Revanth Reddy | ‘రాష్ట్ర హక్కులకు కేంద్రం కాలరాస్తోంది’

మళ్ళీ రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన పరిస్థితులు దేశంలో రావడం అత్యంత దురదృష్టకరమని సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.;

Update: 2025-01-26 07:48 GMT

‘‘యూనివర్సిటీలపై రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న హక్కులను కేంద్రప్రభుత్వం కాలరాస్తోంది. తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్రం కుట్రలు చేస్తోంది. వీటిని ఎలాగైనా అడ్డుకోవాల్సిందే’’ ఇవి బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. తెలంగాణలోని యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ల(వీసీ) నియామకాన్ని యూజీసీ ద్వారా చేపట్టే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. యూజీసీ ద్వారా రాష్ట్రంలోని వర్సిటీలపై కేంద్రం పెత్తనం చేసే ప్రయత్నం ఏమాత్రం మంచిది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది వర్సిటీల స్వయం ప్రతిపత్తిని హరించాలని కేంద్రం పన్నుతున్న కుట్రేనని, దీనిని అడ్డుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని వ్యాఖ్యానించారు. అదే విధంగా పద్మ అవార్డులు ఇవ్వడంలో కూడా తెలంగాణపై వివక్ష చూపిందని అన్నారు.

మళ్ళీ రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన పరిస్థితులు దేశంలో రావడం అత్యంత దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కేవలం సర్టిఫికెట్ల కోసం మాత్రమే కాదు. సామాజిక బాధ్యతగా ఆనాడు పీవీ నరసింహారావు యూనివర్సిటీని ముందుకు తీసుకెళ్లారు. సమాజంలో సమస్యలకు ఇక్కడి నుంచే పరిష్కారం మొదలు కావాలి. విద్యా హక్కును దూరం చేసే హక్కు పాలకులకు ఎవరూ ఇవ్వలేదు. నిర్లక్ష్యానికి గురవుతున్న విద్యావ్యవస్థను గాడిన పెట్టేందుకు మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా యూనివర్సిటీలను బలోపేతం చేసేందుకు వీసీలను నియమించాం. వందేళ్ల తరువాత ఉస్మానియా యూనివర్సిటీకి దళిత సామాజిక వర్గానికి చెందిన విద్యావేత్తను వీసీగా నియమించాం. యూనివర్సిటీల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి అవసరమైన చర్యలు చేపట్టాలని వీసీలను ఆదేశించాం’’ అని తెలిపారు.

‘‘తెలంగాణ సమాజానికి చికిత్స అందించాల్సిన బాధ్యత యూనివర్సిటీ వీసీలపై ఉంది. పదేళ్లకు అవసరమైన ప్రణాళికలు సిద్దం చేయండి..అమలు చేసే బాధ్యత మేం తీసుకుంటాం. యూనివర్సిటీలను ప్రైవేటీకరణ చేయాలన్న ఆలోచన చేస్తే అది మంచిది కాదు. రాష్ట్రంలో యూనివర్సిటీల పునర్నిర్మాణం జరగాలి. దేశానికి పీవీ నర్సింహారావు, జైపాల్ రెడ్డి లాంటి వారిని అందించిన ఘనత యూనివర్సిటీలదే. రంగుల గోడలు అద్దాల మేడలు అభివృద్ధి కాదని బాబా సాహెబ్ అంబేద్కర్ చెప్పారు. చిట్టచివరి పేదల వరకు సంక్షేమ ఫలాలు అందాలన్న అంబేద్కర్ ఆశయంతో మా ప్రభుత్వం పనిచేస్తుంది’’ అని చెప్పారు.

‘‘యూజీసీ నిబంధనలు మార్చి రాష్ట్రాల పరిధి నుంచి యూనివర్సిటీలపై అధికారాలను తప్పించాలని కుట్రలు చేస్తున్నారు. విశ్వవిద్యాలయాలపై ఆధిపత్యం చెలాయించాలనే ఆలోచన వెనక ఒక పెద్ద కుట్ర ఉంది. యూనివర్సిటీలపై ఆధిపత్యం కేంద్రం చేతుల్లోకి వెళితే కొంతమంది చేసే విషప్రచారానికి యూనివర్సిటీలు వేదికలు కాబోతున్నాయి. ప్రధాని మోదీకి ఈ వేదికగా విజ్ఞప్తి చేస్తున్నా. మీరు యూజీసీ నిబంధనలు మార్చాలనుకోవడం రాజ్యాంగంపై దాడి చేయడమే. ఇది రాష్ట్రాలపై సాంస్కృతిక దాడి చేయడమే. ఇలాంటి చర్యలు కేంద్ర ప్రభుత్వానికి మంచిది కాదు. ఇది అనవసర వివాదాలకు దారితీస్తుంది’’ అని హెచ్చరించారు.

‘‘రాష్ట్రాల అధికారాన్ని కేంద్రం గుంజుకోవడం మాపై దాడిగానే భావిస్తాం. మా హక్కులను వదులుకోవడానికి మేం సిద్ధంగా లేము. యూజీసీ నిబంధనల మార్పు నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాల్సిందే. అలా చేయకపోతే అవసరమైతే నిరసనలకు వెనకాడం. రాష్ట్రాల అధికారాలను ఒక్కొక్కటిగా కేంద్రం తీసుకుంటూ వెళితే..రాష్ట్రాలు కేవలం పన్నుల వసూలు చేసే సంస్థలుగా మిగలాల్సి వస్తుంది. రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలగకుండా మేధావులు ఆలోచన చేయాలి’’ అని పిలుపునిచ్చారు.

‘‘పద్మ అవార్డుల విషయంలోనూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేసింది. గద్దర్, చుక్కా రామయ్య, అందెశ్రీ, గోరటి వెంకన్న, జయధీర్ తిరుమల రావు లాంటి వారిని గుర్తించకపోవడం దారుణం. పద్మ అవార్డులపై ఈ వేదికగా మా అసంతృప్తిని కేంద్రానికి తెలియజేస్తున్నాం. త్వరలోనే ప్రధానికి ఈ విషయంపై లేఖ రాయబోతున్నాం’’ అని వెల్లడించారు.

Tags:    

Similar News