలైన్లలో పెట్టడం అబద్దమా? అని ప్రశ్నించిన హరీష్ రావు.;
కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి పాలనపై మాజీమంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని పాలించడం అంటే అబద్ధపు, అమలుకు వీలుకాని వాగ్దాలు ఇచ్చినంత ఈజీ కాదు రేవంత్ అంటూ హరీష్ విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా రాష్ట్రంలో రైతులను అతలాకుతలం చేస్తున్న యూరియా కొరతపై బీజేపీ, కాంగ్రెస్‌లు హైడ్రామాలు ఆడుతున్నాయని మండిపడ్డారు. యూరియా కొరత తీర్చడంపై దృష్టి పెట్టడం మానేసి, తమ తప్పు లేదన్నట్లు చేతులు దులుపుకోవడంపైన ఫోకస్ పెట్టారంటూ ఎద్దేవా చేశారు.
ఈ విషయంలో కాంగ్రెస్, బీజేపీ తీరు సిగ్గుచేన్నారు. ‘దేశంలో యూరియా కొరత లేదని ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం కేంద్రం ఇవ్వడం లేదంటున్నారు. వీరద్దరిలో ఎవరు నిజం? ఎవరు అబద్దం? ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వమా? లేక రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వమా’ అని హరీశ్ రావు నిలదీశారు.
‘‘ఒకవైపు యూరియా కొరతతో రాష్ట్ర రైతాంగం అల్లకల్లోలం అవుతుంటే అధికార పక్షం దాన్ని ప్రతిపక్షాల దుష్పచారంగా చెప్పడం సిగ్గుచేటు. కాంగ్రెస్ ప్రభుత్వం తీరు దొంగే.. దొంగ దొంగ అన్నట్లుంది. కుండపోత వానలో తడుస్తూ రైతులు గంటల కొద్దీ నిలబడటం అబద్దమా? ఆధార్ కార్డులు, పాస్ బుక్కులు, చెప్పులు క్యూలైన్లలో పెట్టడం అబద్దమా? యూరియా బస్తాలు ఇవ్వాలంటూ రైతన్నలు అధికారుల కాళ్లు పట్టుకొని వేడుకున్నది అబద్దమా? దేశానికి అన్నం పెట్టే రైతన్న యూరియా అడిగితే పోలీసు లాఠీలతో కొట్టించింది అబద్దమా?’’ అని ప్రశ్నించారు.
‘‘కాంగ్రెస్ ఎంపీల యూరియా పోరాటం ఫలించిందని చెప్పుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి సిగ్గనిపిస్తలేదా? కాంగ్రెస్ పార్టీ చేతగాని తనం వల్లనే కదా ఈరోజు రైతులకు ఇన్ని కష్టాలు వచ్చింది. ఈ ముఖ్యమంత్రి రేవంత్‌కి ముందు చూపు లేకపోవడం వల్లనే కదా రైతులు కన్నీళ్లు పెట్టాల్సి వస్తున్నది. తులం బంగారం ఇస్తామంటూ ప్రగల్భాలు పలికిన రేవంత్ రెడ్డి, బంగారం మాట దేవుడెరుగు యూరియానే బంగారంగా మార్చిండు గ్రామాల్లో విచ్చలవిడిగా మద్యాన్ని ఏరులైపారిస్తున్న రేవంత్ రెడ్డి, యూరియా బస్తాలను అందుబాటులో ఉంచడంలో అట్టర్ ఫ్లాప్ అయ్యిండు. బూటకపు వాగ్దానాలు చేసినంత సులువు కాదు, పరిపాలన చేయడం అంటే’’ అని చురకలంటించారు.
‘‘నమ్మి నయవంచన చేసినంత సులువు కాదు, కేసీఆర్ అందించిన రైతు సంక్షేమాన్ని కొనసాగించడం అంటే. నాటి రోజులు తెస్తామని పదే పదే చెప్పే రేవంత్ రెడ్డి..అన్నమాట నిలుపుకుంటున్నడు. మల్లా కాంగ్రెస్ దుర్మార్గ పాలన నాటి పాత రోజులను తీసుకొచ్చిండు. తొమ్మిదిన్నరేండ్ల బిఆర్ఎస్ పాలనలో రైతులకు ఏనాడూ యూరియా కొరత రాలేదు. ఏనాడూ రోడ్డెక్కాల్సిన దుస్థితి రాలేదు. యూరియా కొరతకు కారణమైన వారే ఈరోజు యూరియా పేరు చెప్పి రాజకీయ డ్రామాలు ఆడుతున్నారు.మిస్ వరల్డ్ పేరిట రెండు నెలలు పాలనను గాలికి వదిలేసిండు తప్ప, ఎరువులు, విత్తనాల గురించి సీఎం రేవంత్ రెడ్డి సమీక్షలు చేయలేదు’’ అని అన్నారు.
‘‘బాధ్యత లేదు, ప్రణాళిక లేదు, కార్యచరణ లేదు. ప్రభుత్వంలో ఉన్నాం, బాధ్యతగా ఉండాలనే సోయి కూడా లేకుండా ప్రతి వైఫల్యాన్ని బిఆర్ఎస్, కేసీఆర్ పై వేస్తూ రంకెలేయడం తప్ప 22 పాలనలో ఒరగబెట్టిందేమిటి రేవంత్ రెడ్డి? రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్లనే, ముఖ్యమంత్రి, వ్యవసాయ మంత్రి చేతగాని తనం వల్లనే రాష్ట్రానికి ఎరువుల కొరత వచ్చింది. ఈరోజు యావత్ రైతాంగాన్ని యూరియా కోసం నడి రోడ్డుపై నిలబెట్టిన దుర్మార్గ చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిది’’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
‘‘సాగు నీళ్లు ఇవ్వడంలో ఫెయిల్, పంట కొనుగోళ్లలో ఫెయిల్, 500 బోనస్ ఇవ్వడంలో ఫెయిల్, రైతు భరోసా ఇవ్వడంలో ఫెయిల్, రైతు రుణమాఫీలో ఫెయిల్, చివరకు యూరియా సరఫరా చేయడంలో ఫెయిల్.. రైతులను కన్నీళ్లు పెట్టిస్తున్న ఈ ప్రభుత్వం ఒక ఫెయిల్యూర్ ప్రభుత్వం.దేశానికి అన్నం పెట్టే రైతుల చేతులతో కాళ్లు మొక్కించుకుంటున్న ఈ ప్రభుత్వానికి తప్పకుండా ఉసురు తగులుతుంది. రైతులను కాళ్లు పట్టుకునే దుస్థితికి తెచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగంగా రైతాంగానికి క్షమాపణలు చెప్పు’’ అని డిమాండ్ చేశారు.
‘‘ప్రతిపక్షాల మీద నిందలు మాని, రైతుల యూరియా కష్టాలపై ఇప్పటికైనా దృష్టి సారించు. యూరియా, ఎరువుల కొరత పై సమీక్ష నిర్వహించి, రైతాంగానికి అవసరమైన యూరియా వెంటనే సరఫరా చేయాలని బిఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం’’ అని అన్నారు.