సార్వత్రిక ఎన్నికలు.. ఏపీలో ఈసీ కీలక అడుగు

ఈసీ చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంపై కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ పై ప్రత్యేక దృష్టి సారించినట్లు స్పష్టం అవుతోంది.

Update: 2024-03-28 15:20 GMT

ఏపీలో ఎన్నికల ప్రచార హోరు వాడీవేడిగా కొనసాగుతోంది. మే 13 న అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికలు జరగనుండటంతో అన్ని పార్టీలు క్యాంపెయినింగ్ స్పీడ్ అప్ చేశాయి. ఈ క్రమంలో అధికార పార్టీ ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తోందంటూ విపక్షాలు పదే పదే ఫిర్యాదులు చేస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ ఈసీ చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంపై కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ పై ప్రత్యేక దృష్టి సారించినట్లు స్పష్టం అవుతోంది. ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమిస్తూ ఈసీ కీలక అడుగు వేసింది.

రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రామ్ మోహన్ మిశ్రా స్పెషల్ జనరల్ అబ్జర్వర్‌గా, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి దీపక్ మిశ్రా స్పెషల్ పోలీస్ అబ్జర్వర్‌గా వ్యవహరిస్తారు. అదనంగా రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారిణి నీనా నిగమ్‌ను ప్రత్యేక వ్యయ పరిశీలకురాలిగా నియమించినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారిక ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. వచ్చే వారం నుండి ఈ ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు రాష్ట్రంలో పర్యటించనున్నారు.

రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల ముందస్తు నిర్వహణ కార్యక్రమాలను పరిశీలించడంతో పాటు ఈసీ నిబంధనలు పటిష్టంగా అమలయ్యేలా ప్రత్యేక పరిశీలకులు చర్యలు తీసుకుంటారు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలు, సమస్యాత్మకమైన ప్రాంతాలపై వీరు ప్రత్యేక దృష్టి సారించనున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు లీడర్లు వేసే తాయిలాలు కట్టడి చేసేలా చర్యలు తీసుకోనున్నారు. జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలు, లా ఎన్ఫోర్సుమెంట్ ఏజన్సీలతో ఎన్నికల సంఘం నిర్వహించే సమావేశాల్లో పాల్గొని.. వారికి స్పెషల్ అబ్జర్వర్స్ సూచనలు, సలహాలు ఇస్తారని ముకేష్ కుమార్ మీనా తెలిపారు.

Tags:    

Similar News