తుంగతుర్తిలో కాంగ్రెస్ నేతల బాంబు దాడి?

రుణమాఫీపై రైతులకు కాంగ్రెస్‌ ధోకా ఇచ్చిందని సర్కారుకి వ్యతిరేకంగా ఆందోళనలకి బీఆర్‌ఎస్‌ సమరశంఖం పూరించింది. ఈ ఆందోళనలు ఉద్రిక్త పరిస్థితులకు దారి తీశాయి.

Update: 2024-08-22 11:38 GMT

రుణమాఫీపై రైతులకు కాంగ్రెస్‌ ధోకా ఇచ్చిందని సర్కారుకి వ్యతిరేకంగా ఆందోళనలకి బీఆర్‌ఎస్‌ సమరశంఖం పూరించింది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో, మండల కేంద్రాల్లో రుణమాఫీ కాని రైతులతో కలిసి గురువారం ఉదయం నుంచి నిరసనలకి దిగింది. బీఆర్ఎస్ చేపట్టిన ఈ ఆందోళనలు పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులకు దారి తీశాయి.

రణరంగంగా మారిన తుంగతుర్తి..

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి పట్టణంలో రుణమాఫీ చేయాలని బీఆర్ఎస్ నేతలు రైతు నిరసన దీక్ష చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కూడా పాల్గొన్నారు. ఆందోళనలో భాగంగా కాంగ్రెస్ కి వ్యతిరేకంగా నిరసనకారులు నినాన్డలు చేశారు. ఈ క్రమంలో స్థానిక కాంగ్రెస్ శ్రేణులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య ఘర్షణ నెలకొంది. రాళ్లతో, కోడి గుడ్లతో దాడి చేసుకున్నారు. కారు అద్దాలు ధ్వంసం చేశారు. కాంగ్రెస్ శ్రేణులు గాదరి కిషోర్ పైకి దూసుకొచ్చారు. దీంతో స్థానికంగా ఉద్రిక్తవాతావరణం ఏర్పడింది. అలర్ట్ అయిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.

'బాంబులతో దాడి'

ఇందిరమ్మ రాజ్యం పేరుతో రేవంత్ తెలంగాణను రావణకాష్టం చేస్తున్నారని బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. రుణమాఫీ కోసం దీక్షలు చేస్తే బాంబులతో దాడి చేసే స్థాయికి కాంగ్రెస్ గూండాలు దిగజారారు అంటూ ఆరోపించింది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి పట్టణంలో, రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేస్తున్న రైతులు, బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ నేతలు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రకటించింది. రైతులందరికీ రుణమాఫీ పూర్తి చేసే దాకా బీఆర్ఎస్ పోరాటం ఆగదని స్పష్టం చేసింది.

దుర్మార్గమైన చర్య -హరీష్ రావు 

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి పట్టణంలో రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేస్తున్న మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్, బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ నేతలు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని హరీష్ రావు చెప్పారు. కారు అద్దాలు ధ్వంసం చేసి రాళ్లు, కోడిగుడ్లతో దాడి చేయటం దుర్మార్గమైన చర్య అన్నారు. సో కాల్డ్ ప్రజాపాలనలో నాయకులు, జర్నలిస్టులపై దాడులు చేస్తారా? ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా? అని హరీష్ రావు ప్రభుత్వాన్ని నిలదీశారు. బీఆర్ఎస్ పాలనలో ఏనాడు ఇలాంటి దాడులు జరగలేదు. ప్రజా సమస్యల పట్ల ప్రశ్నించే గళాలను రేవంత్ సర్కారు అణిచివేసే ప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపించారు. దాడి చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీని డిమాండ్ చేశారు. "కాంగ్రెస్ పిట్ట బెదిరింపులకు బీఆర్ఎస్ పార్టీ భయపడదు. నాయకులు, కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుంది. ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చేదాక, రైతులందరికీ రుణమాఫీ పూర్తి చేసే దాకా పోరాటం కొనసాగిస్తాం. ఎక్కడిక్కడ నిలదీస్తాం" అని హరీష్ రావు తేల్చి చెప్పారు.

రేవంత్ రెడ్డి డైరెక్షన్ లోనే...

సీఎం రేవంత్ రెడ్డి డైరక్షన్ లోనే బీఆర్ఎస్ శ్రేణులపై దాడులు జరుగుతున్నాయని సూర్యాపేట బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆరోపించారు. తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో బీఆరెస్ శ్రేణులపై జరిగిన దాడి సమాచారం తెలుసుకున్న ఆయన తిరుమగిరి వెళ్లి తిరిగి బీఆరెస్ ధర్నాను కొనసాగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... శాంతియుతంగా ధర్నా చేస్తున్న తిరుమలగిరి బీఆరెస్ శిబిరంపై కాంగ్రెస్ దాడిని ఖండిస్తున్నామన్నారు.

రేవంత్ డైరెక్షన్లోనే బీఆర్ఎస్ పై దాడులు జరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలో అల్లర్లు సృష్టించాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తుందన్నారు. హామీల అమలు వైఫల్యం కప్పిపుచ్చుకునేందుకే దాడులు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ మోసాలు బయటపడకుండా ఉండేందుకు హింసను ప్రేరేపిస్తున్నారన్నారు. పోలీసుల సమక్షంలోనే శిబిరాన్ని కూల్చివేశారని, కాంగ్రెసుతో కలిసి పోలీసులు పనిచేసిన్నట్లుగా ఉందని ఆరోపించారు. కాంగ్రెస్ దాడుల ఖాతాలను రాసి పెట్టాలని, మంచి సందర్భం మనకు వస్తదని, మనం అధికారంలోకి వచ్చాక అలాంటి పనులు చేయబోమని, ఈలోగానే ఏదైనా చేస్తే చెప్పి చేస్తామని, రుణం తీర్చేస్తామని... రేవంత్, వెంకట్రెడ్డిల మాదిరిగా దొంగల్లాగా చేయబోమన్నారు.

రుణమాఫీ పై ప్రభుత్వం ఇప్పటివరకు స్పష్టమైన ప్రకటన లేదన్నారు. చెయ్యని రుణమాఫీకి కాంగ్రెస్ ప్రచారాలతో డంబాచారాలకు పోతుందన్నారు. రుణమాఫీ పై రైతులు స్వచ్చందంగా ఆందోళనలు చేస్తున్నారని, స్వయానా మంత్రులే పూర్తిస్థాయిలో మాఫీ కాలేదని చెబుతున్నా ప్రభుత్వం కవరింగ్ చేస్తుందన్నారు. దాడులు చేసి రెచ్చగట్టాలని చూస్తున్నారని, ఎన్ని దాడులు చేసినా ప్రజల కోసం అనుభవించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. తిరుమలగిరి సంఘటన పై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రైతాంగానికి న్యాయం జరిగే వరకు ఎన్ని దాడులు చేసినా మా పోరాటం ఆగదన్నారు. హామీల అమలు మరిస్తే ప్రజలు కాంగ్రెస్ ను వదలిపెట్టరన్నారు. 

Tags:    

Similar News