బీఆర్ఎస్ నేతల కీలక సమావేశం.. రిజర్వేషన్లపైనే చర్చ..!

పలు కీలక డిమాండ్లను చేయాలని ఫిక్స్ అయిన బీసీ నేతలు.;

Update: 2025-07-11 06:36 GMT

బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అనేది ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా ఉంది. ఇదే అంశంపై చర్చించడానికి తాజాగా బీఆర్ఎస్ బీసీ నేతలంతా కలిసి తెలంగాణ భవన్ వేదికగా కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీసీల హక్కుల పరిరక్షణ, రాజకీయాల్లో బీసీలకు అందాల్సిన వాటా, రిజర్వేషన్ల అమలు వంటి అంశాలపై చర్చించారు. అంతేకాకుండా ఎన్నికల సమయంలో బీసీలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలుపై వారు చర్చించారు.

రిజర్వేషన్ల అమలు కాకుండా స్థానిక సంస్థల ఎన్నికలు జరగకూడదని, ఒకవేళ ఆ దిశగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేస్తే వాటిని అడ్డుకోవడానికి సిద్ధంగా ఉండాలని కూడా బీఆర్ఎస్ బీసీ నేతలు చర్చించినట్లు సమాచారం. బీసీలకు రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాల్లో పరిపూర్ణ న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. తెలంగాణలో బీసీల శాతం జనాభాలో అధికంగా ఉన్నా, అవకాశాల్లో మాత్రం తక్కువగా ఉన్నదని సమావేశంలో పలువురు నేతలు అభిప్రాయపడ్డారు.

ఈ క్రమంలోనే బీసీల విషయంలో ప్రభుత్వం ముందు కొన్ని కీలక డిమాండ్లు ఉంచాలని బీఆర్ఎస్ బీసీ నేతలు డిసైడ్ అయ్యారు. ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 42శాతం రిజర్వేషన్లను సమర్థవంతంగా అమలు చేయాలి, అదే విధంగా అన్ని స్థాయుల్లో బీసీలకు సముచిత స్థానాలు, ఉద్యోగావకాశాలు, పార్టీ టికెట్లు కల్పించాలని వారు డిమాండ్ చేయనున్నారు. ఈ డిమాండ్ల అమలు పార్టీలకు అతీతంగా జరగాలని కోరనున్నారు. తమ డిమాండ్లను పార్టీ బీసీ నేతలంతా కలిసి పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌కు అందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News