గెలుపు భారమంతా శ్రీరాముడి మీదేనా ?

రొటీన్ స్పీచులు, హామీలతో పాటు బీజేపీ అభ్యర్ధి గోడం నగేష్ మరో విషయాన్ని కూడా పదేపదే ప్రస్తావిస్తున్నారు.

Update: 2024-04-05 07:01 GMT
BJP candidate Nagesh (source ; Twitter)

పోటీలో ఉన్న పార్టీలన్నీ గెలుపుపై తమకు అందుబాటులోఉన్న మార్గాలపైన దృష్టిపెడతాయి. మార్గాలు ఏమిటంటే ప్రచారం, నేతలు, క్యాడర్ ను సమన్వయం చేసుకోవటం, ఖర్చులు, ఇంటింటిప్రచారం. అసంతృప్తులను బుజ్జగించటం లాంటివి చేస్తునే ప్రత్యర్ధులపైన పార్టీలు కన్నేసుంచుతాయి. ప్రచారానికి వెళ్ళినపుడు తాము చేసిన అభివృద్ధి, అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను గుర్తుచేస్తారు. ఇదేసమయంలో అధికారంలోకి వస్తే ఏమిచేస్తామనే విషయాలను హామీలతో జనాలను కన్వీన్స్ చేయటానికి ప్రయత్నిస్తారు. రాబోయే పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలోని కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీపార్టీల అభ్యర్ధులు ఇదే పనులు చేస్తున్నారు. అయితే రొటీన్ స్పీచులు, హామీలతో పాటు బీజేపీ అభ్యర్ధి గోడం నగేష్ మరో విషయాన్ని కూడా పదేపదే ప్రస్తావిస్తున్నారు.

అదేమిటంటే అయోధ్యలో రామాలయం నిర్మాణం గురించి. నరేంద్రమోడి గురించి మాట్లాడుతునే రామాలయం నిర్మాణాన్ని జనాలకు గుర్తుచేస్తున్నారు. బీజేపీ తరపున గొడం నగేష్, బీఆర్ఎస్ తరపున ఆత్రంసక్కు, కాంగ్రెస్ అభ్యర్ధిగా ఆత్రం సుగుణ పోటీచేస్తున్నారు. నగేష్ రాజకీయాల్లో బాగా సీనియర్. గతంలో ఒకసారి ఎంపీగా, రెండుసార్లు ఎంఎల్ఏగా, మంత్రిగా కూడా పనిచేశారు. ఆత్రం సక్కు కూడా రెండుసార్లు ఎంఎల్ఏగా పనిచేశారు. ఆత్రం సుగుణ టీచర్ గా పనిచేస్తు మొదటిసారి రాజకీయాల్లోకి ప్రవేశించి ఎంఎల్ఏగా పోటీచేస్తున్నారు. ముగ్గురు కూడా గిరిజనుల్లోని గోండు జాతికి చెందిన వారే. కాబట్టి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని 2.5 గోండు ఓట్లు ముగ్గురి మధ్య చీలటం ఖాయం. అలాగే మరో 2.5 లక్షలున్న లంబాడాల ఓట్లు కూడా కీలకమే. వీళ్ళు కాకుండా 3 లక్షలున్నా మైనారిటీలు, 1.5 లక్షలున్న ఎస్సీల ఓట్లు కూడా కీలకమనే చెప్పాలి.

ముగ్గురు గోండ్లే కాబట్టి తమ సామాజికవర్గం ఓట్లతో పాటు ఇతర సామాజికవర్గాల ఓట్లు కూడా ముగ్గురి మధ్య చీలిపోవటం ఖాయం. అందుకనే ఈ విషయాన్ని ముందుగానే గ్రహించిన గోడ నగేష్ తన ప్రచార స్టైలును మార్చేశారు. ఎలాగంటే పైన చెప్పుకున్నట్లుగా రామాలయం నిర్మాణాన్ని పదేపదే ప్రస్తావిస్తున్నారు. అయోధ్య రామాలయం నుండి ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలోని గ్రామాలకు వచ్చిన అక్షితలను ప్రధానంగా గుర్తుచేస్తున్నారు. అంటే ఓట్లకోసం నగేష్ ఎక్కువగా రామాలయ సెంటిమెంటును ప్రయోగిస్తున్నట్లు అర్ధమైపోతోంది. దానికితోడు ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ సీట్లలో నాలుగు బీజేపీ ఖాతాలో ఉండటం కూడా అభ్యర్ధికి కలిసొస్తోంది.

ముథోల్, నిర్మల్, ఆదిలాబాద్, సిర్పూర్(టి) నియోజకవర్గాలు బీజేపీ ఖాతాలోపడ్డాయి. బోథ్, అసిఫాబాద్ బీఆర్ఎస్ ఖాతాలో ఉంటే ఖానాపూర్ ఒక్కటే కాంగ్రెస్ గెలిచింది. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సిందేమిటంటే గతంలో బీజేపీకి జెండా కట్టేవాళ్ళు కాదు అసలు పార్టీ గురించే చాలామందికి తెలియదు. అలాంటిది 2019 ఎన్నికల్లో పార్లమెంటు సీటును గెలుచుకోవటమే ఆశ్చర్యమంటే మొన్నటి ఎన్నికల్లో ఏకంగా నాలుగు అసెంబ్లీలను గెలుచుకోవటం మరింత విచిత్రం. నాలుగు అసెంబ్లీలను గెలుచుకున్న పార్టీ శ్రీరాముడి ఆశీస్సులతో రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కూడా గెలుచుకుంటుందని ఆశతో ఉన్నారు.

ఇదే విషయాన్ని అభ్యర్ధి నగేష్ మాట్లాడుతు రాబోయే ఎన్నికల్లో గెలుపు తనదే అన్నారు. మోడి నాయకత్వంలో పోటీచేస్తున్న తనకు అయోధ్య శ్రీరాముడి ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయన్నారు. తాను ప్రచారానికి ఏ గ్రామానికి వెళ్ళినా అయోధ్యనుండి వచ్చిన అక్షితల గురించి రామాలయ నిర్మాణం గురించి అడుగుతున్నట్లు చెప్పారు. పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని సుమారు 1200 గ్రామ పంచాయితీలన్నింటికీ అయోధ్య నుండి రామాలయం ట్రస్ట్ పంపిన అక్షితలు అందినట్లు చెప్పారు. ఇదే విషయాన్ని జనాలు తనతో ప్రస్తావిస్తున్నట్లు నగేష్ చెప్పారు. కాబట్టి తన గెలుపు భారమంతా నగేష్ శ్రీరాముడి మీదే మోపేశారు.

 

Tags:    

Similar News