సహనం కోల్పోయిన బీఆర్ఎస్.. అసెంబ్లీలో రచ్చరచ్చ
కాగితాలు చించి ఆందోళన వ్యక్తం చేసిన బీఆర్ఎస్ నేతలు.;
కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చ రచ్చరచ్చగా మారింది. అసెంబ్లీలో ఈ చర్చ జరుగుతుండగా బీఆర్ఎస్ నేతలు సహనం కోల్పోయారు. పీసీ ఘోష్ కమిషన్ నివేదికను చించి స్పీకర్ పోడియం వైపు విసిరారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. చర్చ సమయంలో హరీష్ రావును మంత్రులు పదే పదే అడ్డుకున్నారని, తమను వివరణ ఇవ్వనివ్వలేదని బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు. వాళ్లే సభ పెట్టి, చర్చకు పిలిచి.. వాళ్లు చెప్పాలనుకున్నది చెప్పి.. తమను ఏమీ చెప్పనీయకుండా చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నామని లాజిక్ మాట్లాడుతున్నాం అని అనిపించిన ప్రతిసారి బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు మైక్‌ను పదే పదే కట్ చేయించారని కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. హరీష్ రావును గంటా 20 నిమిషాలు మాట్లాడారని స్పీకర్ అన్నారని, కానీ ఆ సమయంలో 20కిపైగా సార్లు మంత్రులు హరీష్ రావు ప్రసంగాన్ని అడ్డుకున్నారని బీఆర్ఎస్ నేతలు అన్నారు.
సమాధానం లేకనే ఆందోలనలా..
అయితే కమిషన్ నివేదికపై చర్చ మొదటి నుంచి హాట్ హాట్‌గా సాగుతోంది. హరీష్ రావు ప్రసంగం ప్రారంభించడమే నివేదికపై కాకుండా పీసీ ఘోష్ కమిషన్ చట్టబద్దత గురించి ప్రస్తావించారు. అందుకోసం చరిత్రను తిరగతోడి అనేక సంబంధం లేని అంశాలను లేవనెత్తారు. కానీ హరీష్ రావు చేసిన ప్రతి ఆరోపణ, అడిగిన ప్రతి ప్రశ్నకు మంత్రులు, అధికార పక్షం నుంచి ఘాటైనా సమాధానాలు రావడంతో బీఆర్ఎస్ అమ్ములపొది ఖాళీ అయిపోయిందని, అందులో ఆందోళన బాట పట్టారని కాంగ్రెస్ నాయకులు చురకలంటించారు. చేసేదేమీ లేక ఆఖరికి పీసీ ఘోష్ కమిషన్ నివేదికను చెత్త అని, కాంగ్రెస్ నివేదిక అని, చెత్త బుట్టలో వేయాల్సిన నివేదిక అని కూడా బీఆర్ఎస్ నేతలు సంభోదించారని కాంగ్రెస్ నేతలు తెలిపారు.