BRS First List | బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థుల తొలి జాబితా
BRS First List | బీఆర్ఎస్ పార్లమెంటు అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. సోమవారం సాయంత్రం తెలంగాణ భవన్ వేదికగా పార్టీ అధినేత కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించారు.
బీఆర్ఎస్ పార్లమెంటు అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. సోమవారం సాయంత్రం తెలంగాణ భవన్ వేదికగా పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించారు. కరీంనగర్ - బి. వినోద్ కుమార్, పెద్దపల్లి - కొప్పుల ఈశ్వర్, ఖమ్మం - నామా నాగేశ్వర్ రావు, మహబూబాబాద్ - మాలోత్ కవితను ఖరారు చేశారు. లోక్ సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టిన కేసిఆర్ రెండు రోజులుగా అభ్యర్థులు ఎంపికపై కీలక చర్చలు జరిపారు. ఆయా పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ముఖ్య నేతలతో చర్చించిన అనంతరం సమష్టి నిర్ణయం ప్రకారం నలుగురు అభ్యర్థులను అధినేత ప్రకటించారు. ఈ సందర్భంగా అభ్యర్థులకు కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
కాగా, పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ రంగంలోకి దిగారు. రెండు రోజులగా తెలంగాణ భవన్ లో పార్టీ ముఖ్య నేతలతో అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చలు జరిపారు. సార్వత్రిక ఎన్నికలకు ఈ నెల 13 తర్వాత ఏ క్షణమైనా షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని, అంతకంటే ముందే ఓ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సెంటిమెంట్ గా పార్టీకి కలిసొస్తున్న కరీంనగర్ ఎస్ఆర్ఆర్ గ్రౌండ్ లో ఈ నెల 12న సభను నిర్వహించాలని డిసైడ్ అయ్యారు.
అలాగే అసెంబ్లీ నియోజకవర్గాలు, మండలాల వారీగా బస్సుయాత్ర చేపట్టాలని ఆలోచనకు వచ్చారు. బస్సుయాత్రతో రోడ్ షోలు చేపడితే నియోజకవర్గంలోని ఎక్కువ గ్రామాలు, ముండలాలు, మున్సిపాలిటీలను చుట్టిరావచ్చని భావిస్తున్నారు. ప్రతి మండలంలో పార్టీ లోక్ సభ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించాలని, పార్టీ గెలుపు ఆవశ్యకతను ప్రజలకు వివరించాలని కేసీఆర్ సూచించారు.