తెలంగాణలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ బీసీలకే పెద్దపీట వేస్తుందని, వారికే ప్రాధాన్యం ఇస్తుందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు వెల్లడించారు. దేశంతో బీసీల కోసం చిత్తశుద్ధితో పనిచేసే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ప్రధాని మోదీ మాత్రమేనని, అదే విధంగా బీసీల అభ్యున్నతి కోసం పనిచేసే పార్టీ కూడా బీజేపీ ఒక్కటేనని అన్నారు. అసలు బీసీ కమిషన్‌ను తెచ్చిందే మోదీ అని అన్నారాయన. ‘‘గతంలో ఎంబీసీ ఛైర్మన్ పెట్టి రూ.1000 కోట్లు కేటాయిస్తానని కేసీఆర్ గప్పాలు కొట్టారు. కానీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. కేసీఆర్.. సమగ్ర కుల సర్వే చేశారు.. కానీ నివేదిక బయటపెట్టలేదు, తెలంగాణలో బీసీలు 52 శాతానికి పైగా ఉన్నారు. కేసీఆర్ కూడా 52 శాతం మంది కంటే ఎక్కువగా ఉన్నారని అసెంబ్లీలో నోరుజారారు. కానీ ఆయన 38 శాతం ఉన్నారని చెప్పాలని చూసి దొరికిపోయారు. ఇక కాంగ్రెస్ కుల గణన కొన్ని మండలాల్లో జరగనే లేదు. ఎలా పూర్తి చేశారు. నిజంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తే నిజాలు ఎందుకు బయటపెట్టలేదు. అందుకే కేంద్ర ప్రభుత్వం, జన గణనతో పాటు కుల గణన కూడా చేపట్టనుంది. తెలంగాణ సర్కార్ రిజర్వేషన్లు ఇచ్చినా ఇవ్వకపోయినా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మా పార్టీ మాత్రం బీసీలకు పెద్దపీట వేసి తీరుతుంది. 42శాతం సీట్లను కచ్ఛితంగా బీసీలకే ఇచ్చి తీరతాం’’ అని ఆయన స్పష్టం చేశారు.