బీజేపీని టచ్ చేసే ధైర్యముందా ?

అత్యంత బలహీనంగా ఉన్న పార్టీగా బీజేపీ అనే చెప్పుకోవాలి. కానీ బీజేపీని టచ్ చేసే ధైర్యం మాత్రం మిగిలిన రెండుపార్టీల్లో కనబడటంలేదు.

Update: 2024-03-31 08:44 GMT
Revanth and KCR photos Facebook

శతృవుకు శతృవు మిత్రుడనేది రాజనీతి. కాని ఈ రాజనీతి అన్నీసందర్భాల్లోను పనిచేయదని తెలంగాణా పాలిటిక్స్ ను చూస్తే అర్ధమవుతోంది. తెలంగాణాలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మాత్రమే ముఖ్యమైన పార్టీలు. అయితే వీటిల్లో అత్యంత బలహీనంగా ఉన్న పార్టీగా బీజేపీ అనే చెప్పుకోవాలి. కానీ బీజేపీని టచ్ చేసే ధైర్యం మాత్రం మిగిలిన రెండుపార్టీల్లో కనబడటంలేదు. ఎంఎల్ఏలను, సీనియర్ నేతలను లాక్కోవటంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకదానిపై మరొకటి ఎత్తులు పై ఎత్తులు వేసుకుంటున్నాయే కాని బీజేపీ జోలికి మాత్రం వెళ్ళటంలేదు. బీజేపీ నేతల్లో ఎవరైనా తమంతట తాముగా బయటకు వచ్చేస్తే మాత్రమే పై రెండుపార్టీలు చేర్చుకుంటున్నాయి. అంతేకాని నేతలపై టార్గెట్ పెట్టి ఏదో విధంగా లాక్కునే ప్రయత్నాలు మాత్రం చేయటంలేదు.

దీనికి కారణం ఏమిటంటే జాతీయస్ధాయిలో బీజేపీ చాలా బలంగా ఉండటమే. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్రమోడిని చూసే బీజేపీ జోలికెళ్ళటానికి పై రెండుపార్టీలు జంకుతున్నాయి. ఇపుడున్న బీజేపీ ఒకప్పటి వాజ్ పేయి, ఎల్కే అద్వాని నాయకత్వంలోని పార్టీ కాదని అందరికీ తెలుసు. మోడీ, అమిత్ షా ధ్వయం దేశంలో ప్రతిపక్షాలన్నవి లేకుండా చేయాలని శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రయత్నాల్లో కొంతవరకు సక్సెస్ అవుతున్నారు. వీళ్ళదెబ్బకు కాంగ్రెస్ తో పాటు చాలా ప్రాంతీయపార్టీలు విలవిల్లాడుతున్నాయి. ఈ పరిస్ధితుల్లో బీజేపీని టచ్ చేస్తే ఏమి జరుగుతుందో కేసీయార్, రేవంత్ రెడ్డికి బాగా తెలుసు.

బీజేపీని టచ్ చేస్తే అంతే సంగతులా ?

కేసీయార్ అధికారంలోకి వచ్చిన దగ్గరనుండి టీడీపీ, కాంగ్రెస్ ను దెబ్బకొట్టడంపైన మాత్రమే దృష్టి పెట్టినసంగతి అందరు చూసిందే. అలాగే ఇపుడు రేవంత్ కూడా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలను టార్గెట్ చేస్తున్నారే కాని కమలంపార్టీ జోలికి వెళ్ళటంలేదు. ప్రతిపక్ష పార్టీల అధినేతలు, నేతల విషయంలో చిన్న అవకాశం దొరికినా కేంద్ర దర్యాప్తు సంస్ధలైన ఈడీ, సీబీఐ, ఐటిలను ఉసిగొలిపి కేసులుపెట్టి బట్టను పిండినట్లు పిండేస్తున్నారనే ఆరోపణలు అందరు వింటున్నదే. ప్రతిపక్షాల్లో ఎంతమంది నేతలపై కేసులు నమోదయ్యాయి ? ఎంతమంది జైలుకు వెళ్ళారో చూసిన తర్వాత కూడా కేసీయార్, రేవంత్ అంత ధైర్యం చేయగలరా ?

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత పీకల్లోతు ఇరుక్కుని తీహార్ జైల్లో ఉన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో అవినీతి, అవకతవకల్లో కేసీయార్ పై ఆరోపణలున్నాయి. ఇది సరిపోదన్నట్లుగా తాజాగా టెలిఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు పెరిగిపోతున్నాయి. ట్యాపింగ్ కు మూలకారకుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అప్పటి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో(ఎస్ఐబీ) చీఫ్ ప్రభాకరరావు విచారణకు హాజరైతే సంచలనాలు ఖాయం. ప్రభాకరరావు ఈరోజో రేపో విచారణకు హాజరవుతారని అంటున్నారు. ఇద్దరు ముగ్గురి ఫోన్లు ట్యాపింగ్ జరిగినట్లు ఇప్పటికే కేటీయార్ అంగీకరించారు. టెలిఫోన్ ట్యాపింగ్ పెద్ద నేరమని అందరికీ తెలిసిందే. ప్రభాకరరావు వాగ్మూలం ఆధారంగా కేసీయార్ మీద కేసులు నమోదైతే ఇందులో నుండి బయటపడటం కష్టమే.

ఇక రేవంత్ మీద చాలాకాలంగా ఓటుకునోటు కేసు ఉండనే ఉన్నది. ఈ కేసు సుప్రింకోర్టు విచారణలో ఉంది. ఈ కేసులో విచారణ ఎప్పటికి పూర్తవుతుందో ? ఎప్పుడు తీర్పొస్తుందో ఎవరు చెప్పలేకపోతున్నారు. ఇదికాకుండా ఆదాయానికి మించిన ఆస్తుల విషయంలో ఐటి శాఖ కూడా రేవంత్ పై కేసులు నమోదుచేసుంది. కాబట్టి మెడపైన కేసులు వేలాడుతు నేపధ్యంలో కేసీయార్, రేవంత్ ఎప్పటికీ బీజేపీ జోలికి వెళ్ళే ధైర్యంచేయలేరు. వీళ్ళిద్దరు కాకుండా ఇక బీజేపీని టచ్ చేసే ధైర్యం ఎవరికుంటుంది ?

Tags:    

Similar News