పంజాగుట్టలో కారు బీభత్సం.. హోంగార్డును ఈడ్చుకెళ్లిన వైనం..

పంజాగుట్ట నాగార్జున సర్కిల్ దగ్గర ఈరోజు ఉదయం ఓ కారు బీభత్సం సృష్టించింది. బ్లాక్‌ఫిల్మ్ చెకింగ్ కోసం పోలీసులు అక్కడ వాహనాలను తనిఖీలను చేస్తున్నారు.

Update: 2024-11-08 08:35 GMT

పంజాగుట్ట నాగార్జున సర్కిల్ దగ్గర ఈరోజు ఉదయం ఓ కారు బీభత్సం సృష్టించింది. బ్లాక్‌ఫిల్మ్ చెకింగ్ కోసం పోలీసులు అక్కడ వాహనాలను తనిఖీలను చేస్తున్నారు. ఈ చెకింగ్ సమయంలో సయ్యద్ అనే వ్యక్తి తన కారును ఆపాలంటూ హోంగార్డ్ రమేష్ సిగ్నల్ ఇచ్చాడు. అది గమనించిన సయ్యద్ కారును ఏమాత్రం ఆపకుండా ముందుకు దూకించాడు. కారుతో పాటు హోంగార్డును కూడా కొంత దూరం ఈడ్చుకెళ్లాడు. ఈ ఘటనకు సంబంధించి వీడియో అక్కడే ఉన్న సీసీటీవీ కెమెల్లో రికార్డ్ అయింది. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.

అయితే పోలీసులు ఆపమనడంతో భయపడే సయ్యద్ ఇలా చేశాడని పోలీసులు తెలుపుతున్నారు. ఏది ఏమైనా హోంగార్డును ఈడ్చుకెళ్లడం మామూలు విషయం కాదని, ఏమైనా అయి ఉంటే ఏంటి పరిస్థితి అని ఈ ఘటనపై పంజాగుట్ట ట్రాఫిక్ ఎస్సై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఫిర్యాదు మేరకే పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా దర్యాప్తును వేగవంతం చేసి సయ్యద్‌ను అదుపులోకి తీసుకోవడానికి గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసు వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే ఈ అంశంపై అనేక అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ట్రాఫిక్ పోలీసులను చూసి సయ్యద్ అంత భయడటానికి కారణాలు ఏంటనేది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. అది చోరీ చేసిన కారా? కారులో ఏమైనా తీసుకెళ్ల కూడని వస్తువులను తీసుకెళ్తున్నాడా? ఇంకేం కారణమై ఉండొచ్చు? అన్న అనుమానాలను ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News