‘తొందర్లో తెలంగాణ సీఎం కేసీఆర్’
జూన్ 2 లేదా డిసెంబర్ 9 తర్వాత కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ విలీనమవడం తథ్యమని జోస్యం చెప్పారు.;
తెలంగాణ రాజకీయాలపై బీజేపీ నేత, మాజీ ఎమ్మెలోయే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అతి త్వరలో తెలంగాణ రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగే అవకాశాలు ఉన్నట్లు ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. కొన్ని రోజుల్లోనే బీఆర్ఎస్ కనుమరుగుకానుందని, కాంగ్రెస్ పార్టీలో విలీనమవడానికి బీఆర్ఎస్ రెడీ అయిందని ఆయన ఆరోపించారు. ఈ మేరకు కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఒప్పందం కూడా జరిగిందని వ్యాఖ్యానించారు. జూన్ 2 లేదా డిసెంబర్ 9 తర్వాత కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ విలీనమవడం తథ్యమని జోస్యం చెప్పారు. అంతేకాకుండా హరీష్ రావుకు చురకలంటించారు. తాను కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తున్నానని, ఇకముందు కూడా ఆయన నాయకత్వంలోనే పనిచేస్తానని హరీష్ చేసిన వ్యాఖ్యలు గుర్తు చేశారు ప్రభాకర్. ఇప్పుడు కేటీఆర్ నాయకత్వంలో పనిచేయడానికి కూడా సిద్ధమని, కేటీఆర్‌కు బాధ్యతలు ఇస్తే దానిని తాను స్వాగతిస్తానని హరీష్ మాట్లాడటం కీలక అంశమని ప్రభాకర్ అభిప్రాయపడ్డారు.
దాంతో పాటుగా అతి త్వరలోనే తెలంగాణ సీఎం కూడా మారనున్నారంటూ హాట్ కామెంట్స్ చేశారు. రేవంత్‌కు ఆ సీటు నుంచి దిగిపోతాడని, ఆ స్థానంలోకి మళ్ళీ కేసీఆర్ వస్తారని అన్నారు ప్రభాకర్. బీఆర్ఎస్ విలీనం సమయం తర్వాత ఇదే జరుగుతుందని, అతి త్వరలో తెలంగాణ సీఎం కేసీఆర్ అవుతారని పునరుద్ఘాటించారు.
ఇదిలా ఉంటే ఈ అంశాన్ని గతంలో మరికొందరు బీజేపీ నేతలు కూడా నొక్కి చెప్పారు. వారిలో ప్రస్తుత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా ఒకరు. ఆయన గతేడాది ఆగస్టులో బీఆర్ఎస్ విలీనం పక్కా అని వ్యాఖ్యానించారు. విలీనం పథకంలో భాగంగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలందరినీ కాంగ్రెస్ హక్కున చేర్చుకుంటుందని, ఆఖరికి పెద్ద నేతలు ఒకేసారి జెండా మార్చేసి విలీన ప్రక్రియకు శుభంకార్డు వేస్తారని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు అవే వ్యాఖ్యలను మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ పునరుద్ఘాటించారు.