మంత్రి కోమటిరెడ్డి పర్యటనను అడ్డుకున్న బిజెపి
వినాయక ఉత్సవాల్లో రాజకీయాలు మాట్లాడటంపై రసాభాస;
మంత్రి కోమటిరెడ్డికి వ్యతిరేకంగా బిజెపి నిర్వహిస్తున్న కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీకి మింగుడుపడటం లేదు. కోమటిరెడ్డి టార్గెట్ గా జిల్లాలో బిజెపి రాజకీయాలు చేస్తుందని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. జిల్లాలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌజ్ ను క్యాంప్ ఆఫీసుగా మార్చడాన్ని బిజెపి ఖండిస్తూ వస్తోంది.
తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నల్గొండ పట్టణంలోని ఒకటో నంబర్ గణపతి విగ్రహం వద్ద మంత్రి కోమటిరెడ్డి శుక్రవారం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన చేసిన అభివృద్ధి గురించి మంత్రి వివరించడం ప్రారంభించారు. దేవుడి దగ్గర పాలిటిక్స్ మాట్లాడుతున్నారని భాజపా నేతలు అడ్డుకున్నారు.వేదికపై తమను ఎందుకు కూర్చోనివ్వరంటూ భాజపా జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి గొడవకు దిగారు. ఈ నేపథ్యంలో భాజపా-కాంగ్రెస్ వర్గీయుల మధ్య పెద్ద ఘర్షణ తలెత్తింది. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. నాగం వర్షిత్ రెడ్డిని పోలీసులు అక్కడి నుంచి పోలీస్ స్టేషన్‌కి తరలించారు. సంఘటనా స్థలం నుంచి మంత్రి కోమటిరెడ్డి వెళ్లిపోయారు.
గత నెలలో కూడా కోమటిరెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ప్రస్తుతం ఉన్న ఆర్ అండ్ బి గెస్ట్ హౌజ్ ను క్యాంప్ ఆఫీసుగా మార్చడాన్నిబిజెపి అడ్డుకుంది.
దశాబ్దాలుగా నల్లగొండ పట్టణం లో ఉన్న ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ను మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తన క్యాంప్ ఆఫీసుగా మార్చడం పట్ల బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి ఆక్షేపణ వ్యక్తం చేశారు. ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో మంత్రులు, రాజకీయ పార్టీల నాయకులు, అధికారులు వచ్చినప్పుడు విశ్రాంతి తీసుకునే వారని, అలాంటి గెస్ట్ హౌస్ ను క్యాంప్ ఆఫీసుగా మార్చడం వల్ల నల్లగొండకు వచ్చే అతిధులు ఎక్కడ బస చేస్తారని ఆయన ప్రశ్నించారు. క్యాంప్ ఆఫీస్ ప్రారంభ కార్యక్రమాన్ని బీజేపీ తీవ్రంగా ఖండించింది. శాంతియుతంగా నిరసన కార్యక్రమాన్ని చేపడితే జిల్లా పోలీస్ యంత్రాంగం అక్రమంగా అరెస్ట్ చేసినట్లు బిజెపి ఆరోపిస్తుంది.
మంత్రికి ప్రజా సమస్యలు పట్టడం లేదని బిజెపి నేతలు ఆరోపిస్తున్నారు. డ్రామా బ్రదర్స్ ప్రజాదరణ కోల్పోయారని, వారు ఎద్దేవా చేశారు. మంత్రిగా పనిచేస్తున్న కోమటిరెడ్డి ఇప్పటివరకు ఒక్క రాత్రి కూడా నియోజకవర్గ కేంద్రంలో బస చేయని విషయాన్ని బిజెపి నేతలు ఈ సందర్భంగా గుర్తు చేశారు. నల్లగొండ నియోజకవర్గ అభివృద్ధిపై దమ్ము ధైర్యం ఉంటే బహిరంగ చర్చకు సిద్ధపడాలని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి బిజెపి నేతలు సవాల్ విసిరారు. ఇలా కోమటిరెడ్డి బ్రదర్స్ కార్యక్రమాలను బిజెపి అడ్డుకోవడంతో అధికార కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి.