గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదంపై చార్మినార్ పోలీసుల దర్యాప్తు
గుల్జార్ హౌస్ అగ్నిప్రమాద ఘటనపై చార్మినార్ పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి బంధువు ఉత్కర్ష్ మోదీ ఇచ్చిన ఫిర్యాదు మేర పోలీసులు కేసు నమోదు చేశారు.;
By : The Federal
Update: 2025-05-19 10:09 GMT
హైదరాబాద్ ఓల్డ్ సిటీ గుల్జార్ హౌస్ అగ్నిప్రమాద ఘటనపై చార్మినార్ పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుల కుటుంబసభ్యుడు ఉత్కర్ష్ మోదీ ఇచ్చిన ఫిర్యాదు మేర పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆదివారం ఉదయం 6.10 గంటలకు తన తండ్రి వినోద్ మోదీకి అత్యవసరంగా రావాలని రాహుల్ ఫోన్ చేయడంతో తాను తన తండ్రితో కలిసి గుల్జార్ హౌస్ కు చేరుకున్నానని ఉత్కర్ష్ మోదీ ఫిర్యాదులో పేర్కొన్నారు.ఈ అగ్నిప్రమాద ఘటనపై అనుమానాలు ఉన్నందున దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
నలుగురు ప్రాణాలతో బయటపడ్డారు...
ప్రహ్లాద్ మోదీ గత కొన్ని సంవత్సరాలుగా గుల్జార్ హౌస్ లో నివాసముంటున్నారని, అత్తాపూర్ లో ఓ వేడుకకు హాజరై తిరిగి వచ్చి 21 మంది ఉండగా అగ్నిప్రమాదం జరిగిందని ఉత్కర్ష్ మోదీ ఫిర్యాదులో పేర్కొన్నారు. అగ్నిప్రమాదం లో ఏసీ కంప్రెషర్ పేలి పోయిందని దీంతో లోపల ఉన్నవారు బయటకు వచ్చేందుకు ప్రయత్నించినా మంటలతో దారి మూసుకుపోవడంతో బయటకు రాలేక మృత్యువాత పడ్డారని ఆయన తెలిపారు.పొగ పీల్చడం వల్ల గదిలోపల ఉన్న 21 మందిలో 17 మంది ప్రాణాలు కోల్పోగా నలుగురు కోలుకున్నారని ఆయన ఫిర్యాదులో తెలిపారు.
అగ్నిప్రమాద ఘటనపై కుట్ర కోణం ఉందా?
గుల్జార్ హౌస్ అగ్నిప్రమాద ఘటనపై పలువురికి సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. మంటల ధాటికి తట్టుకోలేక వారు టెర్రస్ మీదకు వెళ్లే ప్రయత్నం చేయగా, మెట్ల మార్గం గేటుకు తాళం వేసి ఉండటంతో వారు తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది. టెర్రస్ గేటుకు తాళం వేసి ఉండటంతో ఈ ఘటనలో కుట్ర కోణం ఉందా అనే అశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైనా గిట్టని వాళ్లు ఈ దారుణానికి పాల్పడ్డారా అనే కోణంలోనూ తాము దర్యాప్తు చేస్తున్నామని చార్మినార్ పోలీసులు చెప్పారు.
మృతులకు అంతిమ సంస్కారం
గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదంలో మరణించిన బంధువులకు కుటుంబ సభ్యులు అంతిమ సంస్కారం చేశారు. వేసవి సెలవుల కోసం తమ ఇంటికి వచ్చిన పిల్లలు,మనవరాళ్లతో ఆనందంగా గడపాలనుకున్న రాజేందర్ మోదీ, అతని భార్య సుమిత్ర మృత్యువాతపడ్డారు.పురానాపుల్‌లోని హిందూ శ్మశాన వాటిక వద్ద విషాదకరమైన వాతావరణం ఏర్పడింది.అగ్నిప్రమాద మృతులకు వారి బంధువులు కన్నీటి వీడ్కోలు పలికారు. మరణించిన వారి ఆత్మలకు అంతిమ సంస్కారాలు నిర్వహించారు.హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సమక్షంలో దహన సంస్కారాలు నిర్వహించారు.
