తెలంగాణ గవర్నర్ కాంగ్రెస్ పార్టీ సాయం చేస్తున్నారా?
బిఆర్ ఎస్ మాజీ మంత్రి హారీష్ రావుకు వచ్చిన అనుమానం. గవర్నర్ తమిళసై గవర్నర్ కోటా కింద ప్రొఫెసర్ కోదండరామ్ పేరును ఆమోదించడంతో హరీష్ ఆగ్రహం ఇలా వ్యక్తం చేశారు.
మొన్న అసంబ్లీ ఎన్నికల ముందు భారతీయ జనతా పార్టీకి ‘బి’గా పేరు తెచ్చుకున్న బిఆర్ ఎస్ ఇపుడు ఎదరు దాడి మొదలుపెట్టింది. తెలంగాణలో కాంగ్రెస్ కు, బిజెపికి దోస్తీ ఉందని ఆరోపిస్తున్నది. ఈ మేరకు మాజీ మంత్రి, బిఆర్ ఎస్ నేత టి హరీష్ రావు హాటాట్ కామెంట్స్ చేశారు.
భారతీయ జనతా పార్టీ ఎజెండాకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి మేలు చేసే విధంగా గవర్నర్ వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు.
"కాంగ్రెస్ , బిజెపిల రహస్యమైత్రి మరోసారి బయటపడింది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంలో రెండు పార్టీల మధ్య ఉన్న అవగాహన బట్ట బయలు అయింది. రాజకీయ పార్టీల్లో కొనసాగుతున్నారనే కారణంతో గత బిఆర్ఎస్ ప్రభుత్వం సిఫారసు చేసిన అభ్యర్థులను ఎమ్మెల్సీలుగా నియమించడానికి ఈ గవర్నర్ గారు నిరాకరించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా ఓ రాజకీయ పార్టీ అధ్యక్షుడినే సిఫారసు చేస్తే గవర్నర్ ఆమోదించారు," అని హరీష్ రావు వ్యాఖ్యానించారు.
ఆయన నిన్న జరిగిన ఎమ్మెల్సీ నియామకాల సందర్భంగా ఈ ఘాట వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండ్ రామ్, సియాసత్ పత్రిక జర్నలిస్టు అమీరుల్లా ఖాన్ ను కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ కోటా కింద శాసన మండలికి నామినేట్ చేసింది. వాటిని గవర్నర్ తమిళసై సౌందరాజన్ అమోదించారు. గతంలో బిఆర్ ఎస్ ప్రభుత్వం ఇద్దరు బిఆర్ ఎస్ నేతలను కౌన్సిల్ల నామినేట్ చేస్తే గవర్నర్ ఆమోదించలేదు. గవర్నర్ కోటా కింద కౌన్సిల్ కు నామినేట్ చేసేందుకు తగిన అర్హతలు బిఆర్ ఎస్ సిఫార్సు చేసిన ప్రొఫెసర్ శ్రవణ్ దాసోజు, కుర్రా సత్యనారాయణ లేదని తిరస్కరించారు.
ఈ నేపథ్యంలో హరీష్ రావు ట్విట్టర్ (ఎక్స్ ) వేదికనుంచి గవర్నర్ మీద దాడి చేశారు.
"ఇది ద్వంద్వ నీతి కాదా ? కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా గవర్నర్ వ్యవహరించడం కాదా ? గతంలో కూడా క్రీడా , సాంస్కృతిక , విద్యా సామాజిక , సేవ రంగాల్లో కృషి చేసిన వారిని బిఆర్ఎస్ ప్రభుత్వం ఎమ్మెల్సీలుగా సిఫారసు చేసింది. అప్పుడు కూడా గవర్నర్ గారు రాజకీయ కారణాలతో వాటిని ఆమోదించలేదు. మరి ఇప్పుడు ఎందుకు ఆమోదించారు?" అని ప్రశ్నించారు.