ఫిరాయింపులపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్
పార్టీ ఫిరాయింపు నేతలకు ఎలాగైనా బుద్ధి చెప్పాలన్న లక్ష్యంతో బీఆర్ఎస్ ముందుకెళ్తోంది.;
పార్టీ ఫిరాయింపు నేతలకు ఎలాగైనా బుద్ధి చెప్పాలన్న లక్ష్యంతో బీఆర్ఎస్ ముందుకెళ్తోంది. ఇప్పటికే ఫిరాయింపు నేతలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ హైకోర్టు ఆశ్రయించినప్పటికీ.. అక్కడ ఆశించిన ఫలితాలు రాలేదు. ఎమ్మెల్యేలపై అర్హత విషయంలో స్పీకర్‌దే తుది నిర్ణయం అని, అసెంబ్లీ వ్యవహారాల్లో తాము జోక్యం చేసుకోలేమని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే తాజాగా బీఆర్ఎస్.. సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పది మంది ఎమ్మెల్యేలు తమ పార్టీ జెండాపై గెలిచి.. ఆ తర్వాత అధికారం కోసం పార్టీ మారిపోయారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని 9 నెలల క్రితమే స్పీకర్‌కు ఫిర్యాదు చేశామని బీఆర్ఎస్ తెలిపింది. అయినా ఇప్పటి వరకు తాము పేర్కొన్న పది మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ ఎటువంటి చర్యలు తీసుకోలేదని బీఆర్ఎస్ తన పిటిషన్‌లో పేర్కొంది.
ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో హైకోర్టు తీర్పు ఇచ్చి కూడా ఆరు నెలలు అవుతున్నా స్పీకర్ ఇప్పటి వరకు చర్యలకు ఉపక్రమించలేదని, కనీసం నోటీసు కూడా ఇవ్వలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్‌కు వ్యతిరేకంగా పిల్ దాఖలు చేసింది. మిగిలిన ఏడుగురు ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా రిట్ పిటిషన్ ఫైల్ చేసింది. ఫిరాయింపు నేతల అంశంపై నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకునేలా స్పీకర్‌కు ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది.
హైకోర్టు ఏం తెలిపిందంటే..
ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వ్యవహారంలో తుది నిర్ణయం తిరిగి తిరిగి అసెంబ్లీ స్పీకర్ దగ్గరకే చేరింది. ఈ పిటిషన్ వ్యవహారంలో తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని, అతి త్వరలోనే తెలంగాణలోని పలు నియోజకవర్గాల్లో ఉపఎన్నిక జరగనుందంటూ ధీమా వ్యక్తం చేసిన బీఆర్ఎస్‌కు హైకోర్టు ఇచ్చిన తీర్పు భారీ షాక్‌గా మారిందని అంటున్నారు విశ్లేషకులు.
అయితే అసెంబ్లీ వ్యవహారాలకు సంబంధించి తుది నిర్ణయం తీసుకునే అధికారం స్పీకర్‌దేనని హైకోర్టు డివిజన్ బెంచ్ తేల్చి చెప్పింది. కాగా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం షెడ్యూల్ 10 ప్రకారం చర్యలు చేపట్టాలని సూచించింది. ఐదేళ్ల గడువు ఉన్న క్రమంలో స్పీకర్ నిర్ణయాలను నిర్దేశించలేమని వెల్లడించింది. ఈ తీర్పుతో రెండు రాజ్యాంగ వ్యవస్థల మధ్య అధికార విభజన ఉంటుందని, ఒక వ్యవస్థ వ్యవహారాల్లో మరో వ్యవస్థ జోక్యం చేసుకోవదని, చేసుకోవడం కుదరదని న్యాయస్థానం స్పష్టం చేసినట్లయింది.