హైడ్రాపై మాది ఒంటరి పోరాటమే: బండి సంజయ్

తెలంగాణలో హైడ్రా చేపడుతున్న చర్యలపై కేంద్రమంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ మండిపడ్డారు. పేదల బతుకులతో హైడ్రా ఆడుకుంటుందని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Update: 2024-09-30 08:14 GMT

తెలంగాణలో హైడ్రా చేపడుతున్న చర్యలపై కేంద్రమంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ మండిపడ్డారు. పేదల బతుకులతో హైడ్రా ఆడుకుంటుందని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ప్రజలను దోచుకుంటే.. ఈ ప్రభుత్వం వారి బతుకులను బజారుపాలు చేస్తోందని విమర్శలు చేశారు. చెరువులు, కుంటలను కాపాడుతున్నామంటూ ప్రజలకు గూడు లేకుండా చేస్తున్నారని, ప్రజలకు అండగా బీజేపీ నిలుస్తుందని హామీ ఇచ్చారు. పేదల తరుపున హైడ్రాతో బీజేపీ ఒంటరిగానే పోరాడుతుందని, ఎవరితో కలవదని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు అన్నీ కూడా ప్రజలను దోచుకోవడంలో ఆరితేరినవేనంటూ బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలకు చురకలంటించారు. ప్రజల సొమ్ము తినడం తెలిసినంతగా ఈ ప్రభుత్వాలకు ప్రజాపాలన అందించడం తెలియదని, ప్రజల కంటతడికి కారణమైనా ఏ ప్రభుత్వం నిలిచినట్లు చరిత్రలో ఎక్కడా లేదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలను తమ మాటలతో మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఇప్పుడు అదే అధికార అహకారంతో పేదలను ఏడిపించడం ఏమాత్రం సమంజసం కాదని, హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూల్చేయడం దారుమని మండిపడ్డారు.

లక్షల కోట్ల అవినీతి..

‘‘గతంలో పొలాల్లో బంగారం పండేలా చేస్తా.. ప్రతి రైతుకు ఏడాది పొడవునా నీళ్లు అందిస్తానని బీఆర్ఎస్ సర్కార్ చెప్పింది. అందుకోసమే కాళేశ్వరం అంటూ ఆ ప్రాజెక్ట్ పేరిట రూ.లక్ష కోట్ల అవినీతి చేసింది. ఇప్పుడు మూసీ సుందరీకరణ పేరుతో కాంగ్రెస్ సర్కార్ రూ.లక్షన్నర కోట్ల అవినీతికి పాల్పడుతోంది. ప్రభుత్వాల మధ్య పోటీ అన్నది సుభిక్ష పాలన అందించడంలో ఉండాలి కానీ అవినీతి చేయడంలో కాదు. వీరి తీరు ఎవరు ఎక్కువ దోచుకుంటున్నారన్న కాంపిటీషన్‌లా కనిపిస్తోంది. వీరికి ఓటేసి గెలిపించుకున్నందుకు ప్రతి ఒక్కరూ ఇప్పుడు చింతిస్తున్నారు’’ అని బండి సంజయ్ విమర్శించారు. కరీంగర్‌లో హైడ్రా చర్యలపై మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హైడ్రాను అడ్డుకుంటామని అన్నారు.

అసహ్యించుకుంటున్న ప్రజలు

‘‘హైడ్రా తీరుతో ప్రజలు ప్రభుత్వాన్ని, అధికారులను అసహ్యించుకుంటున్నారు. గతంలో అయ్యప్ప సోసైటీ కూల్చివేత పేరుతో బీఆర్ఎస్ వసూళ్లు చేసింది. ఇప్పుడు హైడ్రా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం వసూళ్లకు పాల్పడుతోంది. ఆ వసూళ్లు అందుకునే పెద్దల ఇళ్లను వదిలేసి పేదల ఇంటిపై హైడ్రా తన ప్రతాపం చూపుతోంది. కేవలం పేదల ఇళ్లనే కూలుస్తాం అంటే.. బీజేపీ చూస్తూ ఊరుకోదు. పేదలకు అండగా నిలుస్తుంది. ప్రజల కోసం ప్రాణాలు పణంగా పెట్టడానికి కూడా బీజేపీ వెనకాడదు. కాదుకూడదు కూల్చాల్సిందే అంటే మా ప్రాణాలు తీసిన తర్వాత పేదోడి ఇంటి జోలికి వెళ్లాల్సి ఉంటుంది. హైడ్రా దాడులపై బీజేపీ సింగిల్‌గానేర ఉద్యమిస్తుంది. ఈ ఉద్యమంలో ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం’’ అని ఆయన చెప్పారు.

ఆ లోన్‌లు ఎవరు కడతారు?

‘‘సొంతింటి కల నేరవేర్చుకోవడం కోసం బ్యాంకుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగి లోన్ తెచ్చుకుని ఇంటిని కొనుగోలు చేస్తారు. ఆ లోన్ కట్టుకోవడానికి మధ్యతరగతి వ్యక్తికి సగం జీవితం సరిపోతుంది. ఇంతలో హైడ్రా పేరుతో వచ్చి ఆ వ్యక్తి కలల సౌధాన్ని నేలకూలిస్తే.. అతడు ఎక్కడికి వెళ్లాలి.. ఎవరిని ప్రశ్నించాలి. ఆ లోన్ ఎవరు కట్టాలి. అక్రమంగా నిర్మాణం చేసిన బిల్డర్ అమ్మకాలు ముగించుకుని వెళ్లిపోయాడు. ఇన్నాళ్లూ ఏ సమస్యా లేకుండా ఉన్నారు. ఇప్పటికిప్పుడు వచ్చి ఇది అక్రమ కట్టడం కూల్చేస్తాం అంటే ఎలా. వారికి సరైన దారి చూపించాల్సిందే. నా ఇంటిని హైడ్రా కూల్చేసింది అంటే బ్యాంక్ వాళ్లు లోన్‌ను మాఫీ చేస్తారా? వారికి న్యాయం చేయకుండా ఇళ్లను కూల్చడం సరైన పద్దతి కాదు. చెరువులను కాపాడటం ఎంత ముఖ్యమో ప్రజలను రక్షించుకోవడం కూడా ప్రభుత్వానికి అంతే ముఖ్యం. ఇళ్లను కూల్చడానికి ముందే ప్రజలకు న్యాయం చేయాలి’’ అని బండి సంజయ్ కోరారు.

Tags:    

Similar News