‘కవిత విషయాన్ని పెద్దగా పట్టించుకోవద్దు’
కవితను పార్టీలో చేర్చుకోవడంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామ్‌చందర్ రావు.;
బీఆర్ఎస్‌లో కొన్ని రోజులుగా వస్తున్న పరిణామాలు హాట్ టాపిక్‌గా మారాయి. పార్టీ నుంచి సస్పెన్షన్ తర్వాత సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి ఆమె రాజీనామా చేశారు. దీంతో ఆమె భవిష్యత్ కార్యాచరణ ఏంటి? అనేది కీలకంగా మారింది. ఈ క్రమంలోనే ఆమె కాంగ్రెస్, బీజేపీల్లో చేరడానికి మంతనాలు జరుపుతున్నారన్న వాదన కూడా వినిపిస్తోంది. దీంతో కవితను తమ పార్టీలో చేర్చుకోవడంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామ్‌చందర్ రావు స్పందించారు. తమ పార్టీలోకి కవితను చేర్చుకోమని తేల్చి చెప్పారు. ‘‘బీజేపీలో అవినీతి పరులకు స్థానం లేదు. కవితను మేము చేర్చుకోం. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అన్నదమ్ములు’’ అని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రాజెక్ట్ మొత్తంపై విచారణ..
అంతేకాకుండా సీబీఐ విచారణ కాళేశ్వరంలోని బ్యారేజీలపై మాత్రమే జరగకూడదని అన్నారు. మొత్తం ప్రాజెక్ట్‌పై జరగాలని, అప్పులు అన్ని విషయాలు బయటకు వస్తాయని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయని అన్నారు. అదే విధంగా కవిత గురించి ఎక్కువగా ఆలోచించొద్దని అన్నారు. కవితను సస్పెండ్ చేయడం, ఆమె రాజీనామా చేయడాన్ని అంతా కూడా వాళ్లు ఆడుతున్న పొలిటికల్ డ్రామాగా చెప్పారాయన. రాజకీయ లబ్ధి కోసం, రాజకీయ ఉనికి కోసం వారు పడుతున్న పాట్లలో ఇది కూడా ఒకటంటూ విమర్శలు చేశారు.
ప్రజలకు కేంద్రం పండగ గిఫ్ట్..
‘‘జీఎస్‌టీ తగ్గించి ప్రజలకు పండగ బహుమానాన్ని ముందుగానే ఉంచింది. మోదీ నేతృత్వంలో చారిత్రాత్మ నిర్ణయం తీసుకున్నారు. పన్నుల వ్యవస్థను సరళీకరించారు. నిత్యావరసారలపై ట్యాక్స్‌ను జీరో చేశారు. కేంద్రం నిర్ణయం మధ్యతరగతి వారికి ఎంతో ఊరటను అందించింది. వన్ నేషన్ వన్ లా వైపు కూడా వెళ్తున్నాం.. ఎల్లుండి అమిత్ షా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి వేడుకల్లో పాల్గొంటారు… అమిత్ షా పార్టీ కార్యక్రమం ఇంకా ఫైనల్ చేయలేదు. అధికారిక కార్యక్రమంతో పాటు మోజన్జాహి మార్కెట్ లో గణేష్ నిమజ్జన వేడుకల్లో పాల్గొంటారు’’ అని చెప్పారు.