హర్యానా నుంచి హైదరాబాద్ వచ్చి స్థిర నివాసం
అగ్నిప్రమాదంలో మృత్యువాత పడిన మోదీ కుటుంబానికి హర్యానాలో మూలాలు కలిగి ఉన్నప్పటికీ, వారి పూర్వీకులు 150 సంవత్సరాల క్రితం హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు.దుఃఖం, కోపంతో మృతుల కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు.అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఎందుకు రాలేదని వారి బంధువులు ప్రశ్నిస్తున్నారు. అగ్ని ప్రమాద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.5 లక్షల పరిహారం పొందటానికి ఫారమ్‌పై సంతకం చేయడానికి మృతుడి బంధువులు, కుటుంబ సభ్యులు నిరాకరించారు.పరామర్శకు వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మీలపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అగ్నిమాపక సిబ్బంది ఆలస్యంగా వచ్చారు...
అగ్నిమాపక సిబ్బంది సరైన పరికరాలు లేకుండా వచ్చారని మృతుల బంధువుల్లో ఒకరు ఆరోపించారు.‘‘ఫైర్ సిబ్బంది దగ్గర అగ్నిమాపక యంత్రాలు, నీళ్లు కూడా లేవు. వారు ఇంట్లోకి కూడా ప్రవేశించలేకపోయారు” అని మృతుడి బంధువు చెప్పారు.అగ్నిప్రమాదం గురించి ఫోన్ కాల్ అందుకున్న ఆటో డ్రైవర్ పాషా ఫైర్ వాళ్లకు సమాచారం అందించాడు.తాను అగ్నిప్రమాద స్థలానికి వచ్చినపుడు భవనం నుంచి మంటలు వెలువడుతున్నాయని పాషా చెప్పారు. ‘‘కేవలం ఒక కిలోమీటరు దూరంలో ఉన్న మొఘల్‌పురా అగ్నిమాపక కేంద్రం నుంచి అగ్నిమాపక సిబ్బంది ఉదయం 7 గంటల తర్వాత మాత్రమే వచ్చారు, అప్పటికే మంటలు పై అంతస్తు నుంచి నేల వరకు వ్యాపించాయని, దీనివల్ల అగ్నిమాపక సిబ్బందితో సహా ఎవరూ ఇంట్లోకి ప్రవేశించడం అసాధ్యం అయింది’’ అని పాషా చెప్పారు.
మంటల వల్ల లోపలకు వెళ్లలేక పోయాం...
ఉదయం మసీదులో ప్రార్థనల నుంచి తిరిగి వస్తున్న కొంతమంది యువకులు అగ్నిప్రమాదం జరిగిన ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించారని, కానీ తీవ్రమైన వేడి, పొగ కారణంగా వారు వెనక్కి తగ్గారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.భవనం ప్రధాన ద్వారం మంటల్లో చిక్కుకోవడంతో, మేం షట్టర్,గోడను కూడా పగలగొట్టి లోపలికి ప్రవేశించామని, కానీ మంటలు ఎక్కువగా ఉండటంతో వారిని రక్షించలేకపోయామని స్థానికులు చెప్పారు.అగ్నిమాపక వాహనాలు, అంబులెన్స్‌లు సంఘటనా స్థలానికి ఆలస్యంగా వచ్చాయని కొందరు ఆరోపించారు.
అగ్నిప్రమాదాలు జరగకుండా భద్రతా చర్యలేవి?
బహుళ అంతస్తుల భవనాల్లో అగ్ని భద్రతా చర్యలు లేకపోవడం, భద్రతా నిబంధనలను పాటించడంలో వైఫల్యం వల్ల ఈ విషాదం జరిగింది.గుల్జార్ హౌస్ లోని ఒక భవనంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగినప్పుడు మరణించిన 17 మందిలో ఎనిమిది మంది పిల్లలు ఉన్నారు.ఈ జీ ప్లస్ టు భవనం గ్రౌండ్ ఫ్లోర్‌లో దుకాణాలు ఉండగా కుటుంబాలు పై అంతస్తులో నివసిస్తున్నాయి.అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బంది పనితీరు చాలా పేలవంగా ఉందని, గోడలను బద్దలు కొట్టడానికి వారి వద్ద డ్రిల్ మెషీన్ కూడా లేదని రాజేంద్ర మోదీ స్నేహితుడు సత్యనారాయణ అగర్వాల్ ఆరోపించారు.అగ్ని ప్రమాద స్థలానికి అంబులెన్స్‌లు చేరుకోవడంలో ఆలస్యం కావడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.అగ్నిమాపక శాఖ ఆలస్యంగా స్పందించడం, ఆక్సిజన్ మాస్క్‌లు లేకపోవడం, అగ్నిమాపక వాహనాలలో తగినంత నీటి సరఫరా లేకపోవడం ఈ విషాదానికి కారణమైందని మృతుల బంధువులు ఆరోపించారు.