కాంగ్రెస్‌ను చిత్తు చేసిన బీఆర్ఎస్
మదర్ డైరీ డైరెక్టర్స్ ఎన్నికల్లో ఘనవిజయం.
మదర్ డైరీ డైరెక్టర్ పదవుల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బీఆర్ఎస్ భారీ షాక్ ఇచ్చింది. ఎన్నికలు జరిగిన మూడు స్థానాల్లోనూ గులాబీ జెండా రెపరెపలాడింది. మూడు డైరెక్టర్ స్థానాల్లో కూడా బీఆర్ఎస్ అభ్యర్థులు రచ్చ లక్ష్మినర్సింహా రెడ్డి (154 ఓట్లు), సందిల భాస్కర్ గౌడ్ (240 ఓట్లు), కర్నాటి జయశ్రీ (176) ఓట్లతో విజయం సాధించారు. ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ నేత బీర్ల అయిలయ్య, అండెం సంజీవరెడ్డి, మదర్ డైరీ ఛైర్మన్ మధుసూదన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రెండు జనరల్, ఒక మహిళా డైరెక్టర్ పదవికి జరిగిన ఈ ఎన్నికల్లో మొత్తం తొమ్మిది మంది పోటీ పడ్డారు.
ఈ ఎన్నికలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామెల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చలకు దారితీశాయి. బీర్ల అయిలయ్య ఒంటెద్దు పోకడ కాంగ్రెస్‌ను దెబ్బతీసే అవకాశం ఉందని సామెల్ ఆరోపించారు. రెండు స్థానాల్లో కాంగ్రెస్, ఒక స్థానంలో బీఆర్ఎస్ గెలిచేలా చీకటి ఒప్పందాలు జరిగాయని ప్రచారాలు జోరుగా సాగుతున్నాయని సామెల్ ఆరోపించారు. ఈ సందర్భంగానే బీర్ల అయిలయ్యపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడితే మాత్రం పార్టీ శ్రేణులు తగిన విధంగా బుద్ధి చెబుతాయని బీర్ల ఐలయ్యను మందుల సామేల్ హెచ్చరించారు. అయితే తీరా ఎన్నికల్లో బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేయడం, కాంగ్రెస్ పూర్తిగా ఓడిపోవడం సంచలనంగా మారింది. అధికారంలో ఉండి కూడా కాంగ్రెస్ తన నేతలను గెలిపించుకోలేకపోవడం ఏంటని చర్చించుకుంటున్నారు